NRI-NRT

లండన్‌లో ముగ్గురు భారతీయుల హత్య

Tamil Family Of Three Killed In West London

ఆదివారం అర్థరాత్రి వెస్ట్‌ లండన్‌ పోలీసులకు రెండు, మూడు ఫోన్లు వచ్చాయి. బ్రెంట్‌ఫోర్డ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నాలుగవ అంతస్తు ఫ్లాట్‌లో నివసిస్తోన్న కుహరాజ్‌ సీతమ్‌పరమనాథన్‌ (42) ఇంట్లో ఎవరూ ఫోన్లు ఎత్తడం లేదని, వారికేమయిందో తెలసుకోవాలన్నదే ఆ ఫోన్ల సారాంశం. పోలీసులు ఆదివారం రాత్రే ఆ ఫ్లాట్‌కు వెళ్లగా లోపలి నుంచి ఎలాంటి శబ్దాలు వినిపించలేదు. తలుపులు కొట్టినా ఎవరూ పలుకలేదు. తలుపులు లోపలి నుంచి లాక్‌ చేశారా, బయటి నుంచి లాక్‌ చేసి కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్లారా? తెలియక పోలీసులు వెనుతిరిగి వచ్చారు. పోలీసులు మళ్లీ ఆ ఫ్లాట్‌కు వెళ్లి చూడగా లోపలి నుంచి ఎలాంటి అలికిడి వినిపించలేదు. పోలీసులు ఇక లాభం లేదనుకొని తలుపులు బద్దలు కొడుతుండగా ఏదో దబ్బున పడిపోయిన శబ్దం వినిపించింది. డైనింగ్‌ హాల్లో తల నుంచి రక్తం కారుతున్న కుహ రాజ్‌ మతదేహం కనిపించింది. అప్పుడప్పుడే ప్రాణం పోయినట్లు శరీరం నుంచి కారుతున్న వెచ్చని రక్తం తెలియజేస్తోంది. ఇల్లంతా పోలీసులు వెతికి చూడగా, భార్య 36 ఏళ్ల పూర్ణ కామేశ్వరి శివరాజ్, వారి కుమారుడు మూడేళ్ల కైలేష్‌ కుహరాజ్, పెంపుడు కుక్క వేర్వేరు చోట రక్తం మడుగుల్లో పడి ఉన్నారు. అందరి మెడలు కత్తితో కోసి చంపినట్లు ఉన్నాయి. భార్యా పిల్లడు మరణించి వారం, పది రోజులు అయింటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

సెప్టెంబర్‌ 21వ తేదీ నుంచి ఆ ఇంటికి, ఎవరు వచ్చి పోయినట్లుగా, ఇంట్లో మనిషులున్నట్లు అలికిడి వినిపించలేదని ఇరుగు పొరుగువారు పోలీసు విచారణలో తెలిపారు. చూడ ముచ్చటైన జంటని, అన్యోన్యంగానే ఉండేవారని, అపార్ట్‌మెంట్‌లో ఎవరు కనిపించినా కుహరాజ్ హలో అని నవ్వుతూ పలకరించే వారని, కుక్క పిల్లను వాహ్యాలికి బయటకు తీసుకెళ్లినప్పుడు కూడా భార్యాభర్తలు నవ్వుతూ అందరిని పలకరించే వారని వారు చెప్పారు. అప్పుడప్పుడు భార్యాభర్తలు అరచుకోవడం వినిపించేదని, కొన్ని సార్లు ఇద్దరి మధ్య సుదీర్ఘంగా వాగ్వాదం జరిగేదని కూడా చెప్పారు. ఆ మాత్రం గొడవలు ప్రతి ఇంట్లో, ప్రతి జంట మధ్య ఉండేవేనని వారన్నారు. ఇలా చంపుకోవాల్సినంత కర్మ వారికెందుకొచ్చిందో పాపం! అంటూ ఇరుగుపొరుగు వారు సానుభూతి చూపించారు. పోలీసులు మాత్రం కుహ రాజ్‌పై హత్యా, ఆత్మహత్య కేసులను నమోదు చేసుకొని వెళ్లారు. మృతదేహాలకు గురువారం నాడు పోస్ట్‌ మార్టమ్‌ నిర్వహిస్తారని, ఈ హత్యలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా తమకు అందజేసి తమ దర్యాప్తునకు సహకరించాల్సిందిగా డిటెక్టివ్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ సైమన్‌ హార్డెన్‌ అపార్ట్‌మెంట్‌ వాసులకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు. మలేసియాకు చెందిన ఆ తమిళ జంట 2015లో కౌలాలంపూర్‌లో తమ పెళ్లిని రిజిస్టర్‌ చేయించుకున్నారు.