Health

ఉపవాసంతో ప్రమాదం ఉంది

ఉపవాసంతో ప్రమాదం ఉంది

ఇతరుల మాట ఎలా ఉన్నా, మధుమేహులు ఉపవాస దీక్షలో ఉండడం ప్రమాదమేమో అనిపిస్తుంది. ఎందుకంటే , వారానికి ఒకటి రెండు రోజులు ఉపవాసం ఉండడం వేరు. అలా కాకుండా ఏ రంజాన్‌ సందర్భంగానో ఏకంగా నెల రోజుల పాటు దీక్షలో ఉండడం కొంత ప్రమాదమేమో కదా అనిపిస్తుంది. ఆ మాటకొస్తే, దీర్ఘకాలంగా మధుమేహం ఉండడంతో పాటు అది నియంత్రణలో లేని వారు, రోజూ పలుమార్లు ఇన్సులిన్‌ తీసుకుంటున్న వారు, తరచూ గ్లూకోజ్‌ నిల్వలు పడిపోయే హైపోగ్లైసీమియా సమస్య ఉన్నవారు అప్పటికే తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాఽధపడుతున్నవారు, రెటినోపతి వంటి కంటి సమస్యలు ఉన్నవారు, ఉపవాస దీక్షకు పూనుకుంటే సమస్య మరీ జటిలమయ్యే ప్రమాదం ఉంది.అలా కాకుండా ఆ వ్యాధులు ఉన్నా, అవి బాగా నియంత్రణలో ఉన్నవారు, ఉపవాస దీక్ష చేపట్టవచ్చు. కాకపోతే, ఉదయం 4 గంటలకు ముందు, సాయంత్రం 7 తర్వాత తీసుకునే ఆహార పానీయాల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా రక్తంలో షుగర్‌ నిల్వలు భారీగా పడిపోకుండా అతి జాగ్రత్తగా ఉండాలి.షుగర్‌ నిల్వలను నియంత్రణలో ఉంచుకోవడం అనేది ఎప్పడూ కీలకమైన అంశమే. ముఖ్యంగా రక్తంలో షుగర్‌ నిల్వల్ని వేగంగా పెంచే ఫ్యాటీ ఫుడ్స్‌ను దూరంగా పెడితేనే మేలు. అలాగే ఉపవాస దీక్షను విరమించే సమయంలో తీసుకునే ఖర్జూర పళ్లను ఒకటి రెండింటికే పరిమితం చేయడం శ్రేయస్కరం. అందుకు భిన్నంగా ఫ్యాటీఫుడ్స్‌, ఖర్జూర పండ్లు అతిగా తీసుకున్న కారణంగా రంజాన్‌ చివరి నాటికి కొందరు బరువు పెరిగిపోవడం అసాఽధారణ విషయమేమీ కాదు.మధుమేహం ఉన్నవాళ్లు కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటేనే మేలు. కొద్ది మోతాదులో పండ్లు తీసుకుంటూ, కొబ్బరి నీళ్లు, మజ్జిగ బాగానే తీసుకోవచ్చు.సులువుగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలకే ప్రాధాన్యమివ్వాలి అలాగని వేటినీ పొట్టనిండా తినేయకూడదు.
ఎక్కువగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, నూనెలు ఎక్కువగా వాడినవి, మరీ తీపిగా ఉన్నవీ తీసుకోకపోవడమే మంచిది. భోజనంతో పాటు సూప్స్‌, సలాడ్స్‌, స్టీమ్డ్‌ లేదా గ్రిల్‌ చేసిన చేపలు, లేదా కోడి మాంసం పరమితంగా తినవచ్చు.
సులభంగా జీర్ణమయ్యేందుకు వీలుగా ఆహార పదార్థాల్ని చిన్న మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవడం ఉత్తమం.జాగ్రత్తలన్నీ పాటిస్తూనే ఉన్నా, వివిధ కారణాల వల్ల ఒక్కోసారి షుగర్‌ నిల్వలు పడిపోవచ్చు అలాంటి సమయాల్లో వెంటనే డాక్టర్‌ను సంప్రతించడం ఎంతో అవసరం.
*****ఉపవాసంలో తీసుకోవలసిన ఆహార పదార్థాలు…
ఓట్లు, సెమోలినా, మల్టీగ్రేన్‌ లేదా గోదుమ బ్రెడ్‌ తీసుకోవచ్చు
పీచుపదార్థం ఉండే ఆ రుతువులో వచ్చే తాజా పండ్లను, కూరగాయలను తీసుకోవాలి.దీక్షలో ఉన్నప్పుడు శరీరం వేగంగా శక్తిహీనం అయ్యే ప్రమాదం లేకుండా, ప్రొటీన్‌ కోసం గుడ్లు, తక్కువ ఉష్ణోగ్రతలో వండిన మాంసంతో పాటు ఒక కప్పు పెరుగు తీసుకోవడం కూడా అవసరమే.శరీరం డీ- హైడ్రేషన్‌కు గురికాకుండా తాజా పళ్లరసాలు, కొబ్బరినీళ్లు, నీళ్లు, పాలు తరచూ తీసుకుంటూ ఉండాలి.ఈ జాగ్త్రత్తలు ఉపవాస దీక్షలో ఉన్నవారు నీరసించి, నిస్ర్తాణకు గురికాకుండా చేస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులకు అవసరమైన శక్తినిస్తాయి.