శాస్త్రసాంకేతిక విజ్ఞానంతో ప్రకృతినీ సంరక్షించవచ్చు అంటున్నారు మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు. అవునుమరి, జీవహింస తగదన్న కారణంతో ప్రయోగశాలలోనే మాంసాన్ని తయారుచేస్తున్నారు. కానీ ఇళ్లకీ ఫర్నిచరుకీ అవసరమైన కలపకోసం మాత్రం చెట్లను కొట్టక తప్పడం లేదు. మున్ముందు ఆ అవసరం లేకుండా చెక్కనీ ప్రయోగశాలలో చేయడానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం జినియా మొక్క ఆకుల కణాలను సేకరించి వాటిని ఓ ద్రావణంలో వేయగా అవి భారీ సంఖ్యలో పెరిగాయట. తరవాత వాటిని త్రీ డైమెన్షనల్‌లో ఉన్న జెల్లీలాంటి ఓ పదార్థంలోకి పంపించగా- మరింతగా పెరిగాయట. వాటికి ఆక్సిన్, సైటోకైనిన్ హార్మోన్లను కలపగా కణాల సంఖ్య మరింత పెరగడంతో పాటు చెక్కలోని దృఢత్వానికి కారణమైన లిగ్నిన్ పదార్థమూ ఉత్పత్తయిందట. మొత్తమ్మీద చిన్న సైజు చెక్క ముక్క తయారయిందట. ఆపై ఆ రెండు హార్మోన్ల శాతాన్ని మార్చి మార్చి వేసి ఏది ఎంత పాళ్లలో వేస్తే లిగ్నిన్ ఉత్పత్తవుతుందో గమనించారట. అలా అచ్చం చెక్క లాంటి పదార్థాన్ని తయారుచేయగలిగారు. అంటే- ముందుముందు ల్యాబ్‌లో చేసిన చెక్కతోనే ఇళ్లూ ఫర్నిచర్ తయారవుతాయన్నమాట.
చెక్కను కృత్రిమంగా తయారు చేయవచ్చు అంట!
Related tags :