Business

అద్దెకు సోఫాలు-వాణిజ్యం

అద్దెకు సోఫాలు-వాణిజ్యం

* భారత్‌లోని కటుంబాలు దాతృత్వ కార్యకలాపాల్లో మరింతగా లీనమవుతున్నాయి. స్వల్పకాలిక దానాలే కాదు.. లాభాపేక్ష రహిత సంస్థలకు దీర్ఘకాల నిధులు ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గడం లేదు. గతేడాది కరోనా నేపథ్యంలోనూ వీరు సమాజానికి మేలు చేశారు. ఈ ఏడాది కూడా ఈ ధోరణి కొనసాగుతుందని వ్యూహాత్మక వితరణ సంస్థ దస్రా విడుదల చేసిన ఒక నివేదిక చెబుతోంది. ఆయా కుటుంబాల ఆసక్తులు వేరే అయినా కూడా, యువతరం మాత్రం సమాజహితానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలిపింది. ఇటీవల గివ్‌ఇండియా నిర్వహించిన సర్వేలో దేశంలోని 85 శాతం మంది వితరణశీలురు తమ దాతృత్వ పరిమాణాన్ని పెంచనున్నట్లు తెలిపిన అంశాన్ని ఉదహరించింది. స్థానిక కమ్యూనిటీలకు మరింతగా వితరణ చేయాలని 74 శాతం మంది భావిస్తున్నారనీ గుర్తు చేసింది. ‘సాధారణ పరిస్థితులు నెలకొనే కొద్దీ, వ్యక్తిగత వితరణశీలుర ప్రాధాన్యాలు మారొచ్చేమో కానీ.. అందులో నాలుగో వంతు మాత్రం ఈ ఏడాది చురుగ్గానే ఉండొచ్చు. ఈ ఏడాది సామాజిక స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎస్‌ఎస్‌ఈ) వంటి కొత్త ప్లాట్‌ఫారమ్‌ల రాకతో దానశీలుర సంఖ్య మరింత పెరగవచ్చ’ని ఆ నివేదిక పేర్కొంది.

* ఇప్పటి వరకు ఇళ్లు, కార్లు, ఏసీల వంటివి అద్దెకు తీసుకోవడం తెలుసు. ఆ కోవలో ఇప్పుడు ఫర్నీచర్‌ అద్దెకు ఇచ్చే సంస్థలు వెలుస్తున్నాయి. సోఫాలు, మంచాలు, డైనింగ్‌ టేబుళ్లు.. ఇలా, ఏదైనా అద్దెకు తీసుకునే సదుపాయం వీటి దగ్గర ఉంటోంది. దీనికి ఎంతో మంది మొగ్గుచూపుతున్నారు కూడా. టేబుళ్లు, సోఫా, మంచాలు కొని, కొన్నాళ్లకు మొహం మొత్తినా, మళ్లీ కొత్తవి కొనాలంటే అయ్యే ఖర్చు తలచుకుంటూ, ఇబ్బంది పడే బదులు నచ్చినంత కాలం వాడుకుని వెనక్కి ఇవ్వటం మేలనే ఆలోచన చేస్తున్నారు. తరచు బదిలీపై వెళ్లాల్సిన వారు, వీసా రాగానే విదేశాలకు వెళ్లాలనుకునే యువతరం… అద్దె ఫర్నీచర్‌ను ఇష్టపడుతోంది. పైగా ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. దీంతో దేశీయంగా ఫర్నీచర్‌ అద్దెకు ఇచ్చే మార్కెట్‌ శరవేగంగా పెరుగుతోంది.

* అక్షరాలా రూ.150 లక్షల కోట్లు. ఇదీ మన దేశంలో బ్యాంకుల వద్ద ఉన్న డిపాజిట్ల మొత్తం. బ్యాంకులకు ఇటీవల కాలంలో డిపాజిట్ల ప్రవాహం పెరిగింది. ఫలితంగా గత నెలాఖరు నాటికి బ్యాంకుల వద్ద ఉన్న డిపాజిట్ల మొత్తం రూ.150 లక్షల కోట్లను మించిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న బ్యాంకు డిపాజిట్ల మొత్తంతో పోల్చితే, ఈ మొత్తం దాదాపు 11 శాతం అధికం. ఆశ్చర్యకరంగా గత ఏడాది కాలంలో బ్యాంకు డిపాజిట్లు అనూహ్యంగా పెరగటంపై బ్యాంకింగ్‌ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

* ఇన్‌స్టెంట్‌ కాఫీ తయారీ సంస్థ అయిన సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌, తన సబ్సిడరీ కంపెనీని తనలో విలీనం చేసుకోనుంది. సీసీఎస్‌ ప్రోడక్ట్స్‌కు చిత్తూరు జిల్లా వరదాయపాలెం మండలంలో సీసీఎల్‌ బేవరేజస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే పేరుతో ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది. ఇది కూడా ఇన్‌స్టెంట్‌ కాఫీ తయారీలో నిమగ్నమైన సంస్థే. ప్రధానంగా ఎగుమతుల కోసం ఉద్దేశించిన ప్లాంటు ఈ కంపెనీ కింద ఉంది. దీనిని ఇప్పుడు మాతృ సంస్థలో విలీనం చేయబోతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే బోర్డు స్థాయిలో నిర్ణయం తీసుకొని వాటాదార్ల అనుమతి, ఇతర చట్టపరమైన అనుమతులు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వ్యాపార కార్యకలాపాలు సమర్థంగా కొనసాగించేందుకు, వ్యయాలు తగ్గించటానికి, ఇతర ప్రయోజనాల కోసం సబ్సిడరీ కంపెనీని విలీనం చేయాలని సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ యాజమాన్యం నిర్ణయించింది.

* బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న శ్రీరామ్‌ ప్రోపర్టీస్‌ త్వరలోనే పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఇందుకుగాను సెబీకి సంబంధిత దరఖాస్తు పత్రాలను సమర్పించింది. ప్రతిపాదిత ఈ ఇష్యూ ద్వారా రూ.800 కోట్లు సమీకరించాలని కంపెనీ అనుకుంటోంది. సెబీకి సమర్పించిన పత్రాల ప్రకారం.. ఇష్యూలో భాగంగా రూ.250 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా మరో రూ.550 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 58 శాతం వాటా కలిగిన టీపీజీ కేపిటల్‌, టాటా కేపిటల్‌, వాల్టన్‌ స్ట్రీట్‌ కేపిటల్‌, స్టార్‌వుడ్‌ కేపిటల్‌లు ఈ ఇష్యూలో కొంత మేర వాటాను విక్రయించనున్నాయి. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించగా వచ్చే నిధులు సంబంధిత వాటాదార్లకే వెళ్తాయి. కొత్తగా విక్రయించే షేర్ల ద్వారానే కంపెనీ నిధులు సమీకరించనుంది. ఈ నిధులను రుణాల చెల్లింపునకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. ప్రధానంగా దక్షిణ భారత్‌పై ఎక్కువగా దృష్టి సారించిన శ్రీరామ్‌ ప్రోపర్టీస్‌ ఇప్పటికే పలు స్థిరాస్తి ప్రాజెక్టులను పూర్తి చేయగా.. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి.