Editorials

వ్యాపారంగా మారిన అంతిమ యాత్ర

వ్యాపారంగా మారిన అంతిమ యాత్ర

కోవిడ్ భయం – మారిన అంతిమ సంస్కారం

కొవిడ్‌ భయంతో పెద్దగా కనిపించని ఆప్తులు, బంధువులు

కొన్నిచోట్ల కన్న బిడ్డలూ కడచూపునకు దూరం

కొత్త వ్యాపారంగా అంత్యక్రియల ప్రక్రియ

రూ.30 వేల నుంచి లక్ష వరకూ ప్యాకేజీలు

సమాజంలో గత రెండు నెలలుగా అంతిమ సంస్కారాల తీరే మారిపోయింది. ‘సాధారణ మరణం అంటున్నారు కానీ కరోనాతోనే చనిపోయి ఉండొచ్చు, పోనీ మరణించిన వ్యక్తికి పాజిటివ్‌ లేకపోయినా అంతిమ యాత్రకు వచ్చే వారి నుంచి కొవిడ్‌ సోకే ప్రమాదం ఉంది’ అని అత్యంత సన్నిహితులు, సమీప బంధువులు ఎవరూ వెళ్లడం లేదు. చివరి చూపునకు దూరమవుతున్నారు. కొన్నిచోట్ల వేరే ప్రాంతాల్లో ఉన్న సొంత కుటుంబ సభ్యులు కూడా కదలడం లేదు. దీంతో అంతిమ సంస్కారాలనే కొందరు వ్యాపార అవకాశంగా మలచుకున్నారు. పలు ప్రాంతాల్లో అంబులెన్సుల వారు, అంతిమయాత్ర వాహనాల యజమానులు ప్యాకేజీలు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ‘‘కరోనాతో చనిపోయినా ఏం పర్లేదు, మేమే తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేసి అస్థికలు తెచ్చిస్తాం. రేటు ఎక్కువ అవుతుంది’’ అని చెబుతున్నారు. శ్మశానాల దూరాన్ని బట్టి రూ.20 వేల నుంచి లక్ష వరకూ వసూలు చేస్తున్నారు. దగ్గరివారు రానందున ఏదో విధంగా ఈ కార్యక్రమం పూర్తయితే చాలు అన్నట్లు ప్యాకేజీ మాట్లాడుకుని తమ బంధువు దహన కార్యక్రమాలు పూర్తి చేసినట్లు శ్రీధర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. సహజ మరణం పొందినా రావడానికి అతి దగ్గరి బంధువులూ భయపడుతున్నారని ఆయన వివరించారు. కనీసం ఒకరిద్దరు కూడా రావట్లేదని తామే పూర్తి చేస్తున్నామని హైదరాబాద్‌లోని ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ చెప్పారు.

అంబులెన్స్‌ యజమాని నుంచి కాటికాపరి దాకా…

కొవిడ్‌ అంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో మృతదేహాన్ని తరలించే అంబులెన్స్‌ యజమాని మొదలుకొని దహన ఏర్పాట్లు చేసే కాటికాపరి దాకా అందరూ రూ.వేలల్లో అడుగుతున్నారు. ఆసుపత్రిలో రూ.లక్షల ఫీజు కట్టినా దహనానికి మరో రూ.లక్ష ఖర్చయిందని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి వాపోయారు. కరోనా లేనప్పుడు అయిన మొత్తంతో పోలిస్తే ఏడాది వ్యవధిలోనే 2 నుంచి 5 రెట్లు ఎక్కువ పెరిగిందని హైదరాబాద్‌లో ఓ కాటికాపరి చెప్పారు. కొందరు పేదలు ఈ ఖర్చులు భరించలేక శవాలను మున్సిపాలిటీ లేదా పంచాయతీల సిబ్బందికి అప్పగించేస్తున్నారు.

సాధారణంగా చనిపోయినా…
గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి సమీపంలో ఓ వృద్ధుడు ఇంట్లోనే సాధారణ మరణం చెందారు. ఇంటి పక్కనే ఉన్న అతి దగ్గరి బంధువులు కూడా రాలేదు. హైదరాబాద్‌లో ఉండే కూతుళ్లూ వెళ్లలేదు. చివరికి ఆ ఇంటి వారు రూ.30 వేలకు ప్యాకేజీ మాట్లాడారు. మృతదేహాన్ని తెనాలి శ్మశానానికి తీసుకెళ్లి ఆ ప్యాకేజీ సంస్థ వారే దహనం చేశారు. వారే అస్థికలు అప్పగించి వెళ్లారు. సాధారణ పరిస్థితుల్లో అయితే అదే పల్లెటూరిలో శవ దహనానికి రూ.10 వేలు కూడా ఖర్చు కాదు. కొవిడ్‌ భయంతో మరో రెండు రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు.

పెద్దకర్మ క్రియలన్నీ మూడో రోజే
హైదరాబాద్‌లో ఓ వృద్ధుడు ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో ఓ చిన్న పరిశ్రమలో పనిచేసేవారు. సాయంత్రం 5 గంటలకు బైక్‌పై ఇంటికెళుతూ కిందపడి మరణించారు. పోస్టుమార్టం చేసిన ఉస్మానియా వైద్యులు గుండె ఆగిపోవడంతో మరణించినట్లు నివేదిక ఇచ్చారు. కానీ శవ దహనానికి బంధువులెవరూ రాలేదు. ఒక శ్మశానంలో రూ.40 వేలు అడిగారు. ఇలా మూడు చోట్ల తిరిగితే ఒకచోట రూ.20 వేలకు ప్యాకేజీ కుదిరింది. కార్యక్రమాన్ని అల్లుడే నిర్వహించారు. సాధారణంగా పెద్దకర్మను 11 నుంచి 15 రోజులకు చేస్తారు. కొవిడ్‌ పరిస్థితుల్లో బంధువులెవరూ రాలేమని చెప్పడంతో పెద్దకర్మ క్రియలన్నీ మూడో రోజే ముగించేశారు.

ఉస్మానియా నుంచి శ్రీకాకుళానికి రూ.40 వేలు
ఇటీవల ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఉస్మానియా ఆసుపత్రిలో మరణించారు. స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా. అక్కడికి శవాన్ని తరలించడానికి అంబులెన్స్‌ కిరాయి రూ.40 వేలు అడిగారు. అంత చెల్లించలేక ఇక్కడే శ్మశానంలో దహనం చేశారు. దగ్గరి వారు ఎవరూ లేకుండానే కార్యక్రమం ముగించేసినట్లు మృతుని బంధువు ఒకరు వాపోయారు.

* మనదేశంలో సాధారణ పరిస్థితుల్లో అంత్య క్రియలు, పెద్దకర్మ, ఇతర కార్యక్రమాలకు సగటున ఒక్కో మరణానికి రూ.50 వేల దాకా ఖర్చు అవుతుందని అనధికారిక అంచనా. ఇప్పుడు అంబులెన్స్‌లో శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడానికే అంతకన్నా ఎక్కువ ఖర్చవుతోంది. కరోనా భయంతో పెద్దకర్మ భోజనాలకు పెద్దగా జనం రావడం లేదు.

* తాజా గణాంకాల ప్రకారం 2018 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకూ మనదేశంలో 80.77 లక్షల మంది కన్నుమూశారని అధికారికంగా నమోదైంది. 2019 గణాంకాలు ఇంకా విడుదల కాలేదు. ఒక మరణంపై సగటున కనీసం రూ.50 వేల ఖర్చు చొప్పున లెక్కించినా 80 లక్షలకు ఏటా దేశంలో రూ.40 వేల కోట్లను ప్రజలు ఖర్చుపెడుతున్నారని అంచనా. ఇప్పుడు కరోనా భయంతో అంబులెన్సులు, శవ దహనాల ఖర్చులు బాగా పెరగడంతో ఈ వ్యయం ఇంకా ఇంకా పెరిగిపోయి ఉండవచ్చని జనాభా లెక్కల విభాగం అధికారి ఒకరు చెప్పారు.