WorldWonders

సంధ్యారాణే బాధితురాలు-తాజావార్తలు

AR Constable Sandhya Rani Is The Victim

* వివాహం అయ్యిందని తెలిసే తనను పెళ్లి చేసుకున్న భర్త ప్రస్తుతం వేధిస్తున్నాడని ఏఆర్ కానిస్టేబుల్ సంధ్య రాణి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. సంధ్య రాణిపై ఆమె భర్త చరణ్‌ తేజ్‌ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. తనకు వివాహం అయిన సంగతి తెలిసే పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాత తనను దూరం పెడుతున్నాడని సంధ్య రాణి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక భర్త చరణ్‌ తేజ్‌ తనను కులం పేరుతో దూషించి, వేధింపులకు గురి చేస్తున్నట్లు సంధ్య రాణి ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు చరణ్ తేజ్‌పై ఐపీసీ 498ఏ, 506, వరకట్న నిరోధక చట్టంతో పాటు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక చరణ్ తేజ్‌ సంధ్యా రాణికి గతంలోనే రెండు వివాహాలు అయ్యాయని.. ఆ విషయం దాచి తనను పెళ్లి చేసుకుందని ఆరోపించాడు. తనను తీవ్రంగా కొట్టడంతో పాటు తల్లిదండ్రులు, స్నేహితులను కలవనీయకుండా చేస్తోందన్నారు. సంధ్యారాణి కుటుంబం నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ శంషాబాద్‌ డీసీపీకి ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు.

* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ మిషన్లను ప్రారంభించారు. నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రుల్లో సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ మిషన్లను సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రులను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో 11 టీచింగ్‌ ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో 16 టీచింగ్‌ ఆస్పత్రులను ఆందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. వీటన్నింటినీ ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తామని తెలిపారు.

* తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ను మే 30 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకులకు లాక్‌డౌన్ నుంచి తెలంగాణ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇప్పటి వరకు హైవేలపై ఉన్న బంకులు మాత్రమే తెరిచి ఉంచే అవకాశం ఉండేది.

* వ్యాక్సినేషన్‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం ఇక పై కరోనా నుంచి కోలుకున్న వారు మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం తాజాగా వెల్లడించింది. ఇటీవల 45 రోజుల వ్యవధి ఉండగా ప్రస్తుతం దాన్ని మూడు నెలలకు పెంచింది.

* ప్రజలు బాగుంటేనే ఊరు బాగుంటుంది. కరోనా వేళ ప్రజల క్షేమమే లక్ష్యంగా.. ఆ గ్రామ పెద్దలు కష్టమైనా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను గ్రామస్తులంతా ఇష్టంగానే ఆచరిస్తున్నారు. అందరూ ఒక్కటై కట్టుబాటుతో కరోనా వైరస్‌ను కట్టడి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం పెదపట్టపు పాలెం విజయగాథ ఇది. మత్స్యకార గ్రామమైన పెదపట్టపు పాలెంలో 4,329 జనాభా ఉండగా.. వారిలో పురుషులు 2,147 మంది, మహిళలు 2,098 ఉన్నారు. గత నెలలో ఆ గ్రామంలో రెండు పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. వెంటనే గ్రామ కాపులు (మత్స్యకార పెద్దలు) అప్రమత్తమయ్యారు. ఇకపై గ్రామంలో ఒక్క కేసు కూడా రాకుండా చేయాలనే లక్ష్యంతో కఠిన నిర్ణయాలు తీసుకుని.. సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుకు తీర్మానం చేశారు. దురాయి (చాటింపు) వేయించి.. ప్రజలు ఎవరైనా నిబంధనలను వ్యతిరేకిస్తే జరిమానా తప్పదని తెలియజేశారు.

* భవిష్యత్‌పై ఆశలు చిగురింపజేసే వార్తలు మీ కోసం…

? దేశంలో వరుసగా మూడో రోజు కొత్త కేసులు 3 లక్షల్లోపు నమోదయ్యాయి. తాజాగా 2,67,334 మందికి పాజిటివ్‌గా తేలింది. కొత్త కేసుల సంఖ్య అదుపులో ఉండటంతో కొవిడ్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 32,26,719కి చేరింది. క్రియాశీల రేటు 13.29 శాతంగా ఉంది. మంగళవారం ఒక్కరోజే 3,89,851 మంది కోలుకోగా.. రికవరీల సంఖ్య 2.19 కోట్లకు పైబడింది. రికవరీరేటు 85.60 శాతానికి చేరింది. ఇప్పటి వరకు 18,58,09,302 మంది టీకా వేయించుకున్నారని కేంద్రం తెలిపింది.

? పేద ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సాయం అందించడంలో భాగంగా నాలుగు జిల్లాల్లో ఏపీ ప్రభుత్వం సీటీ స్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెల్లూరు, ఒంగోలు, క‌డ‌ప‌, శ్రీ‌కాకుళం ప్రభుత్వాసుపత్రుల్లో వీటి సేవలను ప్రారంభించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీటిని సీఎం జగన్‌ బుధవారం ప్రారంభించారు. మరో ఏడు చోట్ల ఏర్పాటు చేస్తామని చెప్పారు.

?రాష్ట్ర ప్రజలకు కొవిడ్‌ టీకాలను పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించింది. రాష్ట్ర వైద్య సదుపాయాల మౌలిక వసతుల సంస్థ (టీఎస్‌ఎంఐడీసీ) ద్వారా కోటి వ్యాక్సిన్ల కోసం ఈ టెండర్లను పిలిచింది. నెలకు కనీసం 15లక్షల డోసులు సరఫరా చేయాలని.. 6 నెలల్లో కోటి డోసులు సరఫరా చేయాలని నిబంధనల్లో పేర్కొంది. టెండర్ల దాఖలకు ఈనెల 21 వరకు అవకాశం కల్పించింది.

? దేశంలో జూన్‌ నుంచి కరోనా మరణాల్లో తగ్గుదల కనిపిస్తుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు అమలు చేయడంతో పాటు, టీకా కొరతను అధిగమిస్తామని వారు చెబుతున్నారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందేలా చూడటం వల్ల కరోనా మరణాల్లో గణనీయమైన తగ్గుదల ఉంటుందని తెలిపారు. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా రోజువారీ వ్యాక్సిన్లను ఎక్కువమందికి వేయడం ద్వారా మరణాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

? కొవిషీల్డ్‌ టీకాకు సంబంధించి రెండు డోసుల మధ్య విరామ సమయాన్ని 12-16 వారాలకు కేంద్రం పెంచిన సంగతి తెలిసిందే. అయితే విరామం పెరిగినంత మాత్రన వచ్చే ఇబ్బంది ఏదీ లేదని అంటున్నారు దిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ శాస్త్రవేత్త సత్యజిత్‌ రథ్‌. ‘‘మొదటి డోసు పొందిన నాలుగు వారాల తర్వాత నుంచి ఎప్పుడైనా రెండో డోసు ఇవ్వొచ్చు. 6 నెలలలోపు ఇస్తే సరిపోతుంది. అయినా దాని బూస్టర్‌ సామర్థ్యంలో తేడా ఉండదు. అద్భుతంగా రోగ నిరోధక స్పందనను పెంచుతుంది’’ అని తెలిపారు.

? లాక్‌డౌన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన వారి కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1250 కోట్లతో రిలీఫ్‌ ప్యాకేజీ ప్రకటించింది. పూలు, పండ్లు, కూరగాయలు సాగు చేసే రైతులకు హెక్టార్‌కు గరిష్ఠంగా ₹10వేల చొప్పున సాయం అందించనుంది. ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు, భవన నిర్మాణ కార్మికులకు ₹3వేలు, క్షురకులు, రజకులు, దర్జీ పని వాళ్లు, స్వర్ణకారులు, మెకానిక్‌లు తదితర అసంఘటిత రంగ కార్మికులు, వీధి వ్యాపారులకు ₹2వేలు చొప్పున సాయం ప్రకటించింది.

? ఇంట్లో చిన్నారులకు కూడా కొవిడ్‌ సోకితే ఏమౌతుందోనన్న భయాందోళన చెందుతున్న వారికి ఊరట. చిన్న పిల్లలకు కరోనా సోకినా వారిలో తీవ్ర లక్షణాలు ఉండవని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ పేర్కొన్నారు. పిల్లల్లో పెద్ద లక్షణాలు ఉండవు కాబట్టి వారికి సాధారణ చికిత్స సరిపోతుందన్నారు. అయితే వైరస్‌ తన స్వభావాన్ని మార్చుకుంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుందని, అందువల్ల దానిపై కన్నేసి ఉంచాలన్నారు.

? కరోనా నుంచి కోలుకున్న అనంతరం కొందరిలో బయటపడుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులకు చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్‌ బుధవారం ఆదేశాలు జారీచేశారు. కరోనా నుంచి కోలుకున్న వారికి వచ్చే బ్లాక్‌ ఫంగస్‌కు చికిత్సచేయాలన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు సింఘాల్‌ ఆదేశాలు జారీచేశారు.

?గడచిన వారం రోజుల్లో భారత్‌లో కరోనా కేసులు 13 శాతం తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (వ్హో) ఒక ప్రకటనలో తెలిపింది. అంతకు ముందు వారంతో పోలిస్తే (మే 16 వరకు) వారం రోజులుగా తాజా కేసుల్లో 13శాతం, మరణాల్లో 5శాతం తగ్గుదల ఉన్నట్లు వీక్లీ రిపోర్టులో వెల్లడించింది. ప్రపంచంలోని అన్ని రీజియన్లలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆ నివేదికలో వెల్లడించింది.

? లాక్‌డౌన్‌ నుంచి పెట్రోల్‌ బంకులకు తెలంగాణ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకులు సాధారణ సమయాల్లో తెరిచేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధాన్యం సేకరణ, మిల్లులకు రవాణా చేయడం తదితర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. జాతీయ రహదారుల వెంబడి ఉన్న పెట్రోలు బంకులకు ఇప్పటికే పూర్తి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.