Business

APSRTC ద్వారా తిరుమల టికెట్లు-వాణిజ్యం

APSRTC ద్వారా తిరుమల టికెట్లు-వాణిజ్యం

* తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ కల్పిస్తోంది. ఇందుకోసం ప్రతి రోజు వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంచుతోంది. ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తు రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు ఛార్జీలతోపాటు రూ.300 అదనంగా చెల్లించి శీఘ్రదర్శనం టికెట్టు పొందొచ్చు. ఈ టికెట్లు పొందిన భక్తులకు ప్రతిరోజు ఉదయం 11 గంటలు, సాయంత్రం 4 గంటల స్లాట్లలో శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.

* భారత్‌ దిగుమతి చేసుకొంటున్న బంగారంలో దాదాపు సగం ఒకే దేశం నుంచి వస్తోంది. 2020-21 లెక్కల ప్రకారం భారత్‌ మొత్తం 34.6 బిలియన్‌ డాలర్లు విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోంది. దీనిలో 16.3 బిలియన్‌ డాలర్ల పుత్తడి స్విట్జర్లాండ్‌ నుంచే వచ్చింది. కరోనా రాక ముందు ఏడాది కంటే 2020-21లో భారత్‌ 6.4 బిలియన్‌ డాలర్లు అధికంగా దిగుమతి చేసుకొంది. ఇక స్విట్జర్లాండ్‌ నుంచి దిగుమతులు కూడా 7.8శాతం 18.2 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీంతో భారత్‌కు నాలుగో అతిపెద్ద దిగుమతిదారుగా అవతరించింది. గతంలో ఆ స్థానంలో సౌదీ అరేబియా ఉండేది. ఇక చైనా నుంచి దిగుమతుల్లో 0.07శాతం తగ్గుదల నమోదై 65.21 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మొత్తం(అన్నిరకాల వస్తుసేవల) దిగుమతుల్లో ఇప్పటికీ అత్యధిక వాటా చైనాదే. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, యూఏఈ ఉన్నాయి. బంగారం వినియోగదారుల్లో ప్రపంచలోనే చైనా తర్వాతి స్థానంలో భారత్‌ ఉంది.

* ‘దేశీయ ఉక్కు రంగానికి వృద్ధి అవకాశాలు ఇంకా ఎంతో ఉన్నాయి. కానీ స్టీలు కంపెనీల షేర్ల ధరలు ఎంతో తక్కువగా 5- 6 పీఈ (ప్రైస్‌ ఎర్నింగ్స్‌)లో ఉండటమేమిటి? సిమెంటు కంపెనీల షేర్లు మాత్రం 30- 35 పీఈలో ఉన్నాయి’ అని స్టాక్‌మార్కెట్‌ అగ్రశ్రేణి ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా నెల రోజుల క్రితం ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. అదే నమ్మకాన్ని ఆయన కార్యరూపంలోకి తీసుకువచ్చినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ రంగ స్టీలు కంపెనీ సెయిల్‌ (స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌) షేర్లను స్టాక్‌మార్కెట్లో రాకేశ్‌ భారీగా కొనుగోలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌లో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా 5.75 కోట్ల సెయిల్‌ షేర్లు కొనుగోలు చేశారు. ఈ షేర్లు సెయిల్‌ జారీ మూలధనంలో 1.39 శాతానికి సమానం. సెయిల్‌ షేరు ధర ఈ ఏడాది ఏప్రిల్‌ ప్రారంభంలో రూ.80 వద్ద కనిపించింది. ఆ తర్వాత రూ.146 వరకు పెరిగినా, ప్రస్తుతం రూ.127 పలుకుతోంది. సెయిల్‌ షేర్లను రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కొనుగోలు చేశారనే అంశం స్టాక్‌మార్కెట్‌ మదుపరుల్లో చర్చనీయాంశంగా మారింది. కొంత కాలం పాటు స్టీలు కంపెనీలు మెరుగైన ఆదాయాలు నమోదు చేసే అవకాశం ఉండొచ్చనే నమ్మకంతోనే రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సెయిల్‌ షేర్లు కొనుగోలు చేశారని అనుకుంటున్నారు.

* రోజురోజు పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంధన ధరలతో సతమతమవుతున్న ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టిపెట్టారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఇప్పటికే పలు కంపెనీలు రంగంలోకి దిగాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తితో పాటు ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి పలు కంపెనీలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. కాగా తాజాగా ప్రముఖ కార్ల తయారీదారు టాటా మోటార్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకోసం హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌)తో టాటా మోటర్స్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.