Business

కుదేలవుతున్న ప్రపంచ మార్కెట్లు-వాణిజ్యం

కుదేలవుతున్న ప్రపంచ మార్కెట్లు-వాణిజ్యం

* పండుగ‌ల సీజన్ వ‌చ్చేసింది.. దాంతోపాటు సొంతిల్లు సొంతం చేసుకోవాల‌ని ఆకాంక్షించే వారికి శుభ త‌రుణం కూడా వ‌చ్చేసింది. బ్యాంకుల‌న్నీ ఇండ్ల కొనుగోలుదారుల‌కు త‌క్కువ వ‌డ్డీకే రుణాలు ఆఫ‌ర్ చేస్తున్నాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్‌.. ఫెస్టివ్ సీజ‌న్‌లో ఇండ్ల రుణాలు తీసుకునే క‌స్ట‌మ‌ర్ల‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అన్ని శ్లాబ్‌ల రుణాల‌పైనా 6.70 శాతం వ‌డ్డీరేట్ ఆఫ‌ర్ చేస్తోంది. ఈ ఆఫ‌ర్ సెప్టెంబ‌ర్ 20 నుంచి అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు అన్ని నూత‌న ఇండ్ల రుణాల‌కు వ‌ర్తిస్తుంద‌ని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది.

* భార‌త్‌లో య‌మ‌హ ఎట్ట‌కేల‌కు న్యూ ఆర్15 బైక్‌ను లాంఛ్ చేసింది. ఎంట్రీ లెవెల్ స్పోర్ట్స్ బైక్‌లో ఇది నాలుగో జ‌న‌రేష‌న్ మోడ‌ల్ బైక్ కాగా, ఇది స్టాండ‌ర్డ్‌, హ‌య్యార్ స్సెక్ ఎం రెండు వెర్ష‌న్ల‌లో అందుబాటులో ఉంది. 2021 య‌మ‌హ ఆర్‌15 ధ‌ర రూ 1,67,800 కాగా, ఆర్‌15ఎం రూ 1,77,800 (ఎక్స్‌షోరూం)ల‌కు ల‌భిస్తుంది. ఆర్‌15 బైక్ లాంఛ్‌పై గ‌త కొద్దినెల‌లుగా ఊరిస్తున్న య‌మ‌హ తాజాగా స్పోర్ట్స్ బైక్‌కు సంబంధించిన వివ‌రాల‌ను ప్ర‌క‌టించింది.

* కొవిడ్‌-19లా ప్రపంచానికి చైనా నుంచి మరో ముప్పు వచ్చే సంకేతాలు కన్పిస్తున్నాయి. దశాబ్దకాలం క్రితం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని కుదిపేసిన లేమాన్‌ బ్రదర్స్‌ తరహా సంక్షోభం మరోటి చైనా నుంచి రాబోతుందన్న భయాలు ప్రస్తుతం ఫైనాన్షియల్‌ మార్కెట్లలో బాగా పెరిగాయి. ఈ ప్రభావంతోనే ఈక్విటీలు, బాండ్లు, వర్థమాన దేశాల కరెన్సీలు ఒక్కసారిగా పతనబాట పట్టాయి. చైనాలో రెండో అతిపెద్ద రియల్టీ కంపెనీ ఎవర్‌గ్రాండే దివాలా తీస్తుందన్న ఆందోళన మార్కెట్లలో సోమవారం మరీ పెరిగిపోయింది. 305 బిలియన్‌ డాలర్ల మేర రుణ (దాదాపు రూ.23 లక్షల కోట్లు) చెల్లింపుల్ని చేయాల్సిఉన్న ఎవర్‌గ్రాండే ఈ సెప్టెంబర్‌ 23, 29 తేదీల్లో బాండ్లకు వడ్డీలు చెల్లించాల్సివుంది. ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితిలో కూడా లేని ఎవర్‌గ్రాండే వచ్చే కొద్దిరోజుల్లో వడ్డీ చెల్లింపుల్లో విఫలమైతే కంపెనీ బాండ్లు డిఫాల్ట్‌ క్యాటగిరీల్లోకి చేరిపోతాయి. దాంతో ఆ కంపెనీకి రుణాలిచ్చిన ఆర్థిక సంస్థలు, ఫండ్స్‌ సంక్షోభంలో కూరుకుపోయి, ప్రపంచ మార్కెట్లు, తద్వారా కంపెనీలు అల్లాడిపోతాయి. లేమాన్‌ బ్రదర్స్‌ను అమెరికా ప్రభుత్వం ఆదుకోకపోవడంతో ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ కుప్పకూలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన పరిణామం ఇప్పుడు మార్కెట్లను కలవరపరుస్తున్నది.

* కిటెక్స్‌, మలబార్‌ గోల్డ్‌ బాటలోనే మరికొన్ని కేరళ కంపెనీలు పయనిస్తున్నాయి. కిడ్స్‌వేర్‌కు దేశంలోనేగాక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కిటెక్స్‌ సంస్థ.. కేరళ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకొని తెలంగాణలో పెట్టిన విషయం తెలిసిందే. రూ.2,400 కోట్లతో రెండు చోట్ల పరిశ్రమలు స్థాపిస్తున్న సంగతీ విదితమే. ఇక కేరళకే చెందిన వజ్రాభరణాల తయారీ దిగ్గజం మలబార్‌ గోల్డ్‌ సైతం రాష్ట్రంలో రూ.750 కోట్లతో నగల తయారీతోపాటు రిఫైనరీని స్థాపించనున్నట్లు గత వారం ప్రకటించింది. ఈ వరుసలోనే తాజాగా అర డజనుకుపైగా కేరళకు చెందిన కంపెనీలు తెలంగాణ పరిశ్రమల శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాయిప్పుడు.

* పలు ప్రతికూల సంకేతాల నడుమ అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం దేశీ స్టాక్‌ సూచీలు తీవ్ర నష్టాలతో ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 525 పాయింట్ల నష్టంతో 58,491 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 188 పాయింట్లు క్షీణించి 17,397 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారంలో జరగనున్న పలు దేశాల కేంద్ర బ్యాంకుల సమావేశాల్లో ఉద్దీపనల్ని తగ్గింంపుపై నిర్ణయాలు తీసుకుంటారన్న అంచనాలు, చైనా రియల్టీ దిగ్గజం ఎవర్‌గ్రాండే దివాలా తీస్తుందన్న భయాలతో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరిగాయని, ఈ దిశగానే ఇక్కడి సూచీలు కూడా తగ్గినట్లు ట్రేడర్లు తెలిపారు. రూపాయి విలువ హఠాత్తుగా క్షీణించడం కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని వారన్నారు. ముఖ్యంగా ఈ వారంలో జరిగే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కమిటీ మీటింగ్‌లో వడ్డీ రేట్ల పెంపు, ఉద్దీపన ఉపసంహరణ షెడ్యూల్స్‌ వెల్లడయ్యే అవకాశం ఉన్నందున, ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా అమ్మకాలు జరుపుతున్నట్లు జూలియన్‌ బేర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మిలింగ్‌ ముచ్చాలా చెప్పారు. ఈ వారంలో ఇంగ్లాం డ్‌, జపాన్‌ సహా 16 దేశాల కేంద్ర బ్యాంకు ల సమావేశాలు జరగనున్నాయి. చైనా రియల్టీ కంపెనీ దివాలా తీస్తే ఈ ప్రభావం అన్ని మార్కెట్లపై పడుతుందన్న భయాలు కూడా ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరగడానికి కారణమని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఎస్‌ రంగనాథన్‌ తెలిపారు.

* కరోనా సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరైన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఉద్యోగుల జీతాలను పెంచే దిశగా కార్పొరేట్లు యోచిస్తున్నట్లు డెలాయిట్‌ సర్వే తెలిపింది. ఈ క్రమంలోనే 2022లో ఉద్యోగుల వేతనాలు 8.6 శాతం మేర పెరిగే వీలుందని చెప్పింది. ఈ ఏడాది 92 శాతం దేశీయ కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగులకు సగటున 8 శాతం వేతన పెంపునిచ్చాయి. గతేడాది 4.4 శాతంగానే ఉన్నది. కేవలం 60 శాతం కంపెనీల్లోనే జీతాలు పెరిగాయి. కొవిడ్‌-19 కారణంగా 2020లో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కఠిన లాక్‌డౌన్‌ను అమలు పర్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది పరిస్థితులు చక్కబడటంతో వచ్చే ఏడాది ఉద్యోగుల జీతాలను సగటున 8.6 శాతం పెంచేందుకు కార్పొరేట్‌ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు తమ రెండో ‘వర్క్‌ఫోర్స్‌ అండ్‌ ఇంక్రిమెంట్‌ ట్రెండ్స్‌ సర్వే 2021’లో డెలాయిట్‌ పేర్కొన్నది. ఇది కరోనాకు ముందున్న ఇంక్రిమెంట్‌కు అద్దం పడుతున్నది.