Devotional

వెంకన్న బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు

వెంకన్న బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు

సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. అన్నమయ్య భవనంలో ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్‌ రమణా రెడ్డి తో కలసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు. అనం తరం ఆయన మీడియాతో మాట్లాడారు . రెండున్నరేళ్ల తర్వాత బ్రహ్మోత్సవాలు నాలుగు మాడ వీధుల్లో నిర్వహిస్తుండటం ,పెరటాశి మాసం రావడంతో భక్తులు భారీగా వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు.బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు మాస్క్ తప్పని సరిగా ధరించాలన్నారు . తిరుమల , అలిపిరి లో భక్తుల కోసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు . సెప్టెంబ‌రు 26న‌ అంకురార్పణ. 27న సాయంత్రం 5.45 నుంచి 6.15 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో ధ్వజారోహ‌ణం, ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ‌ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. అక్టోబరు 1న గరుడ సేవ, 2న స్వర్ణర‌థం, 4న రథోత్సవం, 5న చక్రస్నానంను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో సామాన్య భ‌క్తుల‌కు పెద్దపీట వేస్తూ స‌ర్వద‌ర్శనం మాత్రమే అమ‌లు చేస్తున్నామని అన్నారు. ఆర్జిత సేవ‌లు, శ్రీ‌వాణి, వీఐపీ బ్రేక్ ద‌ర్శనాలు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల త‌ల్లిదండ్రుల‌కు ప్రత్యేక ద‌ర్శనం త‌దిత‌ర ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నామని వివరించారు. 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల‌ను అద‌నంగా ఏర్పాటు చేసి పరిశుభ్రతను మరింత మెరుగుపరచనున్నట్లు చైర్మన్‌ వెల్లడించారు.