Politics

ఎవరి అంతరాత్మ ఎలా ప్రబోధిస్తుందో?..

ఎవరి అంతరాత్మ ఎలా ప్రబోధిస్తుందో?..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి..

ఈ లెక్కన మొత్తం శాసనసభ్యులన్న 175 సంఖ్యను 8తో భాగిస్తే ఒక్కో అభ్యర్థి గెలుపుకోసం 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు అవసరం. ఏ ఇద్దరు అభ్యర్థులైనా 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు లోపే ఆగిపోతే అప్పుడు రెండవ ప్రాధాన్యం ఓట్లు కీలకం కానున్నాయి. తెలుగుదేశం అభ్యర్థికి రెండో ప్రాధాన్యం ఓట్లు పడే అవకాశం లేకపోవడం అధికార పార్టీకి కలిసొచ్చే అంశం. కానీ, అధికార పార్టీ నుంచి ఒక్కటైనా క్రాస్‌ ఓటింగ్‌ జరిగితే మాత్రం తెదేపా అభ్యర్థి గెలుపు లాంఛనమే.

అసెంబ్లీలో బలాబలాలు ఇలా..

అసెంబ్లీలో పార్టీల బలాబలాలను చూస్తే అధికార వైకాపాకు 151 మంది సభ్యుల బలం ఉంది. ఈ బలం ఆరుగురు సభ్యులను మాత్రమే గెలిపించుకునేందుకు సాధ్యపడుతుంది. 2019 ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్‌లు వైకాపాలో చేరారు. వీరితో పాటు జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్‌ కూడా వైకాపాతోనే ఉన్నారు. దీంతో తమకు నైతికంగా 156 మంది సభ్యుల బలం ఉందని వైకాపా చెబుతోంది. అయితే, అధికార వైకాపాను అసంతృప్తి ఎమ్మెల్యేల ముసలం వేధిస్తోంది. ఆ పార్టీ నుంచి గెలుపొందిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిలు గత కొంతకాలంగా ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తామని ఇద్దరూ బహిరంగంగానే స్పష్టం చేశారు. దీంతో అధికార వైకాపాలో అలజడి మొదలైంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వైకాపాకు ఓటు వేయకుంటే ఆ పార్టీకి మిగిలే బలం 154. ఆ మొత్తం సభ్యులు కచ్చితంగా అధికార పార్టీ నిలబెట్టిన ఏడుగురు సభ్యులకు ఒక్కొక్కరూ 22 ఓట్లు వేసేందుకు సరిపోతుంది. ఇక్కడే అధికార పార్టీని క్రాస్‌ ఓటింగ్‌ భయం వెంటాడుతోంది. గురువారం పోలింగ్‌ నేపథ్యంలో బుధవారం రాత్రి ఎమ్మెల్యేలందరితో వైకాపా విందు భేటీ నిర్వహిస్తున్నట్టు సమాచారం..

క్రాస్‌ ఓటింగ్‌ పైనే తెదేపా ఆశలు..

ఇప్పటికే 3 సార్లు మాక్‌ పోలింగ్‌ నిర్వహించినా 132 మందికి మించి వైకాపా సభ్యులు హాజరుకాకపోవటం, హాజరైనా వారిలోనూ నలుగురు ఎమ్మెల్యేలు చెల్లని ఓట్లు వేయడం వంటి పరిణామాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. దీంతో 154 మంది వైకాపా ఎమ్మెల్యేలను ఏడు బృందాలుగా విభజించి ఒక్కో బృందానికి 22 మందిని కేటాయించి ప్రతి బృందానికి ఇద్దరు, ముగ్గురు మంత్రుల పర్యవేక్షణ ఉండేలా జాగ్రత్తపడుతోంది. అంతరాత్మ ప్రభోదానుసారం ఓటెయ్యాలంటూ తెదేపా ఇస్తున్న పిలుపునకు అనుగుణంగా పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారనే అనుమానం అధికార పార్టీకి లేకపోలేదు. రహస్య ఓటింగ్ కారణంగా తమ అభ్యర్థి గెలుపు ఖాయమని తెలుగుదేశం ధీమా వ్యక్తం చేస్తోంది..

అధికార పార్టీ నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరైనా లేక, చెల్లని ఓటు వేసినా తెలుగుదేశం పార్టీకి వచ్చే లాభం ఏమీ లేకపోవటంతో క్రాస్‌ ఓటింగ్‌పైనే ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. తమ పార్టీలో ప్రస్తుతం ఉన్న 19 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి తప్పు లేకుండా ఓటు వేసుకునేలా కరసత్తు ముమ్మరం చేసింది. రేపు సాయంత్రం 4గంటలకు పోలింగ్‌ ముగియగానే కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. సాయంత్రానికికల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది.

వైకాపా శాసనసభ్యుల్లో కొందరిపై నిఘా?

ప్రతి ఓటూ కీలకమైనందున అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరి కదలికలను ఇంటెలిజెన్స్‌ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కష్టం అనే పరిస్థితి ఉన్నవారు, పార్టీ అదనపు సమన్వయకర్తలను నియమించిన నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీపై అసంతృప్తితో ఉన్నవారు, కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండని వారు.. ఇలా పలు కారణాలతో కొందరిపై వైకాపా అధిష్ఠానం దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్‌, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు, ఉమ్మడి విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్యే, ఇంకొందరు ఇంటెలిజెన్స్‌ పర్యవేక్షణలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.