WorldWonders

చైత్రమాసం దాని విశిష్టత..

చైత్రమాసం దాని విశిష్టత..

చైత్రమాస ప్రారంభం :

వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం చైత్రమాసం. చైత్రమాసం అనగానే మనకి ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి వరకూ వసంత నవరాత్రులు… సంవత్సరంలో మనం మూడు సార్లు నవరాత్రులు జరుపుకుంటాము. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు, రెండవది భాద్రపదమాసంలో వచ్చే గణపతి నవరాత్రులు, మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. చైత్ర శుద్ధ విదియ నాడు బాలచంద్రుడిని బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలుపోగు అని విదియ నాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగు అని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకీ నూలుపోగు సమర్పించి, మనకి జ్ఞానాన్నిమ్మని కోరుతారు.

చైత్ర శుద్ధ తదియ నాడు సౌభాగ్య గౌరీ వ్రతం, సౌభాగ్య శయన వ్రతం, ఆ రోజున పార్వతీపరమేశ్వరులను దమనంతో పూజించి, డోలోత్సవం నిర్వహిస్తారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి, వేదాలను రక్షించిన రోజు. చైత్ర శుద్ధ పంచమి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈ రోజు పూజించాలి. అశ్వములను కూడా ఈ రోజు పూజించాలి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవావతారం కూడా ఒకటి. ఈ రోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు. శ్రీరామ పట్టాభిషేకము చేయించిన మంచిది. ఒకవేళ చేయలేకపోయినా, శ్రీరామాయణంలో రామపట్టాభిషేకము ఘట్టము పారాయణము చేయడం మంచిది. చైత్ర శుద్ధ అష్టమి భవానిదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు. ఆరోజు భవాని మాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి, అశోకవృక్షం చిగురుని సేవిస్తే గర్భ శోకం కలుగదు అని శాస్త్రము చెప్పింది.

చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి. శ్రీమహావిష్ణువు తన పూర్ణావతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు. చైత్ర శుద్ధ ఏకాదశిని వరూధిన్యేకాదశి, కామద ఏకాదశి అని అంటారు. చైత్ర శుద్ధ పౌర్ణమి స్త్రీలు చిత్రవర్ణాలు గల వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈ రోజు చిత్రగుప్తుని వ్రతం చేసిన మంచిది. ఉత్తర భారతదేశంలోని వారు హనుమజ్జయంతిని జరుపుకుంటారు. చైత్ర బహుళ త్రయోదశి యజ్ఞవరాహ జయంతి. ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు, ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్ర మాసం.