Politics

సజ్జల 100 కోట్లు సంపాదించాడు… ఆనం ఆరోపణ

సజ్జల 100 కోట్లు సంపాదించాడు… ఆనం ఆరోపణ

నెల్లూరు : తాను క్రాస్ ఓటింగ్ చేసినట్టు ఆధారాలుంటే చూపించాలని వైసీపీ నేత ఆనం రాంనారాయణరెడ్డి సవాల్ విసిరారు. ఆయనపై క్రాస్ ఓటింగ్ ఆరోపణలు వచ్చిన అనంతరం తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం పని తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కోవడానికో.. కుటుంబ సభ్యులను హత్య చేయడానికో రాజకీయాల్లోకి రాలేదని ఆనం స్పష్టం చేశారు. ఇంకా ఆనం మాట్లాడుతూ.. ‘‘మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆరోపణలు చేస్తారా? నేను క్రాస్ ఓటింగ్ చేసినట్టు ఎన్నికల కమిషన్‌ను చెప్పమనండి. లేదంటే ఆధారాలుంటే బయట పెట్టండి. నేను క్రాస్ ఓటింగ్ చేసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరు చెప్పారు? రాజ్యాంగేతర శక్తితో పరిపాలన చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇవాళ సజ్జల వంద కోట్లకు ఎలా పడగలెత్తారో చెప్పాలి. అధికార పక్షం అయినంత మాత్రాన తాను తప్పులు ఎత్తి చూపకూడదని లేదు. ఎత్తి చూపిస్తే తప్పులు సరి చేసుకోవాలి కానీ కక్ష సాధింపునకు దిగ కూడదు.

క్రాస్ ఓటింగ్ చేశానో లేదో చెప్పాల్సింది నేను. నాపై ఆరోపణలు చేసే స్థాయి సజ్జలకు లేదు. నన్ను తప్పించడానికి నాలుగు నెలల క్రితమే కుట్ర చేశారు. సలహాదారు ఉద్యోగానికి సజ్జల ఎన్ని కోట్లు ఇచ్చారు. పోస్టింగ్‌లకు సజ్జల ఎన్ని కోట్లు తీసుకున్నారు. వ్యవస్థలు దిగజారుతున్నాయని సీఎంకు ఎప్పుడో చెప్పా. ప్రభుత్వంలో దోపిడీ జరుగుతోంది. సీఎంకు చెప్పినా పట్టించుకోవడం లేదు. టీడీపీలో ఏవైనా సమస్యలొస్తే.. వినేవారు.. అర్ధం చేసుకునేవారు. కానీ వైసీపీలో అలాంటి పరిస్థితులు లేవు. ఈ ప్రభుత్వంలో కుంభకోణాలు తప్ప మరేమీ లేవు. నేనెప్పుడూ నా వ్యక్తిగత పనులు చేయాలని కోరలేదు. అధికారుల మెడపై కత్తి పెట్టి పని చేయమనడానికి.. మీరేం చక్రవర్తులు కాదు.. సామ్రాజ్యాదీశులు కాదు. విలువలు లేవు కాబట్టే సజ్జల అందరిపై ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ తర్వాత ఎటు అనేది చూడాలి. నా భవిష్యత్ ప్రారంభమైందే టీడీపీలో.. మా కార్యకర్తలు, సన్నిహితుల సలహాలతో ఒక నిర్ణయం తీసుకుంటా. నిజమైన ప్రజాస్వామ్యవాది రాజశేఖర్ రెడ్డి. ప్రజాస్వామ్యమంటేనే తెలియని వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి. నన్ను ఓటు అడగలేదు. ఫలానా వారికి వేయమని చెప్పలేదు. అలాంటప్పుడు క్రాస్ ఓటింగ్ చేశాననడానికి ఆస్కారం లేదు’’ అని స్పష్టం చేశారు.