Business

స్టాక్ మార్కెట్:ఇన్వెస్టర్లు వచ్చే వారం మార్కెట్లతో జరభద్రం.. సెంటిమెంట్ అస్సలు బాలేదు..!

స్టాక్ మార్కెట్:ఇన్వెస్టర్లు వచ్చే వారం మార్కెట్లతో జరభద్రం.. సెంటిమెంట్ అస్సలు బాలేదు..!

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత మెుదటి మూడు వారాలు స్టాక్ మార్కెట్లు విజయాల పరంపరను కొనసాగించాయి. అయితే గత ట్రేడింగ్ వారంలో 1 శాతం కంటే తక్కువలో దలాల్ స్ట్రీట్ ముగిసింది. ప్రధానంగా ఐటీ రంగంలో బలహీనమైన క్యూ4 రాబడులు దీనికి కారణమయ్యాయి.

ప్రస్తుతం అంతర్జాతీయంగా ఐటీ సేవల రంగంలోని కంపెనీల పరిస్థితి వల్ల ఆదాయాల సీజన్ బలహీనంగా ప్రారంభం కావటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లు దెబ్బతిన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. దీనికి తోడు ఇతర గ్లోబల్ మార్కెట్లు సైతం అనిశ్చితి సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఊహాగానాలు దీనికి కారణంగా నిలుస్తున్నాయి.

ఇదే సమయంలో అమెరికాలో జాబ్ మార్కెట్ మృదువుగా ఉండటం, ఉత్పాదక కార్యకలాపాలు క్షీణించడం వంటి బలహీన సంకేతాలు మాంద్యం గురించి భయాలను పెంచాయని నినోద్ అభిప్రాయపడుతున్నారు. మరో పక్క దేశంలో ద్రవ్యోల్బణం చల్లబడుతున్నప్పటికీ దానిపై ఎంపీసీ సభ్యులు ఆందోళనలను కలిగి ఉన్నట్లు రిజర్వు బ్యాంక్ మినిట్స్ స్పష్టం చేశాయి. దీంతో మార్కెట్ల దృష్టి ఒక్కసారిగా బ్యాంకింగ్ రంగంపైకి మళ్లింది. వచ్చే వారం దేశీయ బ్యాంకులు తమ క్యూ4 ఆదాయ ఫలితాలను మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. ఇప్పటికే ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్ తమ ఫలితాలను గత వారాంతంలో విడుదల చేశాయి. అయితే బ్యాంకింగ్ రంగం ఫలితాలు ఎలా ఉంటాయని ఇన్వెస్టర్లు అంచనావేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే వారం మార్కెట్లు అస్థిరతలో కొనసాగవచ్చని ఎమ్కే వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ జోసెఫ్ థామస్ అంచనా వేశారు.