Politics

రిపబ్లిక్ టీవీ చర్చలో చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్.. ‘ఎన్డీఏకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా’ ? అని అడిగిన ప్రశ్నకు..

రిపబ్లిక్ టీవీ చర్చలో చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్.. ‘ఎన్డీఏకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా’ ? అని అడిగిన ప్రశ్నకు..

న్యూఢిల్లీ: జాతీయ మీడియా న్యూస్ ఛానల్స్‌లో ఒకటైన రిపబ్లిక్ టీవీ నిర్వహించిన చర్చా వేదికలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చర్చా వేదికలో ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘ఎన్డీఏకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా’ ? అని అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని చేసే పనులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్డీఏలో భాగస్వామి కావడమనేది మేటరాఫ్ టైమేనని చెప్పారు. అభివృద్ధి విషయంలో ప్రధాని ఏ ఆలోచనతో ఉన్నారో.. తానూ అదే ఆలోచనతో ఉన్నానని చంద్రబాబు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

దేశాభివృద్ధి కోసం.. తెలుగు ప్రజల కోసం తన పరిధిలో తాను పనిచేస్తున్నానని, ప్రధాని విజన్‌తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా తన పరిధి మేరకు కలిసి పనిచేయడానికి సిద్ధమని చంద్రబాబు ప్రకటించడం విశేషం. భారతదేశ బలమేంటో.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి చాటి చెబుతున్నారని చంద్రబాబు ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తారు. గతంలో కూడా తాను మోదీ పాలసీలను వ్యతిరేకించలేదని, ప్రత్యేక హోదా సెంటిమెంటుగా మారిందని, దాని మీద మాత్రమే తాను అప్పట్లో పోరాడానని చంద్రబాబు వివరించడం గమనార్హం.

రిపబ్లిక్ టీవీ నిర్వహించిన చర్చా వేదికలో చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..

* దేశాభివృద్ధి వేరు.. రాజకీయాలు వేరు..

* పార్టీలు వేరైనా.. విజన్ ఉన్న నేతలుగా ప్రధాని మోడీ.. నేనూ మాట్లాడుకున్నాం..

* ప్రతి రాజకీయ పార్టీ దేశాభివృద్ధి కోసం పని చేయాలి

* సంపద సృష్టి.. పేదరిక నిర్మూలన రెండూ ముఖ్యం

* టెక్నాలజీతో ఈ రెండూ సాధ్యం

* పేదరికం లేని సమాజంలో భాగంగా ప్రతి ఒక్కర్నీ ఎగువ మధ్య తరగతి కుటుంబ స్థాయికి చేర్చే ప్రయత్నం చేస్తాను

* పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్ షిప్ పాలసీని.. 4P పాలసీని రూపొందిస్తున్నాం

* పేదరికంలో ఉన్న కుటుంబాల ఆర్ధికాభివృద్ధి కోసం మెంటర్సును సిద్ధం చేయాలనే ఆలోచనతో ఉన్నాం

* నేను విజన్ 2020 అంటే.. నన్ను 420 అంటూ విమర్శలు చేశారు

* కానీ నా విజన్ 2020 హైదరాబాదులో సాకారమైంది

* సమాజం కోసం ముందుచూపుతో పని చేసే నేతలు ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు

* గతంలో నన్ను ప్రతిపక్షాలు విమర్శించేవి.. ఇప్పుడూ అలాగే విమర్శలు వస్తున్నాయి

* సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. సంస్కరణలు అమలు చేయాలి

* జీఎస్టీ రియాల్టీ.. డిజిటల్ కరెన్సీ రియాల్టీ

* రూ. 500కి పైన ఉన్న నోట్లను రద్దు చేస్తే.. అన్ని రకాల అవినీతి తగ్గిపోతుంది

* నేను అధికారం కోసం లేను.. దేశాభివృద్ధి కోసమే పని చేశాను

* వాజ్ పేయి హయాంలో టీడీపీకి ఆరేడు మంత్రిత్వ శాఖలు కేటాయిస్తామన్నా.. మేం అంగీకరించలేదు

* తెలుగు ప్రజలను అభివృద్ధి చేయడమే ప్రస్తుతం నా ముందున్న ప్రధాన లక్ష్యం

* పేదలు లేని ఏపీని రూపొందించడమే నా ముందున్న ప్రధాన కర్తవ్యం: చంద్రబాబు