Politics

ముఖ్యమంత్రి సభలో కునుకు.. అధికారిపై వేటు

ముఖ్యమంత్రి సభలో కునుకు.. అధికారిపై వేటు

🍥గాంధీనగర్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో కునుకు తీశారన్న కారణంగా ఓ అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. గుజరాత్‌లోని భుజ్‌లో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. 2001 నాటి గుజరాత్‌ భూకంప బాధితులకు పునరావాసంలో భాగంగా ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లకు సంబంధించి భుజ్‌లో పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సీఎం పటేల్‌ ప్రసంగిస్తుండగా.. సభికుల్లో ముందు వరుసల్లో కూర్చున్న ఓ అధికారి కునుకు తీస్తున్నట్లు కనిపిస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఆయన్ను భుజ్‌ మున్సిపాలిటీ చీఫ్‌ ఆఫీసర్‌ జిగర్‌ పటేల్‌గా గుర్తించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే రాష్ట్ర పట్టణాభివృద్ధి విభాగం ఆ అధికారిని విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపినందున నిబంధనల ప్రకారం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.