NRI-NRT

కూరుకుపోతున్న న్యూయార్క్ తాజా అధ్యయనం….

కూరుకుపోతున్న న్యూయార్క్  తాజా అధ్యయనం….

అమెరికాలోని అతిపెద్ద నగరం, ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన న్యూయార్క్ నెమ్మనెమ్మదిగా భూమిలోకి కూరుకుపోతుందని పరిశోధకలు సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. న్యూయార్క్ లోని అతిపెద్ద భవంతులు క్రమంగా నేలలోకి జారుకుంటున్నాయని పరిశోధన పేర్కొంది. నగరంలోని భవనాల బరువు కారణంగా సమీపంలోని నీటిలోకి మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ పరిస్థితిని సైన్స్ పరిభాషలో ‘ సబ్సిడెన్స్’ అంటారని పరిశోధకులు వెల్లడించారు.

న్యూయార్క్ మొత్తంలో మొత్తం 10 లక్షల భవనాల బరువు దాదాపుగా 1.7 ట్రిలియన్ పౌండ్లు( అంటే 764,000,000,000 కిలోలు) అని పరిశోధకులు తెలిపారు. ప్రతీ ఏడాది 1-2 మిల్లీమీటర్ల చొప్పున నగరం కూరుకుపోతుందని కనుగొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్‌లోని యుఎస్ జియోలాజికల్ సర్వే మరియు జియాలజిస్టులు ఈ పరిశోధనను చేపట్టారు. ఈ అధ్యయనం ఎర్త్ ఫ్యూచర్ జర్నల్‌లో ప్రచురించబడింది. ఉపగ్రహాల డేటాతో పోల్చి చూసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లోయర్ మాన్ హట్టన్ వేగంగా కిందకు వెళ్తోందని, బ్రూక్లిన్, క్వీన్స్ ప్రాంతాల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని పరిశోధన తెలిపింది.

న్యూయార్క్ దీంతో పాటు సముద్ర మట్టాల పెరుగుదల కారణంగా వరద ముప్పు ఎదుర్కొనే నగరాల్లో ఒకటిగా ఉంది. ఉత్తర అమెరికా అట్లాంటిక్ తీరం వెంబడి, ప్రపంచ సగటు కన్నా 3-4 రెట్లు సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. 84 లక్షల జనాభా ఉండే న్యూయార్క్ నగరం వివిధ స్థాయిల్లో ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని అమెరికా జియోలాజకిల్ సర్వేకు చెందిన పరిశోధకుడు, భూగర్భ శాస్త్రవేత్త టామ్ పార్సన్స్ నివేదికలో వెల్లడించారు. పెరుగుతున్న ప్రమాదాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.