ScienceAndTech

రేపు ఇస్రో మరో కీలక ప్రయోగం…..

రేపు ఇస్రో మరో కీలక ప్రయోగం…..

తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి సోమవారం ఉదయం 10:42 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగం చేపట్టనున్నారు.

ఇస్రో చేపట్టనున్న నావిగేషన్‌ ఉపగ్రహ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. జీఎస్‌ఎల్వీ–ఎఫ్‌ 12 రాకెట్‌ ద్వారా ఈ నెల 29న చేపట్టనున్న ఈ ప్రయోగానికి ఆదివారం కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి సోమవారం ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈ రాకెట్‌ ద్వారా నావిగేషన్‌ వ్యవస్థకు చెందిన 2,232 కిలోల ఎన్‌వీఎస్‌–01 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. శనివారం షార్‌కు చేరుకున్న ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌.. ఈ ప్రయోగ విజయం కోసం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరికి పూజలు చేశారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్‌) శనివారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాల్‌లో నిర్వహించారు. అనంతరం షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ అధ్యక్షతన లాంచింగ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) ప్రతినిధులు సమావేశమై ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రయోగానికి 27:30 గంటల ముందు ఆదివారం ఉదయం 7:42 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నారు. కౌంట్‌డౌన్‌ ముగియగానే సోమవారం ఉదయం 10:42 గంటలకు జీఎస్‌ఎల్వీ–ఎఫ్‌ 12 రాకెట్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. 19 నిమిషాల్లో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చనుంది.