NRI-NRT

కాలు జారి కింద పడిపోయిన బైడెన్….

కాలు జారి కింద పడిపోయిన బైడెన్….

అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌ గురువారం జరిగిన ఓ వేడుకలో స్లిప్‌ అయ్యి కిందపడిపోయారు. కొలరాడోలోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఏర్పాటు చేసిన మిలిటరీ గ్రాడ్యుయేట్స్ కార్యక్రమానికి బైడెన్‌ హాజరయ్యారు. ప్రారంభ ప్రసంగం ముగిసిన అనంతరం క్యాడెట్స్‌తో కరచాలనం చేసి నడుచుకుంటూ ముందుకు వెళుతున్న సమయంలో ఒక్కసారి తుళ్లి ముందుకు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అధ్యక్షున్ని పైకి లేపి అక్కడి నుంచి తీసుకెళ్లారు.

ఈ ఘటనలో బైడెన్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, ఆయన క్షేమంగాఉన్నారని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ బెన్ లాబోల్ట్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. క్యాడేట్స్‌తో కరచాలనం చేసి వస్తున్న క్రమంలో కాళ్లకు ఇసుక బస్తా తగిలి కింద పడ్డారని ఆయన వెల్లడించారు. వైట్‌ హౌస్‌కు తిరిగి వచ్చిన తర్వాత బైడెన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఇసుక బస్తాలు నన్ను పడేశాయంటూ చమత్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వయసై పోయింది కదా.. సహజమేనంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఈ వీడియో స్పందించిన ట్రంప్.. బైడెన్ మానసికంగా అసమర్ధుడు ఇప్పుడు నడవడానికి కూడా కష్టంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.