Devotional

సహస్ర కవచుడు….

సహస్ర కవచుడు….

“సహస్ర కవచుడు” అనే పేరుతో గల రాక్షసుడి కథ ఒకటి “మహాభారతం”లో ప్రక్షిప్తమై ఉన్నది. ఆసక్తికరంగా ఉంటుంది.

ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకాయన ఘోరమైన తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలని అడిగాడు.

”దేవా! నాకు 1000 కవచాలు ప్రసాదించు. ఒక కవచం బద్దలు కావాలంటే, వేయి సంవత్సరాలు తపస్సు చేసి వచ్చి వేయి సంవత్సరాలు నాతో యుద్ధం చేస్తే ఒక కవచం పోవాలి. అలా ఆ వరాన్ని ప్రసాదించు” అని కోరాడు.

ఈశ్వరుడు “తథాస్తు” అని వరమిచ్చి అంతర్థానమయ్యాడు.

ఆ వర బలంతో సహస్ర కవచుడు రెచ్చిపోయాడు. ముల్లోకాల పైన దండెత్తాడు. దేవతలు ఎవరూ ఎదిరించలేక పారిపోయారు. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తికి మొర పెట్టుకున్నారు. వారి మొర విని విష్ణుమూర్తి తానే నరనారాయణలు (కృష్ణార్జునులుగా) భూమిపై అవతరించాడు.

నారాయణుడు సహస్ర కవచుడితో 1000 సంవత్సరాలు యుద్ధం చేయసాగాడు. అదే సమయంలో నరుడు 1000 సంవత్సరాల యుద్ధం చేసాడు. వేయి సంవత్సరాలు ముగియగానే ఒక కవచం బద్దలైంది. తదుపరి నారాయణుడు వేయి సంవత్సరాలకు తపస్సు చేస్తుంటే నరుడు వేయి సంవత్సరాలు యుద్ధం చేసీ కవచం పగలగొట్టాడు. ఈ విధంగా నర నారాయణులు ఒకరు యుద్ధం చేస్తే మరొకరు తపస్సు చేయడం, మరొకరు యుద్ధం చేస్తే ఇంకొకరు తపస్సులో కూర్చోవడం జరిగింది.

అలా 999 కవచాలు ఊడిపోగా చివరకు ఒక కవచం మాత్రమే మిగిలింది. కవచుడు ప్రాణ భయంతో దేవతలని ప్రార్థించసాగాడు. ఎవరూ అభయమీయ లేదు. చివరికి జాలిపడిన సూర్యుడు అభయమిచ్చాడు. సూర్యుడిలో కవచుడు దాగుండిపోయాడు. అప్పుడు నరనారాయణులు కవచునికై వెదక సాగారు. ఆ విషయం సూర్య భగవానుకి తెలిసింది. అప్పుడే దూర్వాసుని వరం పొందిన కుంతీ సూర్యుణ్ణి ప్రార్థించింది. దూర్వాసుని వర ప్రభావము ఫలితంగా సూర్యుడు తనలో ఉన్న కవచుని కుంతికి గర్భాదానం చేశాడు. కుంతికి సహజ కవచం తో కవచుడు జన్మించాడు. కన్య అయిన కుంతి కవచుణ్ణి పెంచుటకు భయపడి నదిలో విడిచిపెట్టింది. అతడే రాధకు దొరికిన పసికందు. రాధేయుడనే పేరుతో ప్రసిద్ధి పొందిన కర్ణుడు.

కౌరవుల పక్షాన చేరిన కర్ణుడిని కురుక్షేత్రంలో సంహరించడానికి నరనారాయణులు సిద్ధమయ్యారు. నరుడు అర్జునుడయితే నారాయణుడు కృష్ణుడు. వారిద్దరికీ బేధం ఏమిలేదు. కర్ణుని సంహరించింది ఇద్దరైనా.. ఒక్కరే. అందుకే అశ్వద్ధామ నరనారాయణు లైన కృష్ణార్జునులను ఏమీచేయలేక పోయాడు. కృష్ణుణ్ణి ఏమీ చేయలేని నారాయణాస్త్రం అర్జునుణ్ణి కూడా ఏమీ చేయలేదు. రూపాలు వేరైనా కృష్ణార్జునులు ఒకే మూర్తులు, శక్తియుక్తులు అభేధ్యములు