Politics

నేడు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ

నేడు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ రానున్న రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను సోమవారం ప్రకటించింది. జూలై 24న జరిగే ఈ ఎన్నికల్లో డెరెక్ ఒబ్రెయిన్, డోలా సేన్, సుఖేందు శేఖర్ రే, సమీరుల్ ఇస్లామ్, ప్రకాశ్ చిక్ బరైక్, సాకేత్ గోఖలే పోటీ చేస్తారని ఓ ట్వీట్‌లో తెలిపింది. వీరు అంకితభావంతో ప్రజా సేవను కొనసాగిస్తారని, ప్రతి భారతీయుని హక్కుల కోసం పోరాడే టీఎంసీ ఔన్నత్యాన్ని బలోపేతం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది.డెరెక్ ఒబ్రెయిన్, సుఖేందు శేఖర్ రే, డోలా సేన్‌ల రాజ్యసభ సభ్యత్వాల పదవీ కాలం ముగియబోతోంది. వీరిని మరోసారి ఈ పదవి వరించబోతోంది. ఒబ్రెయిన్ రాజ్యసభలో టీఎంసీ నేత కాగా, రే డిప్యూటీ చీఫ్ విప్. బంగ్లా సంస్కృతి మంచ అధ్యక్షుడు సమీరుల్ ఇస్లామ్, టీఎంసీ అలిపుర్దార్ జిల్లా ప్రెసిడెంట్ ప్రకాశ్, ఆర్టీఐ యాక్టివిస్ట్, టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్‌లకు ఈసారి రాజ్యసభ సభ్యత్వాన్ని పొందే అవకాశం లభించింది.

డెరెక్, డోలా, ప్రదీప్ భట్టాచార్య, సుస్మిత దేవ్, శాంత ఛేత్రి, సుఖేందు శేఖర్ రాజ్యసభ సభ్యత్వాల పదవీ కాలం ఆగస్టు 18తో ముగియబోతోంది. కాబట్టి పశ్చిమ బెంగాల్‌లోని ఆరు రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు జరుగుతాయి. టీఎంసీ రాజ్యసభ సభ్యుడు లుయిజిన్హో ఫెలీరో ఏప్రిల్‌లో రాజీనామా చేయడంతో, ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఉప ఎన్నిక కూడా జూలై 24నే జరుగుతుంది. అదే రోజు గుజరాత్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు, గోవాలోని ఒక రాజ్యసభ స్థానానికి కూడా ఎన్నికలు జరుగుతాయి.

విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో పోటీ చేయబోమని కాంగ్రెస్ ఇటీవల ప్రకటించింది. శాసన సభలో తగిన ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2022లో జరిగిన గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి 156 స్థానాలు లభించగా, కాంగ్రెస్‌కు కేవలం 17 స్థానాలు మాత్రమే లభించాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 182 శాసన సభ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం రాజ్యసభ స్థానాల సంఖ్య 11 కాగా, ప్రస్తుతం ఎనిమిది మంది బీజేపీ సభ్యులు, ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు.కేంద్ర ఎన్నికల కమిషన్ జూలై 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేసింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూలై 13. కాగా నామినేషన్ల పరిశీలన జూలై 14న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 17 వరకు గడువు ఉంది. జూలై 24న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. జూలై 26తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.