Politics

ఆగస్టు 2, 3 తేదీల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ

ఆగస్టు 2, 3 తేదీల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ

మణిపూర్‌(Manipur) అంశంపై పార్లమెంటు(Parliament)లో చర్చ, ప్రధాని మోదీ(PM Modi) ప్రకటనకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 2 లేదా 3 తేదీల్లో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చర్చ తేదీని సోమవారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంగళవారం (ఆగస్టు 1) ప్రధాని మోదీ మహారాష్ట్ర(Maharashtra) పర్యటనకు వెళ్లనున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో వచ్చే బుధ, గురువారాల్లోనే అవిశ్వాస తీర్మానంపై చర్చ, సమాధానం, ఓటింగ్‌కు అవకాశం ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఆమోదం పొందాల్సిన కీలక బిల్లులు చాలానే ఉన్నాయి. వీటిలో అవిశ్వాస తీర్మానానికి తేదీ నిర్ణయం సహా ఢిల్లీ సర్వీసులకు సంబంధించిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లు ప్రధానమైనది. ఈ నేపథ్యంలో వచ్చే వారం జరిగే సమావేశాలు ప్రభుత్వానికి చాలా కీలకమైనవి. ప్రతిపక్షాల(opposition) తీరుచూస్తుంటే అత్యంత ఆసక్తిగా సాగే అవకాశం కనిపిస్తోంది. కాగా, ఢిల్లీ బిల్లుకు ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాతే అవిశ్వాస తీర్మానానికి తేదీ నిర్ణయించాలని, అవిశ్వాసం నెగ్గిన వెంటనే పార్లమెంటును వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మధ్యాహ్నంలోపే వాయిదా..ప్రతిపక్షాలు నిరసనను కొనసాగించడంతో శుక్రవారం కూడా మణిపూర్‌పై ఉభయ సభలు మధ్యాహ్నంలోపే వాయిదా పడ్డాయి. రాజ్యసభను ఉదయం 11.46కు, లోక్‌సభను 12.41కు వాయిదా వేశారు. అన్ని సభా కార్యకలాపాలను పక్కనపెట్టి.. మోదీ ప్రభుత్వంపై తాము పెట్టిన అవిశ్వాస తీర్మానం మీద చర్చించాలంటూ లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి(Adhir Ranjan Chaudhuri) డిమాండ్‌ చేశారు. విపక్ష సభ్యులు నిరసన వీడక పోవడంతో ప్రశ్నోత్తరాలు సాగడం మీకిష్టం లేదా? అని స్పీకర్‌ ఓం బిర్లా వారిని ప్రశ్నించారు. మధ్యాహ్నం తర్వాత సమావేశమైనా కార్యకలాపాలు కొద్దిసేపే సాగాయి. గందరగోళం మధ్యే లోక్‌ సభలో డెంటల్‌ కమిషన్‌ బిల్లు, గనులు, ఖనిజ వనరుల బిల్లును ఆమోదించారు. కాగా రాజ్యసభలో 267 నిబంధన కింద చర్చ ప్రారంభించాలని, ప్రధాని సభకు రావాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. తనతో వాగ్వావాదానికి దిగిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రయిన్‌పై చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటకాలు ఆడొద్దంటూ, బల్లను చరవొద్దంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఆయన వినకపోవడంతో సభను వాయిదా వేశారు. మణిపూర్‌పై చర్చ కోరుతూ శుక్రవారం 47 మంది విపక్ష ఎంపీలు నోటీసులిచ్చారు. ప్రశోత్తరాలు కీలకం అంటూనే.. నోటీసుపై స్వల్ప చర్చకు ధన్‌ఖడ్‌ అనుమతించారు. ఇంతలో డెరెక్‌ స్పందిస్తూ అదంతా తమకు తెలుసని నోటీసుపై చర్చ జరగాలని వ్యాఖ్యానించారు. దీనిపై గతంలోనూ ఇలానే ప్రవర్తించారంటూ ఆయనపై ధన్‌ఖడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.చైర్మన్‌ స్థానం పట్ల అగౌరవంగా ప్రవరిస్తున్నారని మండిపడ్డారు.

లిథియం తవ్వకం ప్రైవేటుకు!మణిపూర్‌ హింసపై చర్చించాలంటూ లోక్‌సభలో విపక్షాలు చేపట్టిన నిరసనల మధ్యే గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లుతో పాటు జాతీయ దంతవైద్య కమిషన్‌ బిల్లు, నర్సింగ్‌, ప్రసూతి వైద్య కమిషన్‌ బిల్లులను ఆమోదించారు. గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లుకు ఆమోదంతో లిథియం సహా 6 అణు ఖనిజాలు, బంగారం, వెండి, వజ్రాలు వంటి వాటిని తవ్వి తీసేందుకు ప్రైవేటు రంగానికి అనుమతి లభించింది. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మైనింగ్‌ చేస్తున్న 12 రకాల అణు ఖనిజాల్లో.. ఆరింటిని (లిథియం, బెరీలియం, నియోబియం, టైటానియం, టాంట్లామ్‌, జిర్కోనియం) ప్రైవేటు రంగానికి కేటాయించారు. దీని ద్వారా దేశంలో ఖనిజాల అన్వేషణ, మైనింగ్‌ పెరుగుతుందని భావిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. అలాగే లోతైన ప్రదేశాల్లో దొరికే ఖనిజాలైన బంగారం, వెండి, రాగి, జింక్‌, సీసం, కోబాల్ట్‌, ప్లాటినం, వజ్రాలు వంటి వాటిని గుర్తించడం, తవ్వి తీయడం ఎంతో ఖర్చుతో కూడుకున్నదని.. అందుకే ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నట్లు తెలిపింది. బిల్లులోని సవరణలు గేమ్‌ చేంజర్‌గా మారనున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. కాగా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో తెలిపింది. ‘‘చట్ట సవరణకు సంబంధించి గతేడాది జూలైలో జరిగిన ప్రిసైడింగ్‌ అధికారుల సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీనిపై రాజ్యాంగ, న్యాయ నిపుణులతో మరిన్ని సంప్రదింపులు జరపాల్సి ఉంది’’ అని పేర్కొంది.