Politics

కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలన్నదే గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఉద్దేశమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. గవర్నర్ పేరు చెప్పి ప్రభుత్వం బిల్లును వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ గవర్నర్ భూజాలపై పెల్చే ప్రభుత్వం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కేసీఆర్ ఎన్నిరోజులు ప్లాన్ చేశారని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఆర్టీసీని విలీనం గురించి ప్లాన్ చేయడానికి సంవత్సరాల కొద్ది సమయం పడుతుందని.. అలాంటిది గవర్నర్‌కు ఆర్టీసీ బిల్లు ఆమోదించడానికి రెండు, మూడు రోజులు మాత్రమే సమయం ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. రెండు రోజుల్లో ఫైల్ క్లియర్ చేయమంటే ఎలా? అని అడిగారు.

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ఉద్దేశం కేసీఆర్‌కు ఉందా? లేదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసే ఆలోచన ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏ ఫైల్ పంపితే ఆ ఫైల్‌ మీద రబ్బర్ స్టాంప్ వేస్తే కరెక్టా? అని అడిగారు. ఆర్టీసీ కార్మికులకు నష్టం జరగకూడదనే గవర్నర్ న్యాయ సలహాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఆకాశం, భూలోకం ఒక్కటైనా కూడా ఆర్టీసీ విలీనం జరగదని కేసీఆరే అన్నారని.. మరి ఇప్పుడు ఒక్కటయ్యాయా? అని ప్రశ్నించారు. ఈ బిల్లుకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోదని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుందంటే ఎవరూ కూడా అడ్డుకోరని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు తొలి నుంచి తాము అండగా ఉన్నామని చెప్పారు. తాము బిల్లుకు వ్యతిరేకం కాదని చెప్పారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ బిల్లుతో టైమ్ పాస్ చేసి.. కార్మికుల ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.