Politics

రాజ్‌భవన్‌ ముందు బైఠాయించి ఆర్టీసీ కార్మికుల నిరసన

రాజ్‌భవన్‌ ముందు బైఠాయించి ఆర్టీసీ కార్మికుల నిరసన

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ టీఎస్‌ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరిన సంగతి తెలిసిందే. అయితే గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఆర్టీసీ బిల్లును ఆమోదించ‌క‌పోతే రాజ్‌భ‌వ‌న్‌ను ముట్ట‌డిస్తామ‌ని తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌న్(టీఎంయూ) హెచ్చ‌రించింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికులు ఈరోజు పీవీ మార్గ్ నుంచి రాజ్‌భవన్‌ వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు. అంబేడ్కర్ విగ్రహం, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌ మీదుగా రాజ్‌భవన్‌ చేరుకున్నారు. రాజ్‌భవన్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఆర్టీసీ బిల్లను గవర్నర్ తమిళిసై ఆమోదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

రాజ్‌భవన్ ఎదుట నిరసన తెలిపేందుకు పెద్దఎత్తున ఆర్టీసీ కార్మికులు తరలివచ్చారు. ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించాలని కోరుతున్నారు. ఆర్టీసీ బిల్లు ఆమోదంపై స్పష్టత ఇచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని చెప్పారు. గవర్నర్‌ తమిళిసై‌తో చర్చలకు హాజరైనప్పటికీ.. బిల్లుపై ఆమోదముద్ర వేసేందుకు పట్టుబడుతామని చెబుతున్నారు. ఇక, రాజ్‌‌భవన్‌ ఎదుట ఆర్టీసీ కార్మికుల నిరసనతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.ఇదిలాఉంటే, ఆర్టీసీ యూనియన్ నాయకులను గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చర్చలకు ఆహ్వానించారు. ఉదయం 11.30 గంటలకు ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చిస్తామని గవర్నర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. ఆర్టీసీ యూనియన్ నాయకులతో మాట్లాడనున్నారు. దీంతో తాజా పరిణామాలు తీవ్ర ఉత్కంఠగా మారాయి.