Health

ఒంట్లో కొవ్వు సూచిక

ఒంట్లో కొవ్వు సూచిక

నడుం చుట్టుకొలత కొంతవరకు కడుపు లోపల, అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు మోతాదులనూ పట్టి చూపుతుంది. సాధారణంగా బొజ్జ ఎంత పెద్దగా ఉంటే ఇలాంటి కొవ్వూ అంతే ఎక్కువగానే ఉంటుంది. కొవ్వు ఎక్కువగా ఉండటం మంచిది కాదు. అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు ఇంకా హాని కలిగిస్తుంది. ఇది చాలారకాల తీవ్ర సమస్యల ముప్పు పెంచుతుంది.

అవయవాల చుట్టూ ఉండే కొవ్వు విచ్ఛిన్నమైనప్పుడు రక్తంలోకి కొవ్వు ఆమ్లాలు పెద్దమొత్తంలో చేరుకుంటాయి. ఫలితంగా రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులు పెరుగుతాయి. గుండె జబ్బు, అల్జీమర్స్‌ వంటి జబ్బులు వచ్చే అవకాశమూ ఎక్కువవుతుంది. కొవ్వు మూలంగా కణాలు ఇన్సులిన్‌ హార్మోన్‌కు స్పందించటమూ తగ్గుతుంది. ఇది మధుమేహం తలెత్తటానికి దోహదం చేస్తుంది. పైగా అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వుతో పుట్టుకొచ్చే కొన్ని ప్రొటీన్లు కణజాలాలు ఉబ్బటానికి, రక్తనాళాల లోపలి మార్గం సన్నబడటానికీ కారణమవుతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది.

నడుం చుట్టుకొలత అందరికీ ఒకేలా ఉండాలనేమీ లేదు. కానీ చాలామందికి వర్తించే మార్గదర్శకాల ప్రకారం- మహిళల్లో 35 అంగుళాలు, మగవారిలో 31.5 అంగుళాలు మించితే అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోయిందనటానికి సూచికే అని చెప్పుకోవచ్చు. సహజంగా భారీ కాయం గలవారికి ఈ కొలతలు కాస్త ఎక్కువగా ఉన్నా ఇబ్బంది ఉండకపోవచ్చు.

జీవక్రియ రుగ్మత (మెటబాలిక్‌ సిండ్రోమ్‌) లక్షణాల్లో బొజ్జ ఒకటి. ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్‌, రక్తపోటు, గ్లూకోజుతో పాటు బొజ్జ పెరగటమూ జీవక్రియ రుగ్మతకు సూచికే. వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా తీవ్ర జబ్బులకు సంకేతంగా భావిస్తారు. ఒకవేళ మూడు, అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే గుండె జబ్బు, మధుమేహం, పక్షవాతం ముప్పు పెరిగే ప్రమాదముంది.

క్యాల్షియంతో మహిళల్లో లోపలి కొవ్వు కరిగే అవకాశముంది. కాబట్టి ఆకుకూరలు, పాలు, పెరుగు, మజ్జిగ, ఛీజ్‌, చేపల వంటివి తినటం మంచిది. అయితే వనస్పతి వంటి ట్రాన్స్‌ఫ్యాట్స్‌, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. ఇవి బొజ్జ పెరిగేలా చేస్తాయని గుర్తుంచుకోవాలి. రకరకాల పండ్లు, కూరగాయలు, పొట్టుతీయని ధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రొటీన్‌ కోసం పలుచటి కండ మాంసం, గుడ్లు తీసుకోవచ్చు. శాకాహారులైతే చిక్కుళ్లు, వెన్నతీసిన పాల ఉత్పత్తులు తినొచ్చు.

వ్యాయామంతో బరువు తగ్గినా తగ్గకపోయినా లోపలి కొవ్వు కరుగుతుంది. కండరాలూ పుంజుకుంటాయి. రోజుకు కనీసం అరగంట సేపు నడక, పరుగు, సైకిల్‌ తొక్కటం వంటివి చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది. బరువులు ఎత్తటం, పుషప్స్‌, యోగా చేస్తే విశ్రాంతి తీసుకునే సమయంలోనూ కొవ్వు కరుగుతుంది. శారీరక శ్రమ అలవాటు లేనివారు, వృద్ధులు, జబ్బులతో బాధపడుతున్నవారు డాక్టర్‌ సలహా తీసుకున్నాకే వ్యాయామాలు ఆరంభించటం మంచిది.