Agriculture

రైతులకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పుతుందా?

రైతులకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పుతుందా?

దేశంలోని రైతులకు మోదీ సర్కారు గుడ్‌న్యూస్‌ చెప్పనుందా? గత సార్వత్రిక ఎన్నికల ముందు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని (PM Kisan) తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఈ సారి ఆ మొత్తాన్ని పెంచనుందా? అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ రైతుల మనసు గెలుచుకునేందుకు మోదీ సారథ్యంలోని భాజపా సర్కారు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల మొత్తాన్ని రూ.8 వేలకు పెంచే అవకాశం ఉందని ‘బ్లూమ్‌బెర్గ్‌’ పేర్కొంది.

ఒకవేళ రూ.2 వేలు చొప్పున రైతులకు అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రభుత్వ ఖజానాపై రూ.20వేల కోట్ల మేర అదనపు భారం పడనుంది. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిని వివరణ కోరగా.. అందుకు నిరాకరించినట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. దేశంలో 140 కోట్ల మందిలో దాదాపు 65 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని, భాజపా సర్కారు మూడోసారి అధికారంలోకి రావాలంటే వీరి ఓట్లు కీలకమని బ్లూమ్‌బెర్గ్‌ అభిప్రాయపడింది. దేశంలో ఇప్పటికీ మోదీనే పాపులర్‌ లీడర్‌ అయినప్పటికీ.. అసమానతలు, నిరుద్యోగం వంటి సమస్యలు సవాళ్లుగా మారనున్నాయని తెలిపింది.

గత సార్వత్రిక ఎన్నికల ముందు 2018లో ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రారంభించారు. మూడు విడతలుగా రూ.2 వేలు చొప్పున రైతులకు నేరుగా బ్యాంక్‌ అకౌంట్లలో ఈ నిధులు జమ అవుతున్నాయి. అయితే, నిధుల పెంపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల వేళ ఉచిత రేషన్‌ పథకాన్ని మరోసారి పొడిగించే అవకాశం కూడా ఉందని తెలిసింది. దీంతో పాటు గృహ నిర్మాణానికి వడ్డీ రాయితీ పథకాన్ని కూడా త్వరలోనే ప్రకటించొచ్చని సమాచారం. ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్‌ ధర తగ్గించడం, బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేసింది.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z