Politics

రేపు విజయవాడలో ప్రజా రక్షణ భేరీ సభ

రేపు విజయవాడలో ప్రజా రక్షణ భేరీ సభ

ఈనెల 15న విజయవాడలో ప్రజా రక్షణ భేరీ నిర్వహిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. వేలాది మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభలో ప్రభుత్వాల విధానాలను ప్రశ్నిస్తామన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లను బీజేపీ, వైసీపీలు తమ‌ ప్రచార కర్తలుగా మార్చుకుంటున్నారన్నారు. మోడీ పాలనలో దేశం విలపిత భారత్‌గా మారిందన్నారు. మాటల మరాఠీ మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీకి అన్ని విధాలా అన్యాయం చేసిందని తెలుసన్నారు. తెలంగాణ ఎన్నికలలో లబ్ధి పొందడానికి కృష్ణా జలాలపై ప్రకటనలు చేశారన్నారు. ప్రశ్నించడానికే జనసేన అని పవన్ కళ్యాణ్ మాట్లాడారని.. కానీ తెలంగాణలో‌ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. ప్రజల ఎజెండాతో సాగుతున్న ప్రజా రక్షణ భేరికి లక్ష మంది తరలి రానున్నారని చెప్పారు. 26 జిల్లాల్లో మేము యాత్ర చేశామని.. ఎక్కడా జగన్ కావాలని ఎవరూ చెప్పలేదన్నారు. ‘వై ఏపీ నీడ్స్‌ జగన్’ అనే పదమే నోరు తిరగడం లేదన్న ఆయన… ఇక సామాన్య ప్రజలకు ఏమి అర్ధం అవుతుందని ప్రశ్నించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో నాడు నేడు, జగ‌నన్న ఇళ్లు లేవని.. గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గిరిజనులు ముప్పై కిలోమీటర్ల తిరిగి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఎవరైనా అడిగితే.. నోటికొచ్చిన బూతులు తిడతారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలను రేపు సభలో వివరిస్తామన్నారు. వైసీపీ మద్యం అవినీతిపై కేంద్రానికి పురంధరేశ్వరి లేఖపై కేంద్రం స్పందించడం లేదంటే ఏమనుకోవాలన్నారు. బీజేపీ, వైసీపీ కపట నాటకాలను ప్రజలు గుర్తించాలన్నారు. బీజేపీకి మద్దతుగా ఉండే పార్టీలను ప్రజలు ఓడించాలన్నారు.

ఈ నెల 15న జరిగే ప్రజా రక్షణ భేరికి అన్ని జిల్లాల నుంచి తరలి వస్తున్నారని సీపీఎం నేత బాబూరావు పేర్కొన్నారు. ఫుడ్ జంక్షన్ నుంచి సింగ్ నగర్ స్టేడియం వరకు ర్యాలీ సాగుతుందన్నారు. సభకు సీతారాం ఏచూరి, బీవీ రాఘవులు, ఇతర నేతలు వస్తున్నారన్నారు. ఎర్ర సైనికులతో కవాతు ఉంటుందన్నారు. 32 అంశాలను ఇప్పటికే ప్రజల్లో పెట్టామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను సభలో వివరిస్తామన్నారు. హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన తీరు చెబుతామన్నారు. అంశాల వారీగా ప్రభుత్వాలు చేసిన మోసాలు ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు. ఇతర పార్టీల సభల్లా కాదు.. కార్యకర్తలు సొంత ఖర్చులతో సభకు చేరుకుంటున్నారని బాబూరావు తెలిపారు. రేపు రాత్రికి మా పార్టీ కేంద్ర నాయకులు విజయవాడ చేరుకుంటారని స్పష్టం చేశారు.