Business

ఏఐ సేవల్ని అందించేందుకు సిద్ధమైన శాంసంగ్‌-వాణిజ్య వార్తలు

ఏఐ సేవల్ని అందించేందుకు సిద్ధమైన శాంసంగ్‌-వాణిజ్య వార్తలు

మ‌స్క్‌పై వికీపీడియా ఫౌండ‌ర్ ఫైర్

మ‌న‌కు ఏదైనా కీల‌క స‌మాచారం అవ‌స‌ర‌మైతే వెంట‌నే వికీపీడియాను (Wikipedia) సందర్శిస్తాం. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, వ‌ర్కింగ్ ప్రొషెష‌న‌ల్స్ అధికంగా ఉప‌యోగించే ఈ వెబ్‌సైట్‌కు జిమ్మీ వేల్స్ స‌హ వ్య‌వ‌స్ధాప‌కుడు. వికీపీడియాను చాట్‌జీపీటీ, బింగ్‌, బార్డ్ వంటి చాట్‌బాట్స్ ఆధారిత లార్జ్ ల్యాంగ్వేజ్ మోడ‌ల్స్ (ఎల్ఎల్ఎం) సైతం చ‌దువుతున్నాయి. ఈ ఎల్ఎల్ఎంలు వికీపీడియాను చ‌ద‌వ‌గ‌లుగుతున్నాయి కానీ ఎల‌న్ మ‌స్క్ సార‌ధ్యంలోని ఎక్స్‌ను కాద‌ని జిమ్మీ వేల్స్ వ్యాఖ్యానించారు.స‌రైన స‌మాచారానికి ఎక్స్ విశ్వ‌స‌నీయ వేదిక కాద‌ని మ‌స్క్‌ను, ఆయ‌న సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాంను ఉద్దేశించి వికీపీడియా కో ఫౌండ‌ర్ వేల్స్ దుయ్య‌బ‌ట్టారు. ట్విట్ట‌ర్‌కు (ఎక్స్‌) బ‌దులు ఎల్ఎల్ఎంలు త‌న వెబ్‌సైట్‌ను చ‌ద‌వ‌డం ప‌ట్ల తాను సంతోషంగా ఉన్నాన‌ని వేల్స్ పేర్కొన్న‌ట్టు ఫార్చూన్ రిపోర్ట్ వెల్ల‌డించింది. వికీపీడియా డేటాపై ఎల్ఎల్ఎం శిక్ష‌ణ‌కు సంబంధించి లిస్బ‌న్‌లో జ‌రిగిన వెబ్ స‌మ్మిట్‌లో వేల్స్‌ను ప్ర‌శ్నించ‌గా ఈ వ్యాఖ్య‌లు చేశాడ‌ని ఫార్చూన్ రిపోర్ట్ పేర్కొంది.ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌తినిధులు ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు చ‌ప్ప‌ట్ల‌తో త‌మ మద్ద‌తును తెలియ‌చేశారు. ఎక్స్ ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్‌లో భాగంగా మ‌స్క్‌ ఆఫ‌ర్ చేస్తున్న ఏఐ చాట్‌బాట్ గ్రోక్ గురించి తానిప్ప‌టివ‌ర‌కూ విన‌లేద‌ని వేల్స్ చెప్పారు. మరోవైపు ఎల‌న్ మ‌స్క్ ఇటీవ‌ల వికీపీడియా దాని కో ఫౌండ‌ర్‌పై చేసిన వ్యాఖ్య‌లపై హాట్ డిబేట్ సాగింది. వికీపీడియా త‌న వెబ్‌సైట్ పేరును డికీపీడియాగా మార్చుకోవాల‌ని మస్క్ సూచించారు. త‌న సూచ‌న‌కు అనుగుణంగా వారు పేరు మార్చితే తాను ఆ వెబ్‌సైట్‌కు మిలియ‌న్ డాల‌ర్లు ఇస్తాన‌ని మ‌స్క్ వ్యాఖ్యానించారు.

ఏఐ సేవల్ని అందించేందుకు సిద్ధమైన శాంసంగ్‌

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) హవా నడుస్తున్న సమయంలో దాదాపు అన్ని సంస్థలు సొంతంగా ‘ఏఐ’ డివైజ్‌లను తయారు చేయటం ప్రారంభించాయి. తాజాగా.. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ (Samsung) కూడా ఏఐ సేవల్ని అందించేందుకు సిద్ధమైంది. యూజర్ల పనుల్ని సులభతరం చేయటంలో భాగంగానే గాస్‌ (Gauss) పేరుతో ఏఐ సేవల్ని ఆవిష్కరించింది.సియోల్‌లో జరిగిన శాంసంగ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (SDC) వార్షిక టెక్ సమావేశంలో కంపెనీ గాస్‌ ఏఐ మోడల్‌ను లాంచ్‌ చేసింది. గాస్‌ లాంగ్వేజ్‌, గాస్‌ కోడ్‌, గాస్‌ ఇమేజ్‌ వంటి సబ్‌ మోడల్స్‌లో ఏఐ సేవలు రానున్నాయి. ఈమెయిల్స్‌ రాయటం, కంటెంట్‌ను అనువదించటం.. వంటి పనులను సులభతరం చేయటం కోసం ఈ ఏఐ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. అంతే కాదు ఈ సాంకేతికతో వినియోగదారులు సృజనాత్మక పనులు చేయటానికి సాయపడుతుందని పేర్కొంది. అయితే శాంసంగ్‌ నుంచి రానున్న ట్యాబ్స్‌, స్మార్ట్‌ఫోన్లు, శాంసంగ్‌ ఎస్‌24లో ఈ ఏఐ సేవల్ని తీసుకురానున్నట్లు వెల్లడించింది.శాంసంగ్‌ ఎస్‌డీసీ ఈవెంట్‌ మొదటిసారి 2014లో ప్రారంభమైంది. భవిష్యత్తులో తీసుకురానున్న సాంకేతికతలు, సేవల గురించి ఏటా జరిగే ఈవెంట్లో ప్రకటిస్తుంది. ఈ ఏడాది జరిగిన ఈవెంట్‌లో ఏఐ సేవల్ని గురించి ప్రస్తావించింది. వీటితో పాటూ గెలాక్సీ మొబైల్స్‌లో యూఐ (UI) ఫీచర్‌లు, నాలెడ్జ్ గ్రాఫ్‌ల గురించి కూడా చర్చించినట్లు తెలిపింది.

వైజాగ్‌ స్టీల్‌ ఆస్తులు విక్రయించడానికి సిద్ధమైన మోదీ సర్కారు

వైజాగ్‌ స్టీల్‌గా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ఆస్తుల్ని విక్రయించడానికి మోదీ సర్కారు సిద్ధమైంది. కంపెనీకి వైజాగ్‌లో ఉన్న భూముల్ని, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ట్రైన్‌ ఫోర్జ్‌డ్‌ వీల్‌ ప్లాంట్‌ను విక్రయించి రూ.3,000-4,000 కోట్లు సమీకరిస్తామని ఆర్‌ఐఎన్‌ఎల్‌ సీఎండీ అతుల్‌ భట్‌ చెప్పారు. మంగళవారం కోల్‌కతాలో జరిగిన ఓ సదస్సులో భట్‌ మాట్లాడుతూ.. వచ్చే ఆదాయంతో సంస్థ రుణాన్ని తగ్గించి, వర్కింగ్‌ క్యాపిటల్‌ను సమకూర్చుకుంటామన్నారు. కాగా, ఆర్‌ఐఎన్‌ఎల్‌కు 6,000 ఎకరాల గ్రీన్‌బెల్ట్‌సహా మొత్తం 19,000 ఎకరాల భూములున్నాయి.

*  టీసీఎస్ ఆఫీస్ కు బాంబు బెదిరింపు

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. మాజీ ఉద్యోగి టీసీఎస్ ఆఫీస్ కు బెదిరింపు కాల్ చేసినట్లు సమాచారం అందుతుంది. నిన్న ( మంగళవారం ) బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యాంపస్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఎంప్లాయిస్, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురి కావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. టీసీఎస్ పై కోపంతోనే ఓ మాజీ ఉద్యోగి ఈ కాల్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.ఇక, ఉద్యోగి కోసం పోలీసులు గాలిస్తున్నారు. టీసీఎస్ కంపెనీ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగులు పనిలో ఉండగా ఆఫీస్ క్యాంపస్‌లోని బి బ్లాక్‌కు బెదిరింపు కాల్ రావడంతో వెంటనే వారందరినీ క్యాంపస్ ప్రాంగణం నుంచి బయటకు పంపించి వేయడంతో పాటు పోలీసులు వెంటనే సమాచారం అందించారు. పరప్పన అగ్రహార పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్యాంపస్‌లో పేలుడు పదార్థాల కోసం గాలించారు.కానీ, టీసీఎస్ క్యాంపస్ లోపల బాంబు, పేలుడు పదార్థాలకు సంబంధించినవి ఏమీ దొరకకపోవడంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు. అయితే, ఇది ఫేక్ బాంబు కాల్ గా పోలీసులు నిర్ధారించారు. కంపెనీ మాజీ ఉద్యోగి నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మాజీ ఉద్యోగి వివరాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు కన్నుమూత

సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ కన్నుమూశారు.  2023 నవంబర్ 14వ తేదీన రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో ఆయన  గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని సహారా గ్రూప్ వెల్లడించింది. సుబ్రతా రాయ్ కొంతకాలంగా మెటాస్టాటిక్ కేన్సర్, హై బీపీ, డయాబెటీస్ తో బాధపడుతున్నారు. 1948 జూన్‌ 10న బీహార్‌లో జన్మించిన సుబ్రతా రాయ్‌.. సహారా గ్రూప్‌ను స్థాపించి ఫైనాన్స్‌, రియల్‌ ఎస్టేట్‌, మీడియా, ఆతిథ్య రంగాల్లో వ్యాపారాలు నిర్వహించి తనదైన ముద్ర వేశారు.  1978లో సహారా ఇండియా పరివార్ ప్రారంభించడంతో ఆయన సక్సెస్ స్టోరీ మొదలైంది. కేవలం రూ.2 వేల పెట్టుబడితో ప్రారంభించినప్పటికీ వ్యవస్థాపకత విషయంలో కంపెనీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సుబ్రతా రాయ్ కృషి చేశారు. భారతదేశ చరిత్రలో ఇండియన్ రైల్వే తర్వాత.. ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన సంస్థగా సహారా నిలిచింది. అప్పట్లోనే నెలకు 12 లక్షల మందికి దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి.. ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. రాజకీయ కారణాలతో సహారా గ్రూప్ 2014 నుంచి సవాళ్లను ఎదుర్కొంది. 75ఏళ్ల సుబ్రతా రాయ్‌కి భార్య స్వప్నా రాయ్.. ఇద్దరు కుమారులు.. సుశాంతో రాయ్, సీమాంటో రాయ్ ఉన్నారు. ప్రస్తుతం వారు విదేశాల్లో నివసిస్తున్నారు.

లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 742 పాయింట్లు పెరిగి 65,675 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 231 పాయింట్లు ఎగబాకి 19,675 వద్ద స్థిర పడింది. టాటా మోటర్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, టాటా స్టీల్, టీసీఎస్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, హెచ్‌సీఎల్‌ టెక్, ఐటీసీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్, అల్ట్రాటెక్ సిమ్ంట్, ఏషియన్ పేయింట్స్, మారుతి, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్ లాభాల్లో ముగిశాయి.యూఎస్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో అంచనాలకు అనుగుణంగా నమోదు కావడం అక్కడి మార్కెట్ల సెంటిమెంట్‌ను పెంచింది. ఆసియా- పసిఫిక్‌ సూచీలు నేడు సానుకూలంగా కదలాడాయి. అక్టోబరులో టోకు ధరల ద్రవ్యోల్బణ సూచీ (డబ్ల్యూపీఐ) 0.52 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరలు దిగిరావడం ఇందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్‌ నుంచి డబ్ల్యూపీఐ తక్కువగానే నమోదవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.1,244 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ.830 కోట్లు విలువ చేసే స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

* టెక్‌ కంపెనీల్లో లేఆఫ్స్‌

టెక్‌ కంపెనీల్లో గత రెండేండ్ల నుంచి ఉద్యోగుల తొలగింపులు (లేఆఫ్స్‌) అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల మందికిపైగా ఉద్యోగాలను కోల్పోయారు. ఇది నిరుటి కంటే 50 శాతం అధికం. అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన కంపెనీల్లో గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి టెక్‌ దిగ్గజాలతోపాటు చిన్న చిన్న ఫిన్‌టెక్‌ స్టార్టప్‌లు, యాప్‌లు ఉన్నాయి.నవంబర్‌ 11 వరకు 1,106 కంపెనీలు 2,48,974 మంది ఉద్యోగులను తొలగించాయని, నిరుడు ఇదే సమయంలో 1,54,336 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారని ‘లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ’ వెబ్‌సైట్‌ వెల్లడించింది. గత రెండేండ్లలో సగటున గంటకు 23 మంది లేదా రోజుకు 555 మంది ఉద్యోగాలను కోల్పోయారని, ఈ ఏడాది జనవరిలోనే వివిధ కంపెనీలు 89,554 మంది ఉద్యోగులను తొలగించాయని స్పష్టం చేసింది. రిటైల్‌ టెక్‌, కన్జ్యూమర్‌ టెక్‌ రంగాల్లో ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా జరిగిందని, ఈ సంవత్సరం ముగిసేలోగా మరింత మంది ఉద్యోగులపై వేటు పడటం ఖాయమని పేర్కొన్నది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z