Business

లక్షలాది మొబైల్ కనెక్షన్లు రద్దు

లక్షలాది మొబైల్ కనెక్షన్లు రద్దు

మొబైల్‌ వాడకం రోజురోజుకు పెరుగుతోంది. దీంతోపాటే ఆన్‌లైన్‌ మోసాలు అదే స్థాయిలో హెచ్చవుతున్నాయి. హ్యాకర్లు, సైబర్‌ నేరగాళ్లు సామాన్యుల కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. వీళ్లు ప్రజలను మోసగించడానికి కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్థిక మోసాల్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం 70 లక్షల మొబైల్‌ కనెక్షన్లను రద్దు చేసినట్లు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌) కార్యదర్శి వివేక్‌ జోషి వెల్లడించారు. ఆయా మొబైల్‌ నంబర్ల నుంచి అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నందునే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఆర్థిక సైబర్‌ భద్రత, పెరుగుతున్న డిజిటల్‌ చెల్లింపుల మోసాలపై చర్చించిన సమావేశంలో బ్యాంకులు తమ వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలని జోషి సూచించారు. ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహిస్తూ, మోసాలకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. తదుపరి సమావేశం జనవరిలో ఉంటుందని చెప్పారు. ఆధార్‌ ఎనెబుల్‌ పేమెంట్‌ సిస్టమ్‌(ఏఈపీఎస్‌) ద్వారా జరుగుతున్న మోసాలపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి, నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. సైబర్‌ మోసాలను కట్టడి చేసేందుకు వివిధ ఏజెన్సీలు సమన్వయంతో ఎలా ముందుకెళ్లాలలో ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశంలో భాగంగా డిజిటల్‌ చెల్లింపుల మోసాలపై జాతీయ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌సీఆర్‌పీ) నమోదు చేసిన తాజా గణాంకాలను ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ వివరించింది. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల విభాగం, రెవెన్యూ విభాగం, టెలికాం విభాగం, ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌), నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ) ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల యూకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాల్లో డిజిటల్‌ మోసాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z