Devotional

అయ్యప్ప దీక్ష నియమాలు

అయ్యప్ప దీక్ష నియమాలు

అకుంఠిత దీక్ష, అంతులేని ఆత్మవిశ్వాసంతో సన్నిధానానికి చేరుకొని స్వామిని దర్శించడమే అయ్యప్ప దీక్షలోని ఆంతర్యం. ఈ దీక్ష అద్వితీయమైన నియమాలతో రూపొందించింది. అయ్యప్ప దీక్షను పాటించే సమయమిదే. 41 రోజుల పాటు కఠోర నియమాలు పాటిస్తూ, నిష్టగా పూజాది కార్యక్రమాలు ఆచరించే భక్తులకు పవిత్రమైన రోజులివి. తనువు, మనస్సును చెడు నుంచి మంచి మార్గం వైపు మళ్లించే ఈ దీక్షను స్వీకరించిన భక్తులు స్వామియే శరణం అంటూ అయ్యప్ప సేవలో తరిస్తుంటారు. ఈ దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ, దీక్ష వల్ల వచ్చే మానసిక ఆనందం, ఆత్మ పరిశీలన శక్తి, అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందం దీక్షాపరులకు అనుభవంలోకి వస్తాయి. శివునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో కఠిన నియమ, నిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్య నియమాల కలబోత అయిన అయ్యప్ప దీక్ష విశేషాలపై ప్రత్యేక కథనం…

అయ్యప్ప అవతారం
పూర్వకాలంలో మహీషి అనే రాక్షసి బోళా శంకరుడి వరం పొంది ప్రజలను ఇంద్రాది దేవతలను సైతం హింసించేది. తనకు ఆడ,మగ కలయికతో పుట్టిన వారితో గానీ, విల్లుతో గానీ, ఆయుధాలతో గానీ మరణం ఉండకుండా వరం పొందింది. ఆ తర్వాత ఇంద్రాది లోకాలకు వెళ్లి వికృత చేష్టలకు దిగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. మహీషి చేష్టలకు భయాందోళన చెందిన దేవతలు మహా విష్ణువును శరణు కోరతారు. దీంతో ఆయన మోహినీ అవతారమెత్తి పరమ శివుడిని మోహిస్తాడు. వీరద్దరి కలయికతో అయ్యప్ప జన్మిస్తాడు. మణిమాలతో కేరళ రాజ్యంలోని అటవీ ప్రాంతంలో పాండ్యరాజులకు దొరుకుతాడు. మణిమాలతో దొరికిన ఆ శిశువుకు మణికంఠుడు అని నామకరణం చేస్తారు. మణికంఠుడు మహీషిని వధించి దేవతలు, మునుల పూజలందుకుంటాడు. అనేక మహిమలతో పాండ్య రాజులకు, ప్రజలకు దగ్గరవుతాడు.

మాలధారులు ఎన్నిరకాలు?
అయ్యప్ప మాలను కొత్తగా ఈ సంవత్సరమే ధరించినవారు ఉంటారు. ఏండ్ల తరబడిగా దీక్ష స్వీకరిస్తున్నవారూ ఉంటారు. అయితే ఎవరిని ఎలా పిలుస్తారో చాలా మందికి తెలియదు. మొదటి సారి మాలధరిస్తే ‘కన్నె స్వామి’ అంటారు. రెండోసారి ధరించిన భక్తులను ‘కత్తి స్వామి’గా పిలుస్తారు. మూడోసారి అయితే ‘గంట స్వామి’, నాలుగోసారి ‘గధ స్వామి’, ఐదోసారి ‘పేరు స్వామి’, ఆరోసారి ధరించినవారిని ‘త్రిశూల్‌ స్వామి’ అని వ్యవహరిస్తారు. ఏడు, అంతకన్నా ఎక్కువసార్లు ధరిస్తే ‘గురు స్వామి’గా పరిగణిస్తారు. 18, అంతకన్నా ఎక్కువ సార్లు మాల ధరించినవారిని ‘నారీకేళ స్వామి’ అని సంబోధిస్తారు.-

ఇరుముడి ప్రత్యేకత..
అయ్యప్ప దీక్షలో ఇరుముడికి ప్రత్యేకత ఉన్నది. దీక్ష తీసుకున్న స్వాములు శబరిమలై ప్రయాణంలో మొదటి ఘట్టం ఇరుముడి, ఇరుముడి ధరించే అయ్యప్పస్వామి తెల్లవారుజామున ఇంటి గుమ్మం వద్ద కొబ్బరికాయ కొట్టి ఎవరితోనూ మాట్లాడకుండా ఆలయానికి వెళ్లి గురుస్వామితో ఇరుముడి కట్టించుకోవాలి. ఇరుముడితో శబరిమలై వెళ్లిన వారికి 18 మెట్లు ఎక్కే అర్హత లభిస్తుంది.

మాల విరమణ..
అయ్యప్ప స్వామి దీక్ష పూర్తి చేసుకున్నాక శబరియాత్రకు వెళ్లిన అయ్యప్పస్వాములు అక్కడే దీక్ష విరమిస్తున్నారు. ఇంకొందరు తిరుపతిలో మొక్కలు తీర్చుకుని అక్కడ కూడా విరమిస్తున్నారు. అలా కాకుండా శబరియాత్ర పూర్తయ్యాక దీక్ష పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వచ్చి మాతృమూర్తి ద్వారా మాల విరమించుకోవాలని గురుస్వాములు సూచిస్తున్నారు.

పడిపూజ ఎందుకు?
అయ్యప్ప సన్నిధానంలో 18 మెట్లు ఉంటాయి. ఇవి కామం, క్రోధం, లోభ, మోహ, మద, మత్సర్యాలైయిన అరిషడ్వర్గాలని ప్రతీతి. మనిషిలోని 18 రకాల చెడు గుణాలు తొలగిపోవడానికి దీక్షలో పడిపూజ (మెట్టు పూజ) నిర్వహిస్తారు. అయ్యప్ప మాల ధరించిన ప్రతిసారి చెడు లక్షణాలను విడిచిపెట్టి మంచి వారిగా మారాలని కోరుకుంటూ ఈ పూజను నిర్వహిస్తారని గురుస్వాములు చెబుతారు.

కన్నెస్వాములు ఎంతో ప్రత్యేకం..
శబరి కొండల్లో ఉండే మాలికాపురోత్తమ అయ్యప్పస్వామిని ప్రేమిస్తుంది. తనను వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతుంది. ఇది విన్న స్వామివారు చిరునవ్వుతో తిరస్కరిస్తాడు. అయినా ఆమె పట్టువీడదు. దీంతో కన్నెస్వాములు తన మాల ధరించి రానప్పుడు వివాహమాడుతానని స్వామి ఆమెకు మాట ఇచ్చాడు. నూతన మాలధారులైన కన్నెస్వాములు రాకుండా ఉండడం ఎప్పటికీ జరగదని దీనిలో పరమార్థం. ఇందులో భాగంగానే ఏటేటా కన్నెస్వాముల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. తొలిసారి మాలవేసే కన్నెసాములతోపాటు వరుసగా కత్తిస్వామి, గంట స్వామి, గధస్వామి, గురుస్వాములుగా పిలుస్తారు. 9నుంచి 18సార్లు శబరిమల యాత్రకు వెళ్లి వచ్చినవారు కన్నెస్వాములు దీక్షలు చేపట్టేందుకు సహకరిస్తారు.

ఇరుముడి అత్యంత ప్రాధాన్యం
అయ్యప్పస్వామిని నవ విధ సేవలతో పూజిస్తుంటారు. నవ విధాలుగా అనగా శ్రావణం, కీర్తనం, స్మరణం, పాదాసేవనం, అర్చనం, నమస్కారం, ధాన్యం, స్కృతం, ఆత్మ నివేదనంతో 41రోజులు దీక్ష పూర్తి చేసిన తర్వాత ఇరుముడికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఇరుముడి అంటే రెండు అని అర్థం. అనగా రెండు ముడులు అని. ముందు ముడి (మూట)లో పీఠం, భస్మం, గంధం, కొబ్బరికాయలు, నెయ్యి, పూజా సామగ్రి ఉంటాయి. వెనుకముడి (రెండో మూట)లో ప్రయాణానికి కావాల్సిన వస్తువులుంటాయి. వీటినే పుణ్యపు మూట, పాపపు మూట అని పిలుస్తారు.

అయ్యప్ప దీక్ష నియమాలు…

అయ్యప్పదీక్ష తీసుకున్న భక్తులు నల్లని దుస్తులు ధరించాలి.

41రోజుల పాటు (మండలం రోజు) నియమ నిష్టలు పాటించాలి.

దీక్షా సమయంలో తల, గడ్డం, వెంట్రుకలు, గోళ్లను తీయడం నిషేధం.

చెప్పులు ధరించొద్దు.

తెల్లవారుజామున అమృత ఘడియల్లో (సూర్యోదయానికి ముందు) చల్లని నీటితో స్నానం ఆచరించాలి. సాయంత్రం కూడా చల్లని నీటితో స్నానం ఆచరించాలి.

నుదుట విబూది, గంధం, కుంకుమ మధ్యలో బొట్టు పెట్టుకోవాలి

ఒక్కపూట భోజనం (మధ్యాహ్నం భిక్ష) రాత్రి పండ్లు, ఫలహారం అల్పాహారంగా తీసుకోవాలి.

కటిక నేలపై నిద్రించాలి.

అశుభ కార్యాలు జరిగే ప్రదేశాలకు, దుఖ: సంబంధమైన ఘటనల్లో పరామర్శకు వెళ్లరాదు.

పగలు నిద్రించకూడదు. శవాన్ని చూడకూడదు. మనస్సును అదుపులో ఉంచుకొని శరణుఘోష చెప్పుకోవాలి.

పూజ చేసుకున్న తర్వాత ఉదయం, సాయంత్రం వృత్తి రీత్యా పనులు చేసుకోవచ్చు.

తన శక్తికొలది ఒక్కసారైనా ఐదుగురు అయ్యప్పలకు భిక్ష పెట్టాలి.

హింసాత్మక చర్యలు, దుర్భాషలాడడం, అబద్ధాలాడడం చేయరాదు.

దీక్షా సమయంలో హోదా, వయస్సు, పేద, ధనిక తేడా లేకుండా అయ్యప్పలందరికీ పాదాభివందనం చేయాలి.

స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం..

కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో అయ్యప్పమాల ధరించి 41 రోజులపాటు కఠోరదీక్ష చేసి ఇరుముడి కట్టుకొని శబరిమలకు చేరుకుంటా. ఇరుముడితో 18మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. గురుస్వామి సమక్షంలో మొదటిసారి మాలధరణ చేశాను. అయ్యప్ప దీక్ష తీసుకోవడంతో నేను అనే భావన నశించి భక్తిభవం పెరుగుతుంది.

నిష్టతో అయ్యప్ప దీక్ష తీసుకోవాలి..కార్తీక మార్గశిర మాసాల్లో గురుస్వాముల ద్వారా మాల ధరించి దీక్ష తీసుకొని 41రోజులపాటు పాటించాలి. మాలధరణ చేసిన స్వాములు ఒంటిపూట మాత్రమే బిక్ష తీసుకోవాలి. కులమతబేధ తారతమ్యాలు లేని ఆధ్యాత్యిక ప్రపంచమే అయ్యప్ప మాలధారణకు ఉన్న విశేషం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z