DailyDose

చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా- నేర వార్తలు

చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా- నేర వార్తలు

* అక్రమ వలసదారుల డేటా సేకరించడం అసాధ్యం!

దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారుల డేటాను సేకరించడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌ 6ఏ రాజ్యాంగ చెల్లుబాటుపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతుంది. కేసు విచారణ సందర్భంగా కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ సెక్షన్‌ సిటిజన్‌షిప్‌ యాక్ట్‌లోని అసోంకు చెందింది. అయితే, యాక్ట్‌ ప్రకారం.. 17,861 మందికి పౌరసత్వం ఇచ్చినట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది. ఫారినర్స్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు 1966-1971 మధ్య కాలంలో 32,381 మంది విదేశీయులుగా గుర్తించినట్లు పేర్కొంది.అసోంలో 1966 జనవరి 1 నుంచి 1971 మార్చి 25 వరకు ఎంతమంది బంగ్లాదేశ్ పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చారని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ‘సుప్రీం’ ప్రశ్నించడంతో పాటు డేటాను కోరింది. అలాగే అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నది. దీనిపై కేంద్రం స్పందిస్తూ ఎలాంటి ఎలాంటి పత్రాలు లేకుండా రహస్యంగా దేశంలోకి వలసదారులు అక్రమంగా ప్రవేశిస్తున్నారని పేర్కొంది. అక్రమ వలసదారులను గుర్తించడం, వారిని నిర్బంధించడం, తిరిగి వారి దేశాలకు పంపించడం సంక్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొంది.అలాంటి పరిస్థితిలో దేశంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న అక్రమ వలసదారుల గురించి డేటాను సేకరించడం సాధ్యం కాదని తెలిపింది. 2017 నుంచి 2022 మధ్య కాలంలో 14,346 మంది విదేశీయులను తిరిగి వారి దేశాలకు పంపినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం, అసోంలో వంద ఫారినర్స్ ట్రిబ్యునల్స్‌ పని చేస్తున్నాయని, 31 అక్టోబర్ 2023 వరకు 3.34 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని తెలిపింది. ఫారినర్స్ ట్రిబ్యునల్ ఆదేశాలకు సంబంధించిన 8,461 కేసులు గౌహతి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. ఈ సందర్భంగా అసోంలో చొరబాట్లను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు ఫెన్సింగ్‌ వేస్తున్నట్లు వివరించింది.

చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా

ఉచిత ఇసుక కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఉచిత ఇసుక కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విధితమే. విచారణ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

పోస్టుమార్టంలో ‘కళ్లు’ మాయం

ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. ఆమె ‘కళ్లు’ మాయమైనట్లు (Eyes Removed) కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే దీనికి కారణమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన జిల్లా మేజిస్ట్రేట్‌.. యువతి మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.అధికారుల వివరాల ప్రకారం.. బదాయు జిల్లాకు చెందిన ఓ యువతి (20) ఆదివారం ఉరికి వేలాడుతూ కనిపించింది. వరకట్నం కోసం ఆమెను హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా.. ఆమె కళ్లు మాయమైనట్లు వారు గుర్తించారు. పోస్టుమార్టం సమయంలోనే కళ్లను తొలగించారంటూ వైద్యులు, సిబ్బందిపై ఆరోపణలు చేశారు.ఈ క్రమంలోనే జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. అవయవ అక్రమ రవాణాలో పాలుపంచుకున్నారని ఆరోపిస్తూ.. వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా మేజిస్ట్రేట్‌ తెలిపారు. మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహిస్తామని, ఎవరైనా దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండో పోస్ట్‌మార్టం ప్రక్రియను వీడియో తీసి, నివేదిక సమర్పించాలని జిల్లా మేజిస్ట్రేట్ తమను ఆదేశించినట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఒమర్‌ అబ్దుల్లా పిటిషన్‌ కొట్టివేత

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ (NC) అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా.. తన భార్య పాయల్‌ అబ్ధుల్లా నుంచి విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఒమర్‌ అబ్దుల్లా డైవోర్స్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ గతంలో ఫ్యామిలీ కోర్టు తీసుకున్న నిర్ణయం సరైనదేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒమర్‌పై ఆయన భార్య చూపిన క్రూరత్వం ఏమీ లేదని, కాబట్టి విడాకులు మంజూరు చేయడం కుదరదని కోర్టు తేల్చిచెప్పింది.‘ఒమర్‌ అబ్దుల్లా తన భార్య క్రూరంగా వ్యవహరిస్తున్నదంటూ విడాకుల కోసం పిటిషన్‌ వేశారు. అయితే ఆ పిటిషన్‌లో ఆమె క్రూరత్వానికి సంబంధించిన ఆరోపణలు స్పష్టంగా లేవు. చేసిన ఆరోపణలకు కూడా పెద్దగా ఆధారాలు లేవు. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన వేసిన అప్పీల్‌ పిటిషన్‌లో కూడా ఎలాంటి మెరిట్స్‌ లేవు. కాబట్టి ఈ అప్పీల్‌ను డిస్మిస్‌ చేస్తున్నాం’ అని జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ, జస్టిస్‌ వికాస్‌ మహాజన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పుచెప్పింది.కాగా ఒమర్‌ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్‌ అబ్దుల్లా గొడవల కారణంగా ఇప్పటికే విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఒమర్‌ అబ్దుల్లా తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లారు. కానీ కోర్టులో ఆయనకు చుక్కెదురైంది. అయితే పాయల్‌ అబ్దుల్లా.. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అగ్ర నేత సచిన్‌ పైలట్‌ సోదరి కావడం గమనార్హం.

అమ్మకు దారుణ శిక్ష

సభ్య సమాజం తలదించుకునే ఘోర ఉదంతమిది.. కన్నడనాట మానవత్వానికే మచ్చతెచ్చే ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిపై కక్షకట్టి.. ఆయన తల్లిని దారుణంగా హింసించారు. బెళగావికి సమీప గ్రామానికి చెందిన ఓ యువతి (20), ఓ యువకుడు (24) కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే ఆమెకు కుటుంబ సభ్యులు మరో యువకుడితో వివాహ నిశ్చితార్థం జరిపించారు. దీంతో ప్రేమికులిద్దరూ కలిసి ఆదివారం రాత్రి ఇళ్ల నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ఆ యువకుడి ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఆయన తల్లిని (42) వీధిలోకి ఈడ్చుకొచ్చి వివస్త్రను చేశారు. నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. రచ్చబండ వద్ద స్తంభానికి కట్టి అర్ధరాత్రి వరకు కొట్టారు. ఊళ్లో ఏ ఒక్కరూ వారిని అడ్డుకోలేదు.ఈ సమాచారం తెలిసి స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను రక్షించారు. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించారు. రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్‌, పోలీస్‌ ఉన్నతాధికారులు ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గ్రామంలో అల్లర్లు చెలరేగకుండా పోలీసులను నియమించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు బాధిత కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.నేటి ఆధునిక యుగంలోనూ ఇలా ఒక మహిళను వివస్త్రను చేసి ఊరేగించడం, స్తంభానికి కట్టి హింసించడం సిగ్గుచేటని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులు సభ్య సమాజం తలవంచుకునేలా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఇలాంటి అరాచకాలను సహించబోమన్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని ఎక్స్‌ ద్వారా వెల్లడించారు.

కర్ణాటక రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపులు

కర్ణాటక రాజ్‌భవన్‌ (Raj Bhavan)కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు కాల్‌ చేశాడు. రాజ్‌భవన్‌పై బాంబులు వేస్తామంటూ హెచ్చరించాడు (bomb threat call ). దీంతో పోలీసులు వెంటనే అలర్ట్‌ అయ్యారు.రాజ్‌భవన్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబును వెతికేందుకు వెంటనే రంగంలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్, కే-9 యూనిట్లతో రాజ్‌భవన్‌ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఎలాంటి అనుమానాస్పద వస్తువూ వారికి కనిపించలేదు. మరోవైపు ఫోన్‌కాల్‌ ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z