Business

ఇన్ఫోసిస్‌ కీలక నిర్ణయం-వాణిజ్య వార్తలు

ఇన్ఫోసిస్‌ కీలక నిర్ణయం-వాణిజ్య వార్తలు

* ఇన్ఫోసిస్‌ కీలక నిర్ణయం

దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఉద్యోగులు ఇకపై వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశించింది.బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇప్పటికే సంబంధిత విషయంపై ఉద్యోగులకు అంతర్గత ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేసింది. ‘దయచేసి వారంలో కనీసం 3 రోజులైనా ఆఫీసులకు రండి. అతి త్వరలోనే ఇది తప్పనిసరి కానుంది’ అని ఉద్యోగులకు ఇచ్చిన సందేశంలో ఇన్ఫీ పేర్కొంది.కాగా, కరోనా మహమ్మారి కారణంగా 2020 ఏడాది పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. మహమ్మారి వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రావడంతో కొన్ని సంస్థలు హైబ్రిడ్‌ పద్ధతిని అవలంభిస్తున్నాయి. వారానికి కనీసం రెండు, మూడు రోజులైనా కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. టీసీఎస్‌, విప్రో వంటి టాప్‌ సంస్థలు ఇప్పటికే ఉద్యోగుల్ని ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించాయి. ఇన్ఫోసిస్‌ కూడా ఇటీవలే తమ ఉద్యోగులకు ఇలాంటి సూచనే చేసింది.మిడ్‌ లెవల్‌ మేనేజర్లు, ప్రాజెక్ట్‌ హెడ్‌లు, ఎంట్రీ లెవల్‌ ఉద్యోగులు నెలలో 10 రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని స్పష్టం చేసింది. ‘రిటర్న్ టు ఆఫీస్ విధానం, హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను బలోపేతం చేసే దిశగా.. ఉద్యోగుల్ని నెలలో కనీసం 10 రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందిగా కోరుతున్నాం. 2023, నవంబర్ 20 నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని ఇన్ఫీ వైస్‌ప్రెసిడెంట్స్‌ నుంచి ఉద్యోగులకు మెయిల్‌ ద్వారా గతంలో సమాచారం అందింది. అయితే, ఇప్పుడు మాత్రం వారానికి మూడు రోజులు ఆఫీసుకు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.

18న మోతీసన్స్‌ జువెలర్స్‌ ఐపీఓ

జయపురకు చెందిన రిటైల్‌ ఆభరణాల కంపెనీ మోతీసన్స్‌ జువెలర్స్‌ ఐపీఓ డిసెంబర్‌ 18న ప్రారంభం కానుంది. 20వ తేదీ వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ఐపీఓలో షేరు ధరల శ్రేణిని రూ.52-55గా నిర్ణయిస్తూ కంపెనీ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఐపీఓలో మొత్తం 2.74 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేస్తున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఎలాంటి షేర్లను విక్రయించడం లేదు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.151 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓ ద్వారా సమకూరిన నిధులను రుణ చెల్లింపులు, నిర్వహణ మూలధనం, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనున్నారు.ఇన్వెస్టర్లు కనీసం 250 ఈక్విటీ షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన కనీసం రూ.13,750 పెట్టుబడిగా పెట్టాలి. ప్రీ-ఐపీఓ ఫండింగ్‌ రౌండ్‌లో ఈ కంపెనీ ఇప్పటికే రూ.33 కోట్లు సమీకరించింది. హొలానీ కన్సల్టెంట్స్‌ ఈ ఐపీఓకి బుక్‌ రన్నింగ్‌ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. కంపెనీ షేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో నమోదు చేయాలని యోచిస్తున్నారు.

స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల నష్టాలకు బ్రేక్

మంగ‌ళ‌వారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్‌టైం రికార్డు నెల‌కొల్పాయి. అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం గ‌ణాంకాలు వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీక‌ర‌ణ‌కు దిగ‌డంతో న‌ష్టాల్లో ముగిశాయి. దీంతో వ‌రుస రెండు సెష‌న్ల లాభాల‌కు బ్రేక్ ప‌డింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 377.50 పాయింట్లు (0.54శాతం) న‌ష్టంతో 69,551.03 పాయింట్ల వ‌ద్ద ముగిసింది.

హైదరాబాద్‌ చెన్నై నగరాల్లో ఆస్తులు అమ్ముకోనుందా?

టాప్ టెక్ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్‌ అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నది. సాధారణంగా కాస్ట్‌ కటింగ్‌ పేరిట టెక్‌ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఖర్చును తగ్గించుకుంటాయి. అయితే, కాగ్నిజెంట్ మాత్రం ఉద్యోగాల్లో కోత విధించడంతోపాటు ఆస్తులను కూడా విక్రయించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థ హైదరాబాద్, చెన్నైలోని తన ఆస్తులను విక్రయించడానికి సిద్ధంగా ఉందని కొన్ని మీడియా కథనాల చెబుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. రెండేళ్లలో రూ.3,300 కోట్లను ఆదా చేసే లక్ష్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని 10 ఎకరాల క్యాంపస్‌ను, చెన్నై సిరుసేరిలోని 14 ఎకరాల క్యాంపస్‌ను విక్రయించాలని కాగ్నిజెంట్‌ యోచిస్తున్నట్లు సమాచారం.రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా కాగ్నిజెంట్‌ తన వర్క్‌స్పేస్‌ను తగ్గించుకుని, వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడానికి హైబ్రిడ్ వర్క్‌ కల్చర్‌ను ఎంచుకుంది. టెక్‌ కంపెనీలు మారుతున్న వర్క్‌కల్చర్‌కు అనుగుణంగా హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. వివిధ నగరాల్లోని కార్యకలాపాలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే కాగ్నిజెంట్‌ ఈ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అయితే కాగ్నిజెంట్‌ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

62 వేలకు చేరువలో తులం బంగారం

అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.150 తగ్గి రూ.61,900 వద్ద ముగిసిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. కిలో వెండి ధర సైతం రూ.150 పతనమై రూ.75,750 వద్ద స్థిర పడింది.గ్లోబల్ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఔన్స్ బంగారం ధర 1989 డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.90 డాలర్లు పలికాయి. మంగళవారం పొద్దుపోయిన తర్వాత అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనుండటం.. తదనుగుణంగా యూఎస్ ఫెడ్ రిజర్వు ఆధ్వర్యంలోని ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ పాలసీ కమిటీ సమావేశం తీర్మానాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందిస్తున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.

దిగ్గజ టెక్‌ కంపెనీ సీఎఫ్‌ఓ రాజీనామా

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలంజన్‌రాయ్‌ తన పదవికి రాజీనామా చేశారు. అందుకు సంబంధించి బీఎస్‌ఈకు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ పంపారు. నీలంజన్‌రాయ్‌ 2018 నుంచి తన పదవిలో కొనసాగారు. ఆయన తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే నిబంధనల ప్రకారం రాయ్‌ మార్చి 31, 2024 వరకు ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఎగా కొనసాగుతారు. ‘ఇన్ఫోసిస్‌లో కాకుండా బయట వృద్ధి చెందేందుకు అవకాశాలను అన్వేషించడానికి, వ్యక్తిగత కారణాల వల్ల కంపెనీకి రాజీనామా చేశాను. నోటీసు పీరియడ్‌ వరకు ఈ సంస్థలో విధులు నిర్వర్తిస్తాను. నా పదవీకాలంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇన్ఫోసిస్‌ మరింత వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’అని రాయ్ తన రాజీనామా లేఖలో రాశారు.  రాయ్‌ అనంతరం జయేష్ సంఘ్‌రాజ్కా సీఎఫ్‌ఓ బాధ్యతలు చేపడుతారని కంపెనీ తెలిపింది. ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త సీఎఫ్‌ఓగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పింది. జయేష్‌ ఇన్ఫోసిస్‌లో 18 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్‌ డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ..డిప్యూటీ సీఎఫ్‌ఓగా పనిచేస్తున్న జయేష్‌ సీఎఫ్‌ఓగా బాధ్యతలు చేపడుతారు. కంపెనీ ఫైనాన్స్ విభాగంలో చాలా ఏళ్లుగా ఆయన పనిచేస్తున్నారు. కంపెనీని మరింత అభివృద్ధి చెందించడానికి ఆయన అనుభవం ఎంతో అవసరం అవుతుందని అన్నారు. నీలాంజన్‌ భవిష్యత్తు ప్రయత్నాలు ఫలించాలని ఆశిస్తున్నట్లు సలీల్‌ చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z