Editorials

సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత

సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వస్తుందనగానే వివాహాల కోసం ఎదురుచూసే యువతి యువకులు, వివాహానంతరం సంతానం ఆలస్యం అవుతున్న దంపతులు, నూతన గృహం కట్టుకోవాలన్న ఆటంకాల వల్ల ఆగిపోతున్న గృహస్తులు, రుణ బాధలు, గ్రహ బాధలతో బాధపడే అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకొని, ఆరోజు ఉపవాసాలు ఉండి, రాత్రి జాగారాలు చేసి స్వామికి ముడుపులు, పువ్వులు పడగలు, మొక్కుబడులు చెల్లించుకోవడం మా ప్రాంతపు ఆచారం.

మండపేట అగస్తేశ్వర స్వామి దేవాలయం రధం గుడిలో, ఆంజనేయ స్వామి గుడిలో, టౌన్ హాల్ దగ్గర కామాక్షమ్మ గుడిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించేవారు.

వేల మంది భక్తులు పొలాల ద్వారా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏడిద సంగమేశ్వరం ప్రయాణం ఏడిదిలోనే స్నానాలు చేసి గట్టు మీదే పొంగలి వండుకుని నైవేద్యం పెట్టి తినేవారు.

ఏడిదే సంగమేశ్వరం ఒక పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చాలా విశిష్టమైనవిది.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో అతి పురాతన ప్రాచీన ప్రముఖ శైవ క్షేత్రం
శ్రీ సంగమేశ్వర దేవాలయం.
ఈ దేవాలయంలో శివలింగం ఇంద్ర ప్రతిష్ట. అమ్మవారు స్వయంవర పార్వతి దేవి.
శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా అతి ప్రాచీనమైంది.
గౌతమి తుల్యభాగ నదులు అంతర్వాహినులని ఆ నదుల సంగమం అయిన ఈ ప్రదేశంలో ఈశ్వరుడు కొలువు తీరడం తో దీన్ని “సంగమేశ్వరం” గా పిలవబడుతోంది. చారిత్రాత్మక విషయం చూస్తే అనేక శతాబ్దాల క్రితమే అల్లాడి వేమారెడ్డి, మంత్రి బెండపూడి రెండవ అన్న మాత్యుడు శ్రీ సంగమేశ్వర స్వామి కి దేవాలయం మహా మండపాలు నిర్మాణం చేశారు. చాళుక్యుల కాలంలో చాలా వైభవంగా ఉండేది దేవాలయం.
కాలక్రమేణా 14వ శతాబ్దం వచ్చేసరికి శిథిలావస్థకు చేరుకోవడంతో 1425-1426 ఈ మధ్యకాలంలో దేవాలయాన్ని “అన్న మాత్యుడు” పునరుద్ధరణ చేశారని చెబుతారు. ఈ అంతర్వాహిని వద్ద మహామునులు తపమాచరించేవారు.
శ్రీరాముడు కూడా వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి నట్టుగా దానికి ప్రతిగా రామ పాదాలు కూడా ఇక్కడ ఇప్పటికీ ఉంటాయి భక్తులు దర్శించు కోవచ్చు.

ఈ క్షేత్రానికి అనేక భూములు ప్రభువులు కల్పించారు.కాలగర్భంలో కలిసిపోయాయి.
ఈ శైవక్షేత్రానికి రామచంద్రపురం సంస్థానాధీశులు
శ్రీ శ్రీ శ్రీ రాజా కాకర్లపూడి రామచంద్ర బహదూర్ విరివిగా మాన్యాలు ఇచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పొందారు. ఇప్పటికీ శ్రీ రాజా వారి పేరుతో వారి గోత్రం తో ప్రభాత పూజలు, అర్చనలు, నివేదనలు స్వామివారికి జరుపుతారు.

ఇక్కడ వేంచేసియున్న
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అత్యంత ప్రభావవంతమైన, అపార దయా స్వరూపుడు. వివాహం, సంతానలేమి వివాహ, దీర్ఘకాలిక రోగ నివారణార్థం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజలు చేసుకుంటారు. చాలామంది కోరికలు నెరవేరుతాయి. సుబ్రమణ్య షష్టి నాడు ఇక్కడ కొన్ని వేల మంది భక్తులు రాష్ట్రాల నుంచి వచ్చి కూడా దర్శనం చేసుకుంటారు. సుబ్రహ్మణ్య షష్టి నాడు నాగుల చీర ధరించి స్వామి సన్నిధిలో ఉన్న దంపతులకు స్వామి సంతాన యోగాన్ని ప్రసాదిస్తారని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ పరమాత్మలు వారు ఇక్కడ కొలువై ఉంటారు.

దేవాలయం నంది ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన కదంబ వృక్షాలు ఉన్నాయి. స్వామివారికి మారేడు వృక్షాలు ఉన్నాయి. పారిజాతాలు, నాగమల్లి పూలు ,రుద్రాక్ష వృక్షాలు, వినాయక వ్రతకల్పం కి అవసరమైన 21 వృక్షాలు,ఔషధ మొక్కలు, చెరువులు, అద్భుతమైన ప్రశాంతత, రావిచెట్టు వద్ద నాగ ప్రతిష్టలు ఇక్కడ వేటికవి గొప్పగా ఏర్పడిన ప్రకృతి ప్రసాదాలు. అప్పుడు ఇప్పుడు మా మండపేట వాసులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తూనే ఉంటారు. చూడని వారు ఏ మాత్రం అవకాశం ఉన్నా, వచ్చి చూసి తరించండి.
” శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి కృపా కటాక్ష వీక్షణ సిద్ధిరస్తు”
” సర్వేజనా సుఖినోభవంతు “.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z