Politics

ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రసంగించనున్న రేవంత్‌

ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రసంగించనున్న రేవంత్‌

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్‌రెడ్డి తొలి విదేశీ పర్యటన సోమవారం ప్రారంభం కానుంది. ఈ నెల 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ‘ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం) 54వ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి సీఎం నేతృత్వంలో తెలంగాణ అధికారిక బృందం తరలివెళ్లింది. ఆయన వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా తమ దావోస్‌ పర్యటన సాగుతుందని శ్రీధర్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతలు, ప్రాధాన్యాలను ఈ వేదిక ద్వారా సీఎం నేతృత్వంలోని బృందం వివరించనున్నట్లు ఆయన తెలిపారు.

ప్రభుత్వ ప్రాథమ్యాలను వివరించి..
విదేశీ, భారతీయ పారిశ్రామికవేత్తలను కలుసుకొని కొత్త ప్రభుత్వ దార్శనికతను, ప్రాథమ్యాలను వివరించడానికి ప్రపంచ ఆర్థిక వేదిక ఒక అద్భుత అవకాశంగా సర్కారు భావిస్తోంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటిచెప్పి, భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి దీన్ని చక్కటి వేదికగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. మూడు రోజుల దావోస్‌ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు దాదాపు 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవనున్నారు. ఈ వేదికలో నోవార్టిస్‌, మెడ్‌ట్రానిక్‌, ఆస్ట్రాజెనికా, గూగుల్‌, ఊబర్‌, మాస్టర్‌ కార్డ్‌, బేయర్‌, ఎల్డీసీ, యూపీఎల్‌ తదితర అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో భేటీ కానున్నారు. భారత్‌కు చెందిన టాటా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, జేఎస్‌డబ్ల్యూ, గోద్రెజ్‌, ఎయిర్‌టెల్‌, బజాజ్‌ వంటి సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. సీఐఐ, నాస్కామ్‌ వంటి వ్యాపార ఛాంబర్స్‌ ప్రతినిధులతోనూ భేటీ అవుతారు. దావోస్‌ పర్యటన విజయవంతం కావడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదని.. ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌, డేటా సెంటర్లు, డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, ఆహారశుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

వైద్యం, వ్యవసాయంపై ప్రసంగించనున్న సీఎం
తొలి దావోస్‌ పర్యటనలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం కాంగ్రెస్‌ సెంటర్‌లో ప్రసంగించాల్సిందిగా ఆయనను నిర్వాహకులు ఆహ్వానించారు. అక్కడ జరగబోయే చర్చాగోష్ఠిలో ‘పురోగమిస్తున్న వైద్యరంగం’పై సీఎం మాట్లాడనున్నారు. ‘ఫుడ్‌ సిస్టమ్స్‌ అండ్‌ లోకల్‌ యాక్షన్‌’ అనే అంశంపై జరగనున్న అత్యున్నత స్థాయి సదస్సులోనూ రేవంత్‌ పాల్గొంటారు. ఈ సదస్సులో ‘వాతావరణ మార్పుల ప్రభావం.. రైతుల జీవనోపాధి పరిరక్షణ.. వాతావరణం ప్రకారం సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యలు’ తదితర అంశాలపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఏఐ పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేస్తున్న చర్చా వేదికలో ‘డెవలపింగ్‌ స్కిల్స్‌ ఫర్‌ ఏఐ’ అనే అంశంపై మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగించనున్నారు. టెక్‌ కంపెనీలు, వర్తక సంస్థల ప్రతినిధులు, ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలను మంత్రి కలవనున్నారు. ఈ పర్యటనలో ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బర్గె బ్రెండ్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు సమావేశం కానున్నారు. తెలంగాణతో ప్రపంచ ఆర్థిక వేదికకు బలమైన వ్యవస్థీకృత సంబంధాలు ఉన్నాయని, హెల్త్‌ కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌ రంగంపై ఫోరానికి సంబంధించిన ‘సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రెవల్యూషన్‌’ సదస్సు త్వరలో హైదరాబాద్‌లో జరగబోతోందని శ్రీధర్‌బాబు తెలిపారు.

దావోస్‌లో 12 భారత పెవిలియన్లు

దావోస్‌: ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) 54వ వార్షిక సమావేశం సోమవారం దావోస్‌లో ప్రారంభం కానుంది. ఇందులో భారత్‌ సహా వివిధ దేశాలకు చెందిన 2,800 మంది నేతలు పాల్గొంటున్నారు. వీరిలో 60 మందికిపైగా ప్రభుత్వాధినేతలూ ఉంటారు. భారత్‌ నుంచి కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, అశ్వినీ వైష్ణవ్‌, హర్‌దీప్‌ సింగ్‌ పురీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు రేవంత్‌రెడ్డి, సిద్ధరామయ్య, ఏక్‌నాథ్‌ శిందేలు, రాష్ట్రాల మంత్రులు పలువురు, వంద మందికిపైగా సీఈవోలు పాలుపంచుకుంటున్నారు. అయిదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, ఘర్షణలు, నకిలీ వార్తలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌, చైనా ప్రధాని లీ కియాంగ్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివన్‌ తదితరులు పాలుపంచుకుంటారు.

ఈ దఫా డబ్ల్యూఈఎఫ్‌లో భారత్‌కు చెందిన దాదాపు డజను లాంజ్‌లు, పెవిలియన్లు ఏర్పాటయ్యాయి. ఇందులో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు సంబంధించినవి ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z