DailyDose

తుది దశకు చేరుకున్న స్టాఫ్‌నర్సుల నియామక ప్రక్రియ

తుది దశకు చేరుకున్న స్టాఫ్‌నర్సుల నియామక ప్రక్రియ

రాష్ట్రంలో స్టాఫ్‌నర్సు పోస్టుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తుది మెరిట్‌ జాబితా విడుదల చేసి అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ఖరారు చేయనున్నారు. 2022 డిసెంబరు 30న నోటిఫికేషన్‌ ద్వారా ఈ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపికైన వారికి పది రోజుల్లోనే నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. దీంతో బోధనాసుపత్రులతోపాటు వైద్య విధాన పరిషత్‌ తదితర ఆసుపత్రుల్లో 7,031 మంది స్టాఫ్‌నర్సులు అందుబాటులోకి రానున్నారు. దీనికి తోడు రాష్ట్రంలోని బీసీ, ఎస్టీ, మైనార్టీ, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సుమారు 500 మంది రెగ్యులర్‌ స్టాఫ్‌నర్సుల నియామకం కానుండటంతో విద్యార్థులకు మేలు జరగనుంది.

ఎన్నికల తరువాత వేగంగా ప్రక్రియ
మొదటగా 5,204 పోస్టుల భర్తీకే ప్రకటన ఇచ్చి పరీక్ష నిర్వహించినా తర్వాత కొత్తగా అనుమతించిన 1,827 పోస్టులను కూడా ఈ రిక్రూట్‌మెంట్‌ పరిధిలోకే తీసుకురావడంతో మొత్తం 7,031 పోస్టులకు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 40,936 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిరుడు ఆగస్టు 2న రాతపరీక్ష నిర్వహించారు. ప్రభుత్వ వైద్య సేవలో అనుభవానికి ప్రత్యేకంగా పాయింట్లు చేర్చి వాటికీ మార్కులను కేటాయించారు. వీటి ఆధారంగా ప్రాథమిక మెరిట్‌ జాబితాను రూపొందించి గతేడాది డిసెంబరు 30 నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. తుది మెరిట్‌ జాబితాపై అభ్యంతరాలుంటే ఆన్‌లైన్‌లో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. వాటిని పరిష్కరించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను వైద్యారోగ్యశాఖకు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో పది రోజుల్లో నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నియామక ప్రక్రియకు సుమారు మూడు నెలల అంతరాయం ఏర్పడింది. ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రాథమిక మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z