Business

స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డ్-వాణిజ్య వార్తలు

స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డ్-వాణిజ్య వార్తలు

* స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డ్

మ‌క‌ర సంక్రాంతి నాడు సోమ‌వారం దేశీయ స్టాక్ మార్కెట్లు స‌రికొత్త లైఫ్ టైం గ‌రిష్ట రికార్డులు న‌మోదు చేశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి 73 వేల మార్క్‌ను దాట‌డంతో గ‌త ఐదు సెష‌న్ల‌లో ద‌లాల్ స్ట్రీట్ ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.9.68 ల‌క్ష‌ల కోట్లు పెరిగితే, బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ సైతం ఆల్‌టైం హై స్థాయి రూ.376 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 759.49 పాయింట్లు (1.05 శాతం) పెరిగి 73,327.94 పాయింట్ల ఆల్‌టైం రికార్డు న‌మోదు చేసింది. అంత‌కుముందు ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 833.71 పాయింట్లు (1.14 శాతం) పుంజుకుని 73,402.16 పాయింట్ల గ‌రిష్టానికి చేరుకున్న‌ది. దీంతో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.9,68,544.93 కోట్ల‌కు వృద్ధి చెంది లిస్టెడ్ కంపెనీల ఎం-క్యాప్ రూ.3,76,09,510.01 కోట్ల‌కు చేరుకున్న‌ది.

* నెలాఖరులోగా ఫాస్టాగ్ ఖాతాలకు కేవైసీ సబ్మిట్ చేయండి

ఫాస్టాగ్‌ల (FASTag) ద్వారా టోల్‌ వసూళ్లను మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. కేవైసీ (KYC) పూర్తిచేయని ఫాస్టాగ్‌లను నిలుపుదల చేసేందుకు సిద్ధమైంది. ఇటువంటి వాటిని జనవరి 31, 2024 తర్వాత బ్యాంకులు డీయాక్టివేట్‌ లేదా బ్లాక్‌ చేస్తాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రకటించింది.‘ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్‌ ఉన్నా.. కేవైసీ పూర్తి చేయకపోతే జనవరి 31, 2024 తర్వాత వాటిని బ్యాంకులు డీయాక్టివేట్‌/బ్లాక్‌లిస్ట్‌ చేస్తాయి. ఈ అసౌకర్యాన్ని నివారించేందుకు యూజర్లు తమ ఫాస్టాగ్‌లకు కేవైసీ పూర్తి చేసుకోవాలి’ అని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. అదనపు సమాచారం కోసం సమీపంలోని టోల్‌ప్లాజాలు (Toll Plaza) లేదా సంబంధిత బ్యాంకు కస్టమర్‌కేర్‌ నంబర్‌లను సంప్రదించాలని సూచించింది. ఇదేకాకుండా కొన్నిసార్లు వాహనదారులు ఫాస్టాగ్‌లను వాహనం ముందుభాగంలో పెట్టకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని.. దాంతో టోల్‌ప్లాజాల్లో ఆలస్యంతోపాటు ప్రయాణికుల అసౌకర్యానికి కారణమవుతోందని పేర్కొంది.వాహనదారులు ఒకే ఫాస్టాగ్‌ను అనేక వాహనాలకు ఉపయోగించడం, ఒకే వాహనానికి పలు ఫాస్టాగ్‌లను లింక్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కొన్ని సందర్భాల్లో కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్టాగ్‌లు జారీ చేస్తున్నట్లు గుర్తించింది. ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండేందుకు ఒకే వాహనం-ఒకే ఫాస్టాగ్‌ (One Vehicle, One FASTag) విధానానికి ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు చేపట్టింది.

* 64 వేలు దాటిన బంగారం

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కొన్ని నగరాల్లో బంగారం ధర రూ.64 వేల మార్కును దాటేసింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.250 పెరిగి రూ.58,700లకు చేరుకోగా, 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.280 పుంజుకుని రూ.64,040 వద్ద స్థిర పడింది.దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.150 పెరిగి రూ.63,550 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. ఇంతకుముందు సెషన్‌లో తులం బంగారం ధర రూ.63,400 వద్ద ముగిసింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం ఫిబ్రవరి డెలివరీ ధర రూ.188 పెరిగి రూ.62,550 పలికింది. మరోవైపు కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.76,700 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2055 డాలర్లు పలికితే, ఔన్స్ వెండి ధర 23.20 డాలర్ల వద్ద స్థిర పడింది. యూఎస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (పీపీఐ) డేటా బలహీన పడటంతోపాటు మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలతో బంగారానికి గిరాకీ పెరిగిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. గ్లోబల్ మార్కెట్లలో న్యూయార్క్‌లో ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.34 శాతం పెరిగి 2058.50 డాలర్లు పలికింది.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌, కర్ణాటక రాజధాని బెంగళూరు, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా, మహారాష్ట్ర రాజధాని ముంబై నగరాల్లో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.150 పెరిగి రూ.58,150, 24 క్యారెట్స్ బంగారం పది గ్రాములు రూ.170 పుంజుకుని రూ.63,440 వద్ద స్థిర పడింది.

* దూకుడు పెంచిన టీసీఎస్‌

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-రెడీ వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేసే లక్ష్యంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) తమ వ్యాల్యూ చైన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను బలోపేతం చేస్తోంది. ఉత్పాదక ఏఐ ఫౌండేషనల్‌ స్కిల్స్‌లో 1.5 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెన్‌ ఏఐలలో ప్రయోగాత్మక నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఏఐ ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.ఏఐ ఎక్స్‌పీరియన్స్ జోన్ ద్వారా టీసీఎస్‌ ఉద్యోగులు జనరేటివ్‌ ఏఐ ఆధారిత అప్లికేషన్‌లపై పనిచేయవచ్చు. ప్రయోగాలు చేయవచ్చు. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల నుంచి ఓపెన్ సోర్స్ టెక్నాలజీలు, లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌తో ప్రయోగాలు చేయడానికి ఈ జోన్ సహాయపడుతుందని టీసీఎస్‌ పేర్కొంది.కంటెంట్ క్రియేషన్, ఇన్ఫర్మేషన్ డిస్కవరీ, టాస్క్ ఆటోమేషన్ వంటి వినియోగ సందర్భాలలో ఉద్యోగులు ఈ సాధనాలను ఉపయోగించడంలో అనుభవాన్ని పొందవచ్చు.ఇందుకు అవసరమైన అన్ని జెన్‌ ఏఐ కాన్సెప్ట్‌లను కవర్ చేసే ట్యుటోరియల్స్‌ ఈ జోన్‌లో ఉంటాయని కంపెనీ వివరించింది.ఒకే రకమైన ఆసక్తి కలిగి నిర్దిష్ట సమస్యకు పరిష్కారాన్ని రూపొందించడానికి కలిసి పనిచేసే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సహచరులకు ఏఐ ఎక్స్‌పీరియన్స్ జోన్ సహకారాన్ని అందిస్తుందని టీసీఎస్‌ ఏఐ క్లౌడ్ యూనిట్ హెడ్‌ శివ గణేశన్ తెలిపారు. ఉద్యోగుల తమ ఏఐ సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు వీలుగా ఈ ఏఐ ఎక్స్‌పీరియన్స్ జోన్ హ్యాకథాన్‌లు, ఛాలెంజ్‌లు, పోటీలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.

* అయోధ్యలో లగ్జరీ ప్లాట్ కొనుగోలు చేసిన అమితాబ్ బచ్చన్

బిగ్ బీ.. అమితాబ్ బచ్చన్ పరిచయం అక్కర్లేని వయస్సు.. బాలీవుడ్‌లో అలనాటి నుంచి ఇప్పటి వరకూ సినిమాల్లోనూ, టీవీ షోల్లోనూ పాపులర్.. బాలీవుడ్ సూపర్ స్టార్ ఇప్పుడు అయోధ్యలోని సెవెన్ స్టార్ ఎంక్లేవ్‌లో ప్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ట జరుగనున్న రామాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో అమితాబ్ ఈ ప్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ముంబై కేంద్రంగా పని చేస్తున్న రియాల్టీ డెవలపర్ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (హెచ్ఓఏబీఎల్) వద్ద బిగ్ బీ ఈ ప్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. అయితే, ఆ ప్లాట్ విలువ ఎంత, సైజ్ ఎంత సంగతి వెల్లడించడం లేదు. కానీ ప్లాట్ విస్తీర్ణం సుమారు 10 వేల చదరపు అడుగులు ఉంటుందని, దాని విలువ రూ.14.5 కోట్లు ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.వచ్చే సోమవారం (జనవరి 22) నాడు.. అయోధ్యలో రామాలయం ప్రాణప్రతిష్ట జరిగే రోజే సరయు నది ఒడ్డున 51 ఎకరాల విస్తీర్ణంలో గల ఈ ఎంక్లేవ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. రామాలయానికి 15 నిమిషాలు, అయోధ్య వాల్మికీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 నిమిషాల్లో వెళ్లేంత దూరంలోనే ఈ ఎంక్లేవ్ ఉందని తెలుస్తోంది. 2028 మార్చికల్లా పూర్తయ్యే ఈ ఎంక్లేవ్‌లో ఓ ఫైవ్ స్టార్ ప్యాలెస్ హోటల్ కూడా ఉంటుందని రియాల్టీ డెవలపర్ చెబుతున్నారు. ‘అయోధ్యలో సరయూ నది ఒడ్డున హౌస్ ఆఫ్ అభినందన్ లోధా ఎంక్లేవ్‌లో నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నా. నా హ్రుదయంలో అయోధ్య నగరానికి ప్రత్యేక స్థానం ఉంది. అవిశ్రాంత ఆధ్యాత్మికత, సుసంపన్న సంస్క్రుతి సంప్రదాయాలకు నిలయమైన అయోధ్యతో భావోద్వేగ భరితమైన అనుబంధం ఉంటుంది’ అని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బిగ్ బీ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ (ఇంతకుముందు అలహాబాద్)లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ జన్మించారు. అక్కడి నుంచి అయోధ్యకు ప్రయాణించడానికి నాలుగు గంటల సమయం పడుతుంది.ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రానికి అయోధ్య చిహ్నంగా మారుతుందని హెచ్ఓఏబీఎల్ చైర్మన్ అభినందన్ లోధా చెప్పారు. తమ ఎంక్లేవ్‌లో పెట్టుబడి పెట్టిన ఫస్ట్ సిటిజన్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అని తెలిపారు. ఆధ్యాత్మిక వారసత్వానికి మారుపేరుగా నిలిచే అయోధ్యలో ఆర్థిక వ్రుద్ధిరేటుకు అవకాశం ఉందన్నారు.