Movies

ఇన్‌స్టా ద్వారా క్షమాపణలు చెప్పిన నయనతార

ఇన్‌స్టా ద్వారా క్షమాపణలు చెప్పిన నయనతార

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘అన్నపూరణి’ సినిమాపై కొద్దిరోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీపై రాముడిని కించపరిచే విధంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయంటూ.. అలాగే లవ్ జిహాద్ ప్రోత్సహించేలా సినిమా ఉందంటూ దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ చిత్రం హిందూవుల మనోభావాలను దెబ్బతీసిందని.. తక్షణమే ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగించి చిత్రయూనిట్ పై చర్యలు తీసుకోవాలంటూ శివసేన మాజీ నేత రమేష్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ అన్నపూరణి చిత్రాన్ని తొలగించింది. అయితే ఈ వివాదం కొందరు సినీ ప్రముఖులు నయనతారకు మద్దతు తెలుపుతుండగా.. అటు రాజకీయ నాయకులు ఈ చిత్రయూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అన్నపూరణి వివాదం పై స్పందించింది నయన్. తాను.. తన టీమ్ ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోవడం లేదని..తన సినిమా పై నెలకొన్న వివాదం పై క్షమాపణలు తెలిపింది నయన్. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్ స్టాలో జై శ్రీరామ్ అంటూ నోట్ షేర్ చేసింది.

“జై శ్రీరాం.. గత కొన్ని రోజులుగా నా సినిమా అన్నపూరణి చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నాను. అన్నపూరణి సినిమాను కేవలం కమర్షియల్ ఉద్దేశ్యంతో కాకుండా ప్రజల్లోకి మంచి ఆలోచనను తీసుకెళ్లే ప్రయత్నంగా చూశాం. దృఢ సంకల్పంతో పోరాడితే ఏదైనా సాధించవచ్చు అనే ఆలోచనతోనే ఈ సినిమాను చేశాం. కేవలం ఈ మూవీ ద్వారా సానుకూల సందేశాన్ని అందించాలని భావించాము.. కానీ మాకు తెలియకుండానే కొందరి మనసులను గాయపరిచామని తెలిసింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ పొంది.. థియేటర్లలో విడుదలైన ఒక సినిమా ఓటీటీ నుంచి తొలగించారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు, నా టీంకు లేదు. దేవుడిపై ఎంతో నమ్మకంతో అన్ని ప్రార్థనా స్థలాలను సందర్శించే నేను ఉద్దేశపూర్వకంగా ఇలా చేసి ఉండను. అంతకు మించి మీ మనోభావాలను ఏ విధంగానైనా గాయపరిచి ఉంటే క్షమించండి. అన్నపూరణి సినిమా అసలు ఉద్దేశ్యం ఎవరినీ కించపరచడం కాదు.. సినీ పరిశ్రమలో నాది 20 ఏళ్ల ప్రయాణం. ఎప్పుడూ సానుకూల ఆలోచనలను చెప్పాలనుకుంటాను.. ఇతరుల నుంచి మంచి విషయాలను నేర్చుకోవాలనుకుంటాను. ” అని రాసుకొచ్చారు నయనతార.

అన్నపూరణి వివాదం.. తమిళనాడులోని బ్రహ్మాణ కుటుంబానికి చెందిన అన్నపూరణి .. టాప్ చెఫ్ కావాలనే కలలు కంటుంది. కుటుంబీకులు వ్యతిరేకించినా.. కుటుంబానికి తెలియకుండానే చదువుకుంటుంది. కాలేజీలో నాన్ వెజ్ వండాలంటే సందేహించడంతో ఆమె స్నేహితుడు ఫర్జాన్ రాముడి గురించి ఓ డైలాగ్ చెబుతాడు. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు ఆ డైలాగ్ ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఓటీటీలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z