DailyDose

దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతోంది

దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతోంది

మనదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. 2023లో 15.3 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించగా, 2030 నాటికి ఈ సంఖ్య 30 కోట్లకు పెరుగుతుందనే అంచనాను ఆయన వ్యక్తం చేశారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బేగంపేట విమానాశ్రయం వేదికగా ‘వింగ్స్‌ ఇండియా 2024’ వైమానిక ప్రదర్శన గురువారం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ దశాబ్దకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భారత విమానయాన రంగం అత్యధిక వృద్ధితో, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు సాధించిందని సింధియా తెలిపారు. కొన్నేళ్ల పాటు మన విమానయాన రంగం ఏటా 10-15% వృద్ధి సాధిస్తోందని అన్నారు. ‘‘ఈ దశాబ్దంలో దేశీయ ప్రయాణికుల సంఖ్య ఏటా 15%, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 6.1% చొప్పున పెరిగింది. గత 15 ఏళ్లలో విమానాల ద్వారా సరకు రవాణా దేశీయంగా 60%, అంతర్జాతీయంగా 53% వృద్ధి సాధించింది.

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన విపణి మనదే. అంతర్జాతీయ విమానయాన విపణుల్లో మనదేశం ఏడో స్థానంలో ఉంది. దేశీయ సంస్థలు నిర్వహిస్తున్న విమానాల సంఖ్య 400 నుంచి 700కు పెరిగాయి. వచ్చే దశాబ్దకాలంలో మన విమానాల సంఖ్య 2,000కు పెరుగుతుంది.

3 గంటలు ఆలస్యమైతే విమాన సర్వీసు రద్దు
ఏదైనా విమాన సర్వీసు 3గంటలు ఆలస్యమైతే, ఇకపై ఆ విమాన సర్వీసును రద్దుచేయాల్సిందే. ఇటీవల ముంబయి నుంచి దిల్లీ వెళ్లాల్సిన విమానం 12గంటలు ఆలస్యం కావడంతో, ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, కొత్త నిబంధనలు తెచ్చింది’’ అని కేంద్రమంత్రి వివరించారు.

ఉడాన్‌ 5.3 పథకం ప్రారంభం
మరిన్ని కొత్త మార్గాల్లో విమాన సర్వీసులను ప్రోత్సహించేందుకు ‘ఉడాన్‌ 5.3’ పథకాన్ని మంత్రి సింధియా ప్రారంభించారు. ఇప్పటి వరకు ఉడాన్‌ పథకం కింద 517 మార్గాల్లో విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు.

జీఎంఆర్‌ ఏవియేషన్‌ స్కూల్‌..
హైదరాబాద్‌లో జీఎంఆర్‌ గ్రూపు ఏర్పాటు చేసిన జీఎంఆర్‌ ఏవియేషన్‌ స్కూల్‌ను సింధియా ప్రారంభించారు. శంషాబాద్‌లోని జీఎంఆర్‌ ఏరోస్పేస్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో ఏర్పాటైన ఈ స్కూలు, నాలుగేళ్ల ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌ (ఏఎంఈ) కోర్సులు అందిస్తుంది. ఎయిర్‌బస్‌తో సాంకేతిక ఒప్పందంతో ఈ స్కూలును జీఎంఆర్‌ గ్రూపు ఏర్పాటు చేసింది.

ప్రత్యేక ఆకర్షణగా బాహుబలి విమానం
తొలిరోజే 25 విమానాలను ప్రదర్శించడంతో సందడి నెలకొంది. ఈ ఏడాది బాహుబలి విమానం బోయింగ్‌ 777ఎక్స్‌ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎయిర్‌ అంబులెన్స్‌లు, హెలికాప్టర్లు, విభిన్నమైన డ్రోన్లు ఆకట్టుకున్నాయి. తొలిరోజు ప్రదర్శనకు వందల మంది వివిధ దేశాలకు చెందిన ఏరోస్పేస్‌ ఇంజినీర్లు, పారిశ్రామికవేత్తలు, పైలట్లు, ట్రైనీ పైలట్లు హాజరయ్యారు. ఎయిర్‌ ఇండియా ఇండియాస్‌ ఫస్ట్‌ ఏ350, ఇండిగో కార్గో ఏ321ఎఫ్‌ లాంటివి ప్రదర్శనలో కనువిందు చేస్తున్నాయి. మధ్యాహ్నం భారత వాయుసేనకు చెందిన సారంగ్‌ బృందం ఆధ్వర్యంలో చేసిన హెలికాప్టర్ల ప్రదర్శన కనువిందు చేసింది. యూకేకు చెందిన మార్క్‌ జెఫ్రీ బృందం తేలికపాటి నాలుగు విమానాలతో చేసిన విన్యాసాలు సందర్శకులను కట్టిపడేశాయి. ఈనెల 21 వరకు ప్రదర్శన కొనసాగనుంది.

సామాన్యులకు విమానప్రయాణం ప్రధాని మోదీ లక్ష్యం

మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

ఈనాడు, హైదరాబాద్‌: సామాన్య ప్రజలకు విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యమని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. హవాయి చెప్పులు ధరించే వ్యక్తులను విమాన ప్రయాణంలో చూడాలనేది ప్రధాని కల అని అన్నారు. 2047 నాటికి భారతదేశం అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరిస్తుందని తెలిపారు. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో, మీడియా బాధ్యులకు నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాపులోనూ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించడమే లక్ష్యంగా భాజపా నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z