DailyDose

దారి తప్పిన చంద్రబాబు హెలికాఫ్టర్-తాజా వార్తలు

దారి తప్పిన చంద్రబాబు హెలికాఫ్టర్-

* దారి తప్పిన చంద్రబాబు హెలికాఫ్టర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దారితప్పింది. సాంకేతిక కారణాల కారణంగా రాంగ్‌రూట్‌లో వెళ్లిపోయింది. ఇది గమనించిన ఏటీసీ సిబ్బంది.. వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు.రా కదలిరా సభలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి అరకుకు హెలికాప్టర్‌లో బయల్దేరారు. హెలికాప్టర్‌ బయల్దేరిన కొద్దిసేటికే అందులో సాంకేతిక కారణాల వల్ల సమన్వయ లోపం తలెత్తింది. దీంతో ఏటీసీ ఇచ్చిన రూట్‌మ్యాప్‌ అర్థం చేసుకోవడంలో పైలట్‌ గందరగోళానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఒకవైపు వెళ్లాల్సిన హెలికాప్టర్‌ను మరోవైపు తీసుకెళ్లాడు. రాంగ్‌రూట్‌లో హెలికాప్టర్‌ వెళ్తున్నట్లు గమనించిన ఏటీసీ సిబ్బంది వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. హెలికాప్టర్‌ను వెనక్కి పిలిపించి.. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు అనుమతినిచ్చారు. ఏటీసీ అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తర్వాత హెలికాప్టర్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయకు సురక్షితంగా చేరుకున్నారు.

* కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన సీతక్క

ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని.. లేదంటే వారి తరుఫున గొంతు విప్పుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సర్పంచ్‌లకు నిధులు ఇవ్వకుండా బాధపెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ నేతలు, మాజీ మంత్రి కేటీఆర్‌ సర్పంచ్‌ల కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని సీతక్క ఎద్దేవా చేశారు. సర్పంచుల కోసం పోరాడుతామని కేటీఆర్ అనడం.. వెయ్యి పశువులను తిన్న రాబందు నీతి కథలు చెప్పినట్లు ఉందని సీతక్క దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పెండింగ్ బిల్లులు రాక ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఫైర్ అయ్యారు. ఇంట్లో ఆడవాళ్ల పుస్తెల తాళ్లు అమ్మి మరీ అభివృద్ధి పనులు చేస్తే.. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో చేసేదేమి లేక ఎంతో మంది సర్పంచులు సూసైడ్ చేసుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని సర్పంచుల ఆత్మహత్యలకు బీఆర్ఎస్ పార్టీనే కారణమన్నారు.

* హనుమాన్‌ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్‌

గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ (Governor Tamilisai) ఖైరతాబాద్‌లోని హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం (Swachhta Abhiyan) చేశారు. అనంతరం లక్ష్మణ సమేత సీతారాములను దర్శించుకున్నారు. నవగ్రహ ప్రదక్షిణ చేశారు. ఈ నెల 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశంలో ఉన్న అన్ని ఆలయాను శుభ్రం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హనుమాన్‌ ఆలయంలో స్వచ్ఛ అభియాన్‌ చేపట్టారు.అయోధ్యలో శ్రీరామమందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను శుభ్రం చేయాలని దేశ ప్రజలను ప్రధాని మోదీ అభ్యర్థించారు. జనవరి 22 నాటికి దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను శుభ్రం చేయాలని, స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 12న మహారాష్ట్రలోని నాసిక్‌లో పర్యటించిన ప్రధాని.. శ్రీ కాలారామ్ ఆలయాన్ని శుభ్రం చేసిన విషయం తెలిసిందే.

* ఎన్నికల అక్రమాలపై సీఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు

కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. గతేడాది జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అక్రమాలపై సీఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల సహకారంతో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన సీఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్లు కానివారిని సైతం గ్రాడ్యుయేట్లుగా ఓటు హక్కు కల్పించి బోగస్ ఓట్లు వేసుకున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. కానీ, అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నేతలపై గానీ, అధికారులపై గానీ నేటికి ఎలాంటి చర్యలు లేవన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల అక్రమాలపై ప్రతీ ఫిర్యాదుతోపాటు ఆధారాలను సైతం ఎలక్షన్ కమిషన్‌కు పంపామన్నారు.ఓ ఫిర్యాదుపై మాత్రం ఐపీసీ సెక్షన్ 171 డీ, రిప్రజెంటేషన్ ఆప్ పీపుల్స్ యాక్ట్ – 1950 ప్రకారం ఇద్దరు తిరుపతి మునిసిపల్ కార్పొరేటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. దొంగ సర్టిఫికేట్లతో గ్రాడ్యుయేట్లుగా సర్టిఫై చేసి ఓటు హక్కు కల్పించిన ఈఆర్ఓ, ఏఈఆర్ఓలుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మేం అడిగిన గ్రాడ్యుయేట్లు కానీ ఎంతమంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు పొందారన్న సమాచారం మాకు నేటికి ఇవ్వలేదన్నారు. అధికార పార్టీ నాయకులతో అధికారులు కుమ్మక్కయ్యారన్నారు. బోగస్ ఓట్లు నమోదు చేసి ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో గిరీషాతో పాటు అనేకమంది అధికారులు, అధికారపార్టీ నేతలు ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు సహకరించిన ప్రతీ అధికారిపై చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరారు.

* మెరుగుపడుతున్న తమ్మినేని ఆరోగ్యం

ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం మెరుగుపడుతుంది. రెండు రోజుల క్రితం వైద్యులు వెంటిలేటర్‌ను తొలగించారు. అప్పటి నుండి ఎలాంటి సమస్యా లేకుండా తమ్మినేని స్వయంగా శ్వాస తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో, పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు. శనివారం వార్త పత్రికలను కూడా చదివారు. పార్టీ ముఖ్య నాయకులు ఆయనను పరామర్శించారు. కొద్ది రోజుల్లోనే తమ్మినేని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ తెలిపారు. తమ్మినేనిని పరామర్శించేందుకు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని, ఎక్కువ మంది వస్తే ఆయన ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని పోతినేని పార్టీ కార్యకర్తలకు విజప్తి చేశారు.

* పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ‌ధీమాను వ్యక్తం చేశారు. శనివారం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పోటీ ఉంటుందని పేర్కొన్నారు. 2014లోనూ నరేంద్ర మోదీ ప్రభంజనంలోనూ కరీంనగర్‌ లో బీఆర్‌ఎస్‌ గెలిచిందని అన్నారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) మూడవ స్థానానికే పరిమితమైందని ఆరోపించారు. కాంగ్రెస్ సొంతంగా ఇక్కడ గెలిచింది లేదని, ఎమ్మెస్సార్ కూడా బీఆర్ఎస్ సపోర్ట్ తోనే గెలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తామని, ప్రజా తీర్పును గౌరవిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి పోరాడుతామని, అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా పోషిస్తామని తెలిపారు.బీఆర్‌ఎస్‌ను ఎవరూ చీల్చలేరని స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో అత్యధిక కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌ సభ్యులే ఉన్నారని,ఇక్కడ అవిశ్వాసం ఉండబోదని అన్నారు. 45 రోజుల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని ఆరోపించారు. కరీంనగర్ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల విషయంలో రాజకీయాలు అవసరం లేదని తెలిపారు. ‘ అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టాపనను రాజకీయ కోణంలో చూడం. రాముడు అందరివాడు. దైవ కార్యక్రమం ఎవరు చేసినా సంతోషిస్తాం. స్వాగతిస్తామని’ గంగుల కమలాకర్‌ అన్నారు.

* విశాఖ ఆర్థిక వ్యవస్థకు మూలం సముద్రం

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం లోని సముద్రం పైన సపందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం అంటేనే ముందుగా గుర్తుకువచ్చేది సముద్రం అని పేర్కొన్న ఆయన .. విశాఖపట్నం ఆర్ధిక వ్యస్థకు మూలాధారం సముద్రమని తెలిపారు. అలాంటి సముద్రతీరాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం నిజంగా చాలా బాధాకరం అని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. ఇక నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్ధాలు డ్రైనేజీ ద్వారా సరాసరి వచ్చి సముద్రంలో కలుస్తున్నాయని.. ఈ నేపధ్యంలో సముద్రతీరాలు పూర్తిగా వ్యర్ధాలతో నిండి పోయి ఆ ప్రాంతమంతా కలుషితంగా మారుతుంది ఆందోళన వ్యక్తం చేశారు.దీనితో పెరిగిన కాలుష్యం కారణంగా గత 30 సంవత్సరాల వ్యవధిలో 3.4 కిలోమీటర్ల సముద్ర తీరం కుదించుకుపోయిందని.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇలా జరిగిందని మండిపడ్డారు. ఇక దాదాపు రెండు లక్షల మంది మత్స్యకారులు విశాఖ లోని సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని.. అలాంటి సముద్ర తీరాన్ని నిర్లక్ష్యం చేయడమంటే ఆ విశాఖ సముద్ర తీరాలపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేసినట్లే అని పేర్కొన్నారు. ఇక తక్షణమే వ్యర్ధాలు సముద్రంలో కలవకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అసలు మనసు పెడితే విశాఖలో పర్యాటక రంగాన్ని 10 రెట్లు అభివృద్ధి చెయ్యవచ్చని తెలిపిన ఆయన.. ఈ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి రాకపోవడం నిజంగా ఆశ్చర్యం అని వ్యాఖ్యానించారు.

* టీడీపీలోకి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి!

మాజీ మంత్రి, వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పార్థసారథికి పెనమలూరు టికెట్‌ ఇవ్వకుండా.. ఇంఛార్జ్‌గా మంత్రి జోగి రమేష్‌ని నియమించింది వైసీపీ అధిష్టానం.. ఈ పరిణామాలతో టీడీపీతో టచ్‌లోకి వెళ్లిన పార్థసారథి.. త్వరలోనే సైకిల్‌ ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, ఇప్పటికే పెనమలూరు స్థానాన్ని ఆశిస్తున్న టీడీపీ ఇంఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. తాజా పరిణామాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. టీడీపీలోకి వస్తున్న పార్థసారథి.. పెనమలూరు నుంచి టీడీపీ టికెట్ ఆశించటం అనేది ఆయన ఛాయిస్ అన్నారు. అయితే, టికెట్ పై ఫైనల్ నిర్ణయం తీసుకునేది మా పార్టీ అధినేత చంద్రబాబే అన్నారు. సారథికి అధిష్టానం టికెట్ ఫైనల్ చేసిన తర్వాత మాత్రమే ఆయనకి నేను సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటానని హాట్‌ కామెంట్లు చేశారు.అయితే, ఐదేళ్ల నుంచి పార్టీ కోసం పెనమలూరులో కష్ట పడ్డాను అని గుర్తుచేసుకున్నారు బోడే ప్రసాద్‌.. మాకు న్యాయం చేస్తారని చంద్రబాబుపై పూర్తి నమ్మకం ఉంది.. గత ఐదేళ్ల హయాంలో మా వాళ్లు కూడా ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం.. ఐదేళ్ల పాటు కేసులు పెట్టించుకున్న మా కార్యకర్తలు.. ఇప్పుడు వారి నాయకత్వంలో పనిచేయటం ఇష్టం లేకే ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం.. చంద్రబాబును టీడీపీని తిట్టిన వారు పుట్ట గతులు లేకుండా పోతారని హెచ్చరించారు. ఇక, పార్థసారథిపై ఇప్పుడే నేనేం మాట్లాడబోను అంటూ దాటవేశారు టీడీపీ ఇంఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ .

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z