DailyDose

రష్మిక “డీప్‌ఫేక్” వీడియో నిందితుడి అరెస్ట్- నేర వార్తలు

రష్మిక “డీప్‌ఫేక్” వీడియో నిందితుడి అరెస్ట్- నేర వార్తలు

* రష్మిక “డీప్‌ఫేక్” వీడియో నిందితుడి అరెస్ట్

ప్రముఖ సినీనటి రష్మిక (Rashmika Mandanna) డీప్‌ఫేక్‌ వీడియో కేసులో ఏపీలోని గుంటూరుకు చెందిన ఈమని నవీన్‌ (24)ను అరెస్టు చేసినట్లు దిల్లీ డీసీపీ హేమంత్‌ తివారీ వెల్లడించారు. అతడే ఈ వీడియో సృష్టించినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్‌, మొబైల్‌ స్వాధీనం చేసుకొని, విచారిస్తున్నట్లు చెప్పారు. డిలీట్‌ చేసిన డేటాను పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నామన్నారు. రష్మిక పేరుతో కొన్నాళ్లు ఫ్యాన్స్‌ పేజీని నడిపిన నిందితుడు.. ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునేందుకే ఈ వీడియో రూపొందించినట్లు డీసీపీ తెలిపారు. మరో ఇద్దరు ప్రముఖుల పేర్లతోనూ ఫ్యాన్స్‌ పేజీలను నడిపినట్లు పోలీసులు గుర్తించారు.సోషల్‌ మీడియా తార జారా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించిన విషయం తెలిసిందే. చూడటానికి అభ్యంతరకరంగా ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ రష్మిక ఆవేదన చెందారు. దిల్లీ మహిళా కమిషన్‌ నుంచి పోలీసులకు నోటీసులు అందాయి. గతేడాది నవంబరు 10న ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

* యువతను టార్గెట్ చేసి ట్రాప్ చేస్తున్న ఓ వైద్యుడు

పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ.. యువతను టార్గెట్ చేసి ట్రాప్ చేస్తున్న ఓ వైద్యుడు నిర్వాకం తన భార్యే బయటపెట్టింది. అనారోగ్యంతో వైద్యం కోసం తన వద్దకు వస్తున్న పేషెంట్లను హోమో సెక్స్‌తో కోరికలు తీర్చుకుంటున్నాడని భార్యే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది.హైదరాబాద్ మౌలాలికి చెందిన డాక్టర్ జవ్వాద్ అలీ ఖాజాకు నగరానికి చెందిన యువతితో 2014లో వివాహమైంది. ఆ తర్వాత వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. వివాహ సమయంలో యువతి తల్లిదండ్రులు జవ్వాద్‌కు కట్నంగా రూ.25 లక్షల నగదు, 30 తలాల బంగారం ఇచ్చారు. అయితే పెళ్లయిన కొన్నేళ్లకే అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. అయినా తన వైవాహిక జీవితం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్ని వేధింపులనైనా భరిస్తూ వచ్చింది భార్య. అయితే ఫిబ్రవరి 20, 2023న తన భర్త ఇంటి నుంచి పారిపోయాడు. ఇంట్లోని సీసీ కెమెరాలను ఆపి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఇంటి పై అంతస్తులో ఉంటున్న విష్ణువర్ధన్ రెడ్డి అనే విద్యార్థిని భర్త గురించి అడిగింది.విష్ణవర్దన్ ను అడిగిన కొద్దిసేపటికే.. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య లేఖలో, జవ్వాద్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పేర్కొన్నాడు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. తనకున్న పరిచయాలతో కేసు నుంచి తప్పించుకున్నాడు. అయితే హైదరాబాద్ నుంచి పారిపోయి ప్రస్తుతం హర్యానాలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ కూడా మెడిసిన్ పేరుతో యువకులను టార్గెట్ చేసి వారిని లొంగదీసుకుని హోమో సెక్స్ కు పాల్పడుతున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలను జవ్వాద్ భార్య మీడియాకు విడుదల చేసింది. వైద్య వృత్తిలో ఉంటూ యువతను టార్గెట్ చేస్తూ స్వలింగ సంపర్కానికి పాల్పడుతున్న జవ్వాద్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి తనను కఠినంగా శిక్షించాలని, తనకు, తన ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

* కోల్‌కతా యువతులతో అబిడ్స్‌లో వ్యభిచారం

అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గత కొంతకాలంగా కోల్‌కతా నుంచి యువతులను తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోన్న ఫార్చ్యూన్‌ లాడ్జిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. 16 మంది అమ్మాయిలు, ఆరుగురు కస్టమర్లు, ఇద్దరు ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 22 ఫోన్లు, రికార్డులను సీజ్‌చేసి లాడ్జికి తాళం వేశారు. యజమాని అఖిల్‌, మేనేజర్‌ రఘుపతి, పట్టుబడిన అమ్మాయిలతో పాటు విటులను అరెస్టు చేసి కోర్టు ఆదేశాలమేరకు చర్లపల్లి జైలుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

* తల్లి లేని సమయంలో కూతురిపై అత్యాచారం

తెలంగాణలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతిపై తాపీ మేస్త్రీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇస్నాపూర్‌లో పెద్దిరాజు అనే ఓ వ్యక్తి తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. తన వద్దకు కూలీ పనికి వచ్చే ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళ కూతురిపైనా కన్నేశాడు. ఇటీవల ఇంట్లో తల్లిలేని సమయం చూసి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు పటాన్ చెరు పోలీసులు పెద్దిరాజుపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* బంజారాహిల్స్‌లో అగ్ని ప్ర‌మాదం

హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న మూడు కార్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు స్పందించి సకాలంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* సూసైడ్ చేసుకున్న భార్యాభర్తలు

కృష్ణా జిల్లాలోని గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. 500 రూపాయల కోసం భార్యాభర్తల మధ్య వివాదం జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో భార్య మీద కోపంతో ఇంట్లోనే ఉరి వేసుకొని భర్త కొలుసు రాంబాబు ఆత్మహత్య చేసుకున్నారు. భర్త ఉరి వేసుకున్న విషయాన్ని తల్లి కనకదుర్గ తన కొడుకుకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే తన తండ్రిని కొడుకు హుటాహుటిని ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే రాంబాబు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.తండ్రి చనిపోయిన విషయాన్ని ఫోన్ ద్వారా కుమారుడు తల్లికి వివరించాడు. భర్త మరణవార్త విని మనస్తాపం చెందిన భార్య కనకదుర్గ ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయింది. తండ్రి శవాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఉరి వేసుకుని వేలాడుతున్న తల్లిని చూసి కుమారుడు షాక్ అయ్యాడు. అమ్మనైన కాపాడుకుందాం అని కుమారుడు ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే అతని తల్లి కనకదుర్గ ప్రాణాలు కోల్పోయింది. చిన్న గొడవ కారణంగా క్షణికావేశంలో భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకొని దంపతుల మరణానికి గల కారణాలను వన్ టౌన్ పోలీసులు తెలుసుకుంటున్నారు.

* హాస్టల్లో అగ్ని ప్రమాదం

చైనా (China)లో శుక్రవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పాఠశాల వసతి గృహంలో జరిగిన ఈ ఘటనలో 13 మంది విద్యార్థులు మృతి చెందారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. హెనాన్‌ ప్రావిన్స్‌లోని యింగ్‌కాయ్‌ పాఠశాల వసతి గృహంలో రాత్రి 11 గంటలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 13 మంది చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులందరూ మూడో తరగతి చదువుతున్న విద్యార్థులని పాఠశాల ఉపాధ్యాయుడు మీడియాకు వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

* జోగిపేటలో ప్రేమ పేరుతో మోసపోతున్న బాలికలు

మైనర్‌ బాలికలు ప్రేమ పేరుతో మోసపోతున్న కేసులే ఎక్కువయ్యాయని సంగారెడ్డి డీఎస్‌పీ రమేష్‌ అన్నారు. శనివారం జోగిపేటలోని పోలీస్‌ స్టేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జోగిపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కేసుల విశ్లేషణలో పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసులే ఎక్కువగా వస్తున్నాయన్నారు. 16 నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన బాలికలు ప్రేమ పేరుతో మోసపోతున్నారని, వయస్సు మీద అవగాహన లేకపోవడం, అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేసుకోవాలన్న విషయం అబ్బాయిలకు తెలియకపోవడంతో, నెలకు మూడు నుంచి నాలుగు కేసులు నమోదవుతున్నాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల నుంచి ఎక్కువగా ఇలాంటి కేసులు వస్తున్నాయన్నారు.తల్లిదండ్రులకు, పిల్లలకు సరైన అవగాహన లేకపోవడంతోనే పోక్సో చట్టం కేసుల బారిన పడుతున్నారన్నారు. సరైన వయస్సు రాకముందు ఏర్పడిన పరిచయం, వివాహం జరిగిన తర్వాత అక్రమ సంబంధాన్ని ఏర్పరుచుకునేందుకు దారి తీసిందనడానికి ఈ రోజు జరిగిన హత్య కేసు నిదర్శనమన్నారు. పోలీస్‌ శాఖ తరపున ప్రతి పాఠశాల, కళాశాలలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి, వారికి అవగాహన కల్పించి చైతన్యపరిచేందుకు తమవంతుగా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో జోగిపేట సీఐ నాగరాజ్, ఎస్‌ఐలు అరుణ్‌కుమార్‌గౌడ్, క్రాంతి కుమార్, ఎస్‌ఐ–2 మొగులయ్య, ఏఎస్‌ఐ అంజయ్యతో పాటు సిబ్బంది ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z