Movies

తిరుపతిలో సినిమా షూటింగ్ కారణంగా భక్తుల ఇక్కట్లు-తాజావార్తలు

తిరుపతిలో సినిమా షూటింగ్ కారణంగా భక్తుల ఇక్కట్లు-తాజావార్తలు

* తిరుపతిలో హీరో ధనుష్ సినిమా షూటింగ్ కు సంబంధించి రేపటి అనుమతిని రద్దు చేశారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రద్దు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా.. రేపు గోవింద రాజస్వామి ఆలయం వద్ద షూటింగ్ చేసి తీరుతామని చిత్ర యూనిట్ ప్రకటించింది. షూటింగ్ చేస్తే అడ్డుకుంటామని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని బీజేపీ వార్నింగ్ ఇచ్చింది. కాగా.. ఈ వివాదం పెద్దది కావడంతో రేపటి సినిమా షూటింగ్ కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. ఇదిలా ఉంటే.. ఉదయం అలిపిరి గరుడ సర్కిల్ వద్ద చిత్ర యూనిట్ షూటింగ్ నిర్వహించింది. అలిపిరి రోడ్డులో నగర ప్రధాన వీధుల్లో సినిమా షూటింగ్ చేశారు. దీంతో.. భక్తులు, విద్యార్థులు, అంబులెన్స్ లు, నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. అంతేకాకుండా.. షూటింగ్ పేరుతో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రశ్నించిన వారిపై బౌన్సర్లతో దాడి చేశారని భక్తులు ఆరోపించారు. ee క్రమంలో.. తిరుపతి ప్రధాన రోడ్లపై సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వవద్దని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెంపుల్ సిటీలో సినిమా షూటింగ్ లకు అనుమతి ఇచ్చిన వారిపై ఈస్ట్ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆధ్మాత్యిక క్షేత్రం.. అది తిరుమలకు వెళ్ళే రోడ్డు.. ఎలా షూటింగ్ అనుమతి ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రేపటి షూటింగ్ అనుమతి రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేయగా.. తాజాగా సినిమా షూటింగ్ కు సంబంధించి రేపటి అనుమతిని రద్దు చేశారు.

* కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) రాజ్యసభకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ పదవీకాలం త్వరలో ముగియనుంది. దాంతో ఖాళీ కానున్న ఆ స్థానం నుంచి సోనియా గాంధీ లేక ప్రియాంకా గాంధీని ఎగువ సభకు పంపాలని భావిస్తున్నట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్ ప్రతిభాసింగ్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘దీనిపై మేం సోనియా, ప్రియాంకతో చర్చిస్తాం. వారు ఆసక్తి చూపిస్తే.. ఇద్దరిలో ఒకరు ఆ స్థానంలో రాజ్యసభకు వెళ్తారు’ అని ప్రతిభాసింగ్ వెల్లడించారు. ప్రస్తుతం సోనియా.. రాయబరేలీ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. ప్రియాంక మాత్రం ఇంతవరకు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించలేదు.

* తిరుపతి జిల్లా సత్యవేడు వైకాపా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. మంగళవారం ఆయన కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో లోకేశ్‌తో సమావేశమయ్యారు. పార్టీ మారే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవలే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన సత్యవేడు వైకాపా ఎమ్మెల్యే .. లోకేశ్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

* పల్నాడు జిల్లా క్రోసూరులో వైకాపా నాయకులు, కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కుమారుడు కల్యాణ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని కంచేటి సాయి కోసం గాలిస్తూ బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో సాయి అనుచరుడు కె.రాము కన్సల్టెన్సీ ఆఫీసుపై దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. వైకాపా శ్రేణుల తీరుతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారమే అండగా ఎమ్మెల్యే అనుచరులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నా పట్టించుకోకుండా క్రోసూరు పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారనే విమర్శలు వస్తున్నాయి.

* ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసేందుకు తెదేపా, జనసేన పార్టీల అధినేతలు సిద్ధమయ్యారు. పొత్తు నేపథ్యంలో ఫిబ్రవరిలో సీట్ల సర్దుబాటుపై ఇరుపార్టీలు ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) సమావేశమై చర్చించారు. అతి త్వరలోనే వారిద్దరూ మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం. రానున్న 2-3 రోజులు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు మీదే చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిసింది. సీట్ల సర్దుబాటు కసరత్తు కోసం ‘రా.. కదలి రా’ సభలకు ఆయన తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాల్లో ఈ సభలు పూర్తికాగా.. వచ్చే నెల 4 నుంచి మిగిలిన చోట్ల నిర్వహించనున్నారు. సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపైనా చంద్రబాబు, పవన్ తుది కసరత్తు చేయనున్నారు.

* భూములను కబ్జా చేయడమే వైకాపా పనిగా పెట్టుకుందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పారా? అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. విశాఖపట్నంలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయ్యన్న మాట్లాడారు. ‘‘వైకాపా నేతలు భూములు కనిపిస్తే బెదిరించి లాక్కుంటున్నారు. ఆ పార్టీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయింది. ఈ నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారని సభ పెట్టారు? విశాఖ బీచ్‌ రోడ్డు నుంచి భీమిలి వెళ్లే వరకు ప్రభుత్వ భూములను మిగిల్చారా? ఇక్కడి ప్రజలు ఎందుకు మీకు ఓట్లేయాలి? భూములు దోచుకున్నందుకా? వదిలిపెట్టేదే లేదు.. మూడు నెలల తర్వాత అందరి లెక్కలు తీస్తాం. ఎన్నికల తర్వాత జగన్‌ లండన్‌, అమెరికాలో దాక్కున్నా లాక్కొస్తాం.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం.” ani annaaru.

* పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్‌ (YS Jagan) కసరత్తు చేస్తున్నారు. సీఎంవో నుంచి పలువురు సిటింగ్‌ ఎమ్మెల్యేలు, కీలక నేతలకు పిలుపు వచ్చింది. తాడేపల్లి చేరుకున్న వైకాపా నేతలతో జగన్‌ చర్చిస్తున్నారు. మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, ఉష శ్రీచరణ్‌, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీశ్‌ (ముమ్మిడివరం), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), బుర్రా మధుసూదన్‌ (కనిగిరి), ధనలక్ష్మి (రంపచోడవరం), ఎమ్మెల్సీ అనంతబాబు తదితరులు వచ్చారు. నేతలతో వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే నాలుగు జాబితాలను వైకాపా విడుదల చేయగా.. త్వరలో ఐదో లిస్ట్‌ను వెల్లడించే అవకాశముంది.

* ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఓ ప్రకటనలో తెలిపింది. సూర్య జయంతిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై శ్రీమలయప్పస్వామి ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ పర్వదినం నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది.

* నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర మంగళవారం బాపట్ల జిల్లాలో కొనసాగింది. తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. తొలుత కొల్లూరు మండలం చిలుమూరులో రామలింగేశ్వరస్వామి, వేణుగోపాల స్వామి ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భట్టిప్రోలు మీదుగా చెరుకుపల్లి మండలం చేరుకుని వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల ఆర్థిక సాయం అందించారు. స్థానికంగా ఉన్న మహిళలతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, ఎమ్మెల్సీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z