DailyDose

శంషాబాద్ విమానాశ్రయంలో కారు బీభత్సం-నేరవార్తలు

శంషాబాద్ విమానాశ్రయంలో కారు బీభత్సం-నేరవార్తలు

* శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న కారును వెనుకనుంచి మరో కారు ఢీకొట్టింది. దీంతో రెండూ పల్టీలు కొడుతూ కల్వర్టులోకి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రంగా.. ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. విమానాశ్రయం ప్రధాన రహదారిలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవం మండలం ఐ.పోలవరంలో విషాదం చోటుచేసుకుంది. సీతపల్లి వాగులో స్నానానికి దిగి ముగ్గురు పదో తరగతి విద్యార్థులు మృతి చెందారు. మృతులను తూ.గో.జిల్లా గోవరం మండలం కె.ఎర్రంపాలెం వాసులుగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

* జూబ్లీహిల్స్‌ హనీట్రాప్‌ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్థిరాస్తి వ్యాపారి పుట్టరాము అలియాస్‌ సింగోటం రామన్న (36) హత్యకేసులో.. నిందితురాలిగా ఉన్న ఇమామ్‌బీ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఆమెపై ఇప్పటికే వివిధ పోలీసు స్టేషన్లలో ఐదు ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్లు గుర్తించారు. 2017, 2018లో ఇద్దరు వేర్వేరు అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న ఇమామ్‌బీని పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 2020లోనూ జూబ్లీహిల్స్ వెంకటగిరిలో వ్యభిచారం నడిపిస్తోందని అదుపులోకి తీసుకున్నారు. 2017లో మేడిపల్లికి చెందిన విష్ణుకాంత్ అనే వ్యక్తిని బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.3 లక్షలు నగదును కాజేసినట్లు కేసు నమోదైంది. 2019లో తన కుమార్తెను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ ఆమె తప్పుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇలా ఇమామ్‌బీ పలువురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు.

* ఓ హోటల్‌ గదిలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన దిల్లీలోని నాంగ్లోయ్‌(Nangloi) ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం తమ హోటల్‌లోని ఓ గదికి లోపల నుంచి లాక్‌ చేసుందని, గదిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్పందించట్లేదని హోటల్‌ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వద్ద లభించిన ఆధారాలను బట్టి వారిని హరియాణా(Haryana) వాసి జితేష్ ఘంఘాస్(29), నాంగ్లోయ్‌కు చెందిన సచిన్ (24)గా గుర్తించారు. గదిలో కొన్ని మందుల సీసాలు (medicine), సిరంజిలు(syringes) కూడా లభ్యమవ్వడంతో మాదకద్రవ్యాలను అధికంగా తీసుకోవడంతో చనిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను ఎస్‌జీఎం ఆసుపత్రికి తరలించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు.

* హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారంపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) లోతుగా దర్యాప్తు చేస్తోంది. కస్టడీ విచారణ సమయంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పేరును శివబాలకృష్ణ చెప్పడంతో.. అతణ్నీ విచారించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయ సలహాతో నోటీసులు జారీ చేసి విచారించడానికి సిద్ధమవుతోంది. ఐఏఎస్ అధికారి ఆదేశాల మేరకు అనుమతులు జారీ చేసి రూ.కోట్లను శివబాలకృష్ణ గడించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. పలు స్థిరాస్తి సంస్థలకు అనుమతులు మంజూరు చేసినందుకు లభించిన సొమ్ములో ఆయన వాటాను తానే స్వయంగా తీసుకెళ్లి అప్పగించినట్లు నేరాంగీకార వాంగ్మూలంలో బహిర్గతం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారి మధ్య వాట్సప్‌ సంభాషణలు జరిగాయని, అక్రమార్జనను ఆస్తులుగా మార్చుకునేందుకు బినామీలతోనూ సంభాషించినట్లు చెబుతున్నారు. భూములు కొని రిజిస్ట్రేషన్‌ చేసిన సమయంలో బినామీలు అక్కడే ఉన్నట్లు నిరూపించాల్సిన అవసరం ఏసీబీ ముందుంది. అలాగే ఐఏఎస్‌ అధికారికి వాటాల సొమ్మును శివబాలకృష్ణ స్వయంగా ముట్టజెప్పిన సమయంలోనూ ఇద్దరూ ఒకే చోట ఉన్నట్లు తేల్చాల్సి ఉంది. సెల్‌ఫోన్ల డేటాను వడపోసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు కేసును ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వ అనుమతులను అధికారులు తీసుకోనున్నారు. స్వాధీనం చేసుకున్న చరవాణులు, ల్యాప్‌టాప్‌లను విశ్లేషిస్తున్న అధికారులు.. 161 నోటీసులు ఇచ్చి వివరాలు సేకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z