Business

₹16వేల కోట్లకు కొంత వాటాను అమ్మేసిన బెజోస్-వాణిజ్య వార్తలు

₹16వేల కోట్లకు కొంత వాటాను అమ్మేసిన బెజోస్-వాణిజ్య వార్తలు

* బిలియనీర్‌ జెఫ్‌ బెజోస్‌ 1.2 కోట్ల అమెజాన్‌ షేర్లను విక్రయించారు. వీటి విలువ దాదాపు రెండు బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. ఈ విషయాన్ని ఆయన శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించారు. 2021లో సీఈఓ బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత షేర్లను అమ్మడం ఇదే తొలిసారి. 2025 జనవరి నాటికి ఐదు కోట్ల షేర్లను విక్రయించాలనుకుంటున్నట్లు గత ఏడాది నవంబర్‌లోనే వెల్లడించారు. తాజా 1.2 కోట్ల షేర్లను బుధ, గురువారాల్లో అమ్మేసినట్లు బెజోస్‌ (Jeff Bezos) వెల్లడించారు. 169.71 – 171.02 డాలర్ల మధ్య వివిధ ధరల వద్ద వీటిని అమ్మినట్లు తెలిపారు. శుక్రవారం అమెజాన్‌ షేరు 174.45 దగ్గర స్థిరపడింది. గత 12 నెలల్లో దీని విలువ 78 శాతం పుంజుకుంది. 2023 ఫిబ్రవరి నాటికి బెజోస్‌కు కంపెనీలో 12.3 శాతం వాటా ఉంది. ప్రణాళికలో భాగంగా ఐదు కోట్ల స్టాక్స్‌ను విక్రయించినా.. ఇంకా ఆయనకు 11.8 శాతం వాటా ఉంటుందని అంచనా.

* స్మార్ట్‌ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్‌, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్‌ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్‌ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. అవసరమైతేనే కొత్త ఫోన్‌ కొందామనే ధోరణికి వినియోగదారులు వచ్చేశారు. మడత పెట్టేందుకు వీలున్న స్మార్ట్‌ఫోన్లు కొంత ఆకర్షించినా.. ధర బాగా ఎక్కువ కావడంతో, కొనుగోళ్లు పరిమితంగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు విడుదల చేస్తున్న జనరేటివ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాంకేతికత గల స్మార్ట్‌ఫోన్లు.. మళ్లీ ఈ రంగంలో భారీ మార్పులకు కారణం అవుతాయని, అమ్మకాలు పెంచేందుకు దోహద పడతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

* ఫ్లోట్‌ గ్లాస్‌ తయారీ కంపెనీ ‘గోల్డ్‌ ప్లస్‌ గ్లాస్‌ ఇండస్ట్రీ లిమిటెడ్‌’ ఐపీఓకి సిద్ధమవుతోంది. ఈ మేరకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి కోరుతూ ప్రాథమిక పత్రాలను సమర్పించింది. రూ.500 కోట్లు విలువ చేసే కొత్త షేర్లతో పాటు 1.56 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఐపీఓలో (IPO) అందుబాటులో ఉంచనుంది. ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.100 కోట్లు సమీకరించాలని గోల్డ్‌ ప్లస్‌ గ్లాస్‌ ఇండస్ట్రీ యోచిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఆ మేరకు ఐపీఓ పరిమాణాన్ని కుదిస్తారు. సమీకరించిన నిధులను రుణ చెల్లింపులతో పాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నారు. భారత్‌లో ఫ్లోట్‌ గ్లాస్‌ తయారు చేస్తున్న ప్రధాన కంపెనీల్లో ఇది కూడా ఒకటి. 2023 సెప్టెంబర్‌ నాటికి దేశీయ తయారీలో 22 శాతం వాటా ఈ కంపెనీదే. దీని ఉత్పత్తులను వాహన, నిర్మాణం రంగాలు సహా వివిధ పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. దీని తయారీ కేంద్రం బెళగావిలో ఉంది. క్లియర్‌ గ్లాస్‌, 28 రకాల వాల్యూ-యాడెడ్‌ గ్లాస్‌లు, 11 రకాల ప్రాసెస్డ్‌ గ్లాస్‌ ఉత్పత్తులను తయారు చేస్తోంది.

* ఎన్నికల ముంగిట్లో.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.25 శాతంగా ఖరారు చేసింది. గత మూడేళ్లలో ఇదే అత్యధిక రేటు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ అధ్యక్షతన శనివారం ఇక్కడ జరిగిన ఈపీఎఫ్‌వో ధర్మకర్తల బోర్డు (సీబీటీ) సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. ఈ సిఫార్సును కేంద్ర ఆర్థిక శాఖకు పంపనుంది. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చాక వడ్డీ రేటును ఈపీఎఫ్‌వో అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత ఆ సొమ్మును 8 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2023-24 సంవత్సరానికి చందాదారుల ఖాతాల్లో వడ్డీ రూపంలో రూ.1.07 లక్షల కోట్లను జమ చేయాలని ధర్మకర్తల బోర్డు నిర్ణయించింది. ఇప్పటివరకూ ఇదే అత్యధికమని కేంద్ర కార్మికశాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z