Politics

మాజీ మంత్రి నారాయణపై మరదలి ఫిర్యాదు-నేరవార్తలు

మాజీ మంత్రి నారాయణపై మరదలి ఫిర్యాదు-నేరవార్తలు

* మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సుల్తాన్‌పూర్‌ ఓఆర్‌ఆర్‌ దగ్గర కారులో ఆపస్మారక స్థితిలో ఉన్న మెడికో రచనా రెడ్డి(25)ని పోలీసులు ఆసుపత్రికి తరలించేలోగా మృతిచెందింది. మత్తు ఇంజక్షన్‌ తీసుకుని ఆపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న రచనా రెడ్డి.. ప్రస్తుతం బాచుపల్లి మమతా కాలేజీలో ఇంటర్న్‌షిప్‌ చేస్తోంది. ఆమె మృతిపై అమీన్‌పూర్‌ పోలీసులు విచారణ చేపట్టారు.

* మాజీ మంత్రి పొంగూరు నారాయణపై ఆయన మరదలు ప్రియ నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. తనను నారాయణ లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో ప్రియ పేర్కొన్నారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, తనను పిచ్చిదానిలా క్రియేట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అంతకుముందు ముందు ప్రియ ఇంటి వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. నారాయణపై ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న ప్రియను ఇంటి వద్ద ఆమె భర్త మణి, ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వీరి చెర నుంచి తప్పించుకుని మరీ ప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

* ఉత్తరప్రదేశ్‌ మధుర పరిధిలోని మహవాన్‌ వద్ద యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మందితో ప్రయాణిస్తున్న బస్సు కారును ఢీకొన్న ఘటనలో అయిదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. బస్సు బీహార్‌ నుంచి ఢిల్లీ వైపు వెళుతోంది. ఈ ప్రమాదం కారణంగా చెలరేగిన మంటల్లో కారు పూర్తిగా కాలిపోయి అందులోని వ్యక్తులు సజీవ దహనమైనట్లు సమాచారం. బస్సులో ఉన్నవారంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది.

* వారాంతపు విడిదిలు వ్యభిచార గృహాలుగా మారుతున్నాయి. వీకెండ్‌లో సరదాగా గడపడానికంటూ నగర శివారు ప్రాంతాల్లో నిర్మించుకుంటున్న ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు దాడిచేసి గుట్టురట్టు చేస్తున్నా మళ్లీ కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు ఫాంహౌస్‌లను లీజ్‌కు తీసుకుని వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో వాటికి ఆకర్షితులై యువత పెడదారి పడుతుంది. హైదరాబాద్‌ శివారుల్లోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో చాలా మంది బడాబాబులు ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. 111 జీఓ పరిధిలో ఉన్న మొయినాబాద్, శంకర్‌పల్లి, శంషాబాద్‌ మండలాల్లో ఫాంహౌస్‌లు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఒక్క మొయినాబాద్‌ మండలంలోనే సుమారు వెయ్యికి పైగా ఫాంహౌస్‌లున్నాయి. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న మొయినాబాద్‌ మండలంలో చాలా మంది 10 గుంటల నుంచి 1 ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి అందులో ఫాంహౌస్‌ నిర్మిస్తున్నారు. వీకెండ్స్‌లో పిల్లలతో ఎంజాయ్‌ చేయడానికి ఫాంహౌస్‌లు నిర్మించుకుని తర్వాత వాటిని ఇతరులకు లీజుకు, అద్దెకు ఇస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z