Politics

జగన్‌తో కొడాలి నాని భేటీ – News Roundup – Feb 12 2024

జగన్‌తో కొడాలి నాని భేటీ – News Roundup – Feb 12 2024

* కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇచ్చిన తర్వాత హరీశ్‌రావుకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అవకాశమిచ్చారు. ప్రభుత్వం సత్య దూరమైన ప్రజంటేషన్‌ ఇచ్చిందని హరీశ్‌ ఆరోపించారు. పీపీటీ కోసం తమకూ అవకాశమివ్వాలని కోరామని.. వాస్తవాలను వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్పీకర్ అవకాశమివ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటన చేయడం తెలంగాణ ప్రజలు, భారాస విజయమని తెలిపారు. మంగళవారం భారాస ఆధ్వర్యంలో నల్గొండలో సభ పెడుతున్నందునే మంత్రి ఈ ప్రకటన చేశారని.. తప్పులను సవరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాను మోసం చేసినందునే ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించారని చెప్పారు. ఏపీ అసెంబ్లీలో జగన్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ వినలేదా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చెప్పిన తర్వాత కూడా తామే తప్పు చేసినట్లు మాట్లాడితే ఎలా? అని నిలదీశారు. కేసీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తమ జిల్లాను మోసం చేశారని ఆరోపించారు. భారాస పుణ్యమాని వ్యవసాయం సంగతి అటుంచితే.. తాగునీటికీ ఇబ్బందులు తప్పడం లేదన్నారు. జగదీశ్‌రెడ్డికి ముఖం చెల్లకే నేడు సభకు రాలేదన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలన్నారు. ఆ తర్వాతే నల్గొండ సభకు రావాలని కోమటిరెడ్డి డిమాండ్‌ చేశారు.

* బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందని.. అయితే కాంగ్రెస్ ఈ విషయంపై హర్షం ప్రకటించలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు(BJP MP GVL Narasimha Rao) అన్నారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పీవీకు భారతరత్న ఇవ్వడం ఆనంద దాయకమని చెప్పారు. విశాఖ అభివృద్ధి చెందిన నగరంగా నీతి ఆయోగ్ రోడ్డు మ్యాప్‌లో స్థానం లభించిందని తెలిపారు.

* గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మరోసారి వాదనలు వినిపించనున్నారు. దీంతో విచారణను ఈ నెల 14వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. ఎమ్మెల్సీల నియామకాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ పరిధికి మించి వ్యవహరించి మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని తిరస్కరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించడంతో గవర్నర్ ఆమోదించారు. వీరిని ప్రతివాదులుగా చేర్చడంతో వాళ్ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ తరఫు న్యాయవాదులు మరోసారి పిటిషన్లపై వాదించనున్నారు.

* ‘మాజీ మంత్రి హరీశ్‌రావు.. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీలో చిట్‌చాట్‌గా ఆయన మాట్లాడారు. భారాసలో ఉన్నా హరీశ్‌కు ప్రయోజనం లేదని.. కాంగ్రెస్‌లోకి వస్తే తీసుకుంటామని చెప్పారు. ఇందుకు 25 మంది భారాస ఎమ్మెల్యేలతో పార్టీలోకి రావాలని షరతు పెట్టారు. అప్పుడు ఆయనకు దేవాదాయశాఖ ఇస్తామన్నారు. భారాస హయాంలో చేసిన పాపాలను కడుక్కోవడానికి ఈ మంత్రి పదవి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.

* కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని రాష్ట్ర ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో అక్కడికి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే.. 10.15 వరకు సభలో పాల్గొంటారు. అనంతరం అసెంబ్లీ నుంచి బస్సుల్లో నేరుగా మేడిగడ్డకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడికి చేరుకుంటారు. రెండు గంటలపాటు సైట్‌ విజిట్‌, పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఉంటుంది. కార్యక్రమం పూర్తయ్యాక సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

* పోటీ పరీక్షల అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగాలకు వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ జీవో జారీ చేసింది. జనరల్ కేటగిరీలో వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత 2015లో వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచారు. నిరుద్యోగ యువత, టీఎస్‌పీఎస్సీ వినతి మేరకు మరో రెండేళ్లు వయోపరిమితి పెంచినట్లు జీవోలో సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు.

* కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో జరిగిన చర్చపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా స్పందించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు తన అద్భుత ప్రసంగంతో శాసనసభలో ఒంటిచేత్తో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులందరినీ ఎదుర్కొన్నారని చెప్పారు. కృష్ణా జలాలు, కేఆర్‌ఎంబీకి సంబంధించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం, అబద్ధాలను తిప్పికొట్టారని పేర్కొన్నారు. రేపటి ‘చలో నల్గొండ’కు హరీశ్‌రావు సరైన టోన్‌ సెట్‌ చేశారన్నారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని నల్గొండ వేదికగా కేసీఆర్ తనదైన శైలిలో ఎండగడతారని చెప్పారు.

* వైకాపాలో పలు లోక్‌సభ, అసెంబ్లీ నియోజక వర్గాల ఇన్‌ఛార్జుల మార్పు కొనసాగుతోంది. ఇప్పటికే 6 జాబితాలు ప్రకటించి 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలపై వేటు వేసిన ముఖ్యమంత్రి జగన్‌.. మరికొంత మందిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పలు మార్పులతో ఏడో జాబితాను రూపొందిస్తున్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కసరత్తు చేస్తున్నారు. మార్పులు చేయనున్న నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంతో సీఎంను వారంతా కలిశారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి పలు నియోజకవర్గాల్లో మార్పులు జరుగుతున్నాయి. ఇందుకోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తన కుమారుడిని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒంగోలు ఎంపీగా పార్టీ దాదాపుగా నిర్ణయించిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి అభ్యర్థిత్వాన్ని బాలినేని వ్యతిరేకిస్తున్నారు. పార్టీ అధిష్ఠానం మాత్రం చెవిరెడ్డిని తప్పించేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అవసరమైతే తానే ఒంగోలు ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమని బాలినేని ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. ఈ అంశంపైనా సీఎంవోలో బాలినేని చర్చించారని తెలిసింది. గత ఎన్నికల్లో తెదేపా నుంచి గెలిచి వైకాపాకు మద్దతిస్తోన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్‌ను కలిసి తన సీటు విషయమై చర్చించారు. అలాగే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పలు అంశాలపై చర్చించారు. కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌ను మార్చాలని యోచిస్తోన్న జగన్‌.. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు. ఈ అంశంపై ఆయనతో మాట్లాడినట్లు సమాచారం. టికెట్ కోల్పోయిన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ సీఎంను కలిసి తనకు ఎక్కడో ఓ చోట టికెట్ ఇచ్చి న్యాయం చేయాలని కోరినట్లు తెలుస్తోంది.

* వైకాపా పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ప్రభుత్వ పనితీరులో లోపాలను ప్రస్తావించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. విజయవాడ భాజపా కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. సీఎం వైనాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర ఉందని.. వచ్చే ఎన్నికల్లోనూ దొంగ ఓట్లతో లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు. వైకాపా తమ అభ్యర్థులతోపాటు ఓటర్లను కూడా ఒక చోటు నుంచి మరొక చోటుకు బదిలీ చేస్తోందని ఆరోపించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి వీటిని నిలువరించాలని కోరారు. ఈనెల 20 నుంచి 29 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిల్లో ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ పాలన, నాయకత్వం పట్ల ఆకర్షితులై ఆరు జిల్లాల్లో పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నాయకులు భాజపాలో చేరుతున్నారని తెలిపారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి ఏలూరు రామచంద్రారెడ్డి, కావూరి వాసు, ఐనాబత్తిన సుబ్బారావు, ఖాదర్ వలీసబ్బీ, రామచంద్రారెడ్డి తదితరులకు పురందేశ్వరి భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

* సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సోమవారం ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల్లో ఆయన భాజపాలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ పార్టీ తరఫున రాజ్యసభ టికెట్ దక్కనుందని సమాచారం. ప్రస్తుతం చవాన్.. భోకర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఆయన స్పీకర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. సుమారు నెల రోజుల వ్యవధిలో మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్‌ను వీడిన రెండో కీలక నేత ఈయన. కొద్దిరోజుల క్రితం కేంద్ర మాజీమంత్రి మిలింద్ దేవ్‌రా హస్తం పార్టీ నుంచి బయటకు వెళ్లి, ఏక్‌నాథ్‌ శిందే శివసేనలో చేరారు. అలాగే 48 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగిన సీనియర్ నేత బాబా సిద్ధిక్.. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే.

* తెలంగాణలోని భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫైనల్‌ ‘కీ’ విడుదలైంది. గతేడాది జులైలో నిర్వహించిన ఈ పరీక్షల తుది కీని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

* దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ‘భారతరత్న’ (Bharat Ratna) ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఆయన లేఖలు రాశారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా ఎన్టీఆర్‌ నిలిచారని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z