DailyDose

తెలంగాణాలో గొర్రెల కుంభకోణం-CrimeNews-Feb 22 2024

తెలంగాణాలో గొర్రెల కుంభకోణం-CrimeNews-Feb 22 2024

* గొర్రెల పంపిణీ స్కామ్‌లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో కామారెడ్డి వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రవి, మేడ్చల్‌ పశుసంవర్థకశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌ గణేష్‌ ఉన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన కేసును ఏసీబీ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. దర్యాప్తులో ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై.. నకిలీ బినామీ ఖాతాలతో దాదాపు రూ.2.10 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని అధికారులు తేల్చారు.

* తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐఏడీఎంకే మాజీ నాయకుడు ఏవీ రాజుపై త్రిష (Trisha) న్యాయపోరాటానికి దిగారు. ఈ మేరకు పరువునష్టం దావా వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌ వేదికగా సదరు వివరాలను పంచుకున్నారు. ఇటీవల మీడియా సమావేశంలో ఏవీ రాజు మాట్లాడుతూ.. త్రిషను ఉద్దేశించిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వార్తలు, వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అయ్యాయి. రాజు వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు త్రిషకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో త్రిష స్పందిస్తూ అటెన్షన్‌ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండడం అసహ్యంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఇకపై తాను ఇచ్చే సమాధానం లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచే వస్తుందని హెచ్చరించారు. అన్నట్లుగానే భారీ మొత్తం నష్టపరిహారంగా చెల్లించాలంటూ లీగల్‌ నోటీసులు పంపారు.

* నిర్మాణంలో ఉన్న ఇల్లు కూల్చివేత పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేటలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ తన పాత ఇంటిని బుధవారం కూల్చివేశారు. దానికి ముందు రోజే ఆ ఇంటిలో అద్దెకు ఉన్న అందరినీ ఖాళీ చేయించారు. ఉదయం పాక్షికంగా పనులు చేపట్టగా.. భోజన విరామం అనంతరం పూర్తిగా కూల్చివేశారు. ఇంటిలో స్వామి రెడ్డి అనే వ్యక్తి అద్దెకు ఉండేవారు. బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఖాళీ చేయించిన ఇంటికి వచ్చి లోపల నిద్రపోయాడు. ఆ విషయం తెలియకుండా పూర్తిగా కూల్చివేయడంతో స్వామి రెడ్డి శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* రాష్ట్ర రాజధానిలో నిత్యం ఎక్కడో ఒక చోట హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా గురువారం తెల్లవారుజామున బొల్లారం పరిధిలో వేగంగా కారు నడుపుతూ వచ్చిన ఓ వైద్యుడు.. తోపుడుబండ్లపైకి దూసుకెళ్లాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న పలువురు స్థానికులు వెంటాడి కారును అడ్డగించి వైద్యుడిని పట్టుకున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి నగరంలోని ఓ ఆస్పత్రికి చెందిన న్యూరోసర్జన్‌ అని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సయ్యద్‌ పాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. తన ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తామని చెప్పి బాధితుడిని కారులో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అత్తాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పాషాను చేర్పించి అక్కడి నుంచి వైద్యుడు పరారయ్యాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని.. బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబసభ్యులు వాపోయారు.

* తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో దారుణం జ‌రిగింది. పదో తరగతి విద్యార్థులకు తెలుగులో మార్కులు త‌క్కువ‌గా రావ‌డంతో ఉపాధ్యాయుడు ల‌క్ష్మ‌ణ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌ర్ర‌, డ‌స్ట‌ర్‌తో విద్యార్థుల‌ను విచ‌క్ష‌ణార‌హితంగా చిత‌క‌బాదాడు. ఉపాధ్యాయుడు దాడి చేసిన ఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు గురుకులానికి వ‌చ్చి ఆందోళ‌న‌కు దిగారు. అంత‌టితో ఆగ‌కుండా తెలుగు టీచ‌ర్ ల‌క్ష్మ‌ణ్‌పై దాడి చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ గిరిధర్ రెడ్డి హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న తల్లితండ్రులకు నచ్చచెప్పి ఉపాధ్యాయుడిని పోలీస్టేషన్‌కు తరలించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z