Devotional

తుదిఘట్టానికి మేడారం జాతర-NewsRoundup-Feb242024

తుదిఘట్టానికి మేడారం జాతర-NewsRoundup-Feb242024

* అంబేడ్కర్‌ స్ఫూర్తితో రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ఈశ్వరీబాయి.. ఆరోజుల్లోనే గీతారెడ్డిని డాక్టర్‌ చదవించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాంస్కృతికశాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రవీంధ్రభారతిలో జరిగిన ఈశ్వరీబాయి 33వ వర్ధంతి కార్యక్రమంలో సీఎం, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం తన బాధ్యతగా భావించినట్టు సీఎం చెప్పారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గీతక్క క్రియాశీలకంగా పనిచేశారని, ఆరోగ్య సమస్యలను పక్కనపెట్టి పార్టీకి సేవలందించారన్నారు. అందుకే ఆమె ఇన్‌ఛార్జిగా ఉన్న నల్గొండ జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచామని చెప్పారు. గీతక్క మంత్రి వర్గంలో లేకపోవడం ఒక లోటుగా భావిస్తున్నామని, ఏ అవకాశం ఉన్నా వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు.

* రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీల అమలు విషయంలో సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని భారత ప్రధాన ఎన్నికల కమిషర్‌ రాజీవ్‌కుమార్‌ (CEC Rajiv Kumar) పేర్కొన్నారు. అలాగే తమ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానాలు చేసే హక్కు పార్టీలకు ఉందని చెప్పారు. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఈసీ మాట్లాడుతూ.. పార్టీల హామీలపై ఎన్నికల సంఘం ఒక నమూనా పత్రాన్ని సిద్ధం చేసిందని, అయితే.. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. ‘‘తమిళనాడులో భాజపా, కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీలు.. డీఎంకే, అన్నాడీఎంకే వంటి రాష్ట్ర పార్టీలను కలిశాం. వాటిలో చాలావరకు స్థానికంగా ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాయి. ఓటర్లకు పంపిణీ చేసేందుకు అనేక పార్టీలు నిధులు కూడబెడుతున్నట్లు ఆరోపించాయి. ఈనేపథ్యంలో.. నగదు, మద్యం, ఆన్‌లైన్ ద్వారా డబ్బు బదిలీ వంటి ప్రలోభాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరాయి’’ అని సీఈసీ వెల్లడించారు. ప్రలోభాలను అడ్డుకునేందుకు సంబంధిత సంస్థలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.

* నాలుగు రోజులపాటు అట్టహాసంగా సాగిన మేడారం మహాజాతర తుది ఘట్టానికి చేరుకుంది. జనం వీడి సమ్మక్క-సారలమ్మ మళ్లీ వనంలోకి బయల్దేరారు. అమ్మలు వనానికి కదిలే వేళ మేడారంలో చిరుజల్లులు ఆహ్వానం పలికాయి. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. జాతర ప్రాంగణంలోని విద్యుత్తు దీపాలను ఆర్పేసి.. వెన్నెల కాంతిలో గద్దెల వద్ద తుది పూజలు నిర్వహించారు. ఈ మహా ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

* కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించకముందే.. లోక్‌సభకు పోటీ చేయబోయే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. తొలి విడతగా 100 మందితో జాబితాను (BJP first list) వచ్చేవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

* బస్సులు సహా అన్ని భారీ వాహనాల్లో సీటు బెల్ట్‌ వినియోగాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ (MoRTH)ను అంతర్జాతీయ రహదారి సమాఖ్య (IRF) కోరింది. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖకు ఓ లేఖ రాసింది. ‘బస్సు ప్రమాదాల వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సీటు బెల్ట్‌ ఉంటే వారిలో చాలామంది ప్రమాదం నుంచి బయటపడేవారు. బస్సుల్లోనూ సీట్‌ బెల్ట్‌ ఉండాలి. వాటి వినియోగాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని కేంద్ర రవాణాశాఖకు రాసిన లేఖలో ఐఆర్‌ఎఫ్‌ ప్రెసిడెంట్‌ కపిల కోరారు.

* సామాజిక మాధ్యమాల వేదికగా తరచూ తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు నటి, పవన్‌కల్యాణ్‌ మాజీ సతీమణి రేణూదేశాయ్‌ (Renu Desai). అప్పుడప్పుడు అకీరా (akira nandan), ఆద్యలకు సంబంధించిన విషయాలను సైతం ఆమె వెల్లడిస్తారు. ఇటీవల అకీరాకు తాను ఓ సలహా ఇచ్చానని, నెమ్మదిగా దాన్ని పాటిస్తున్నాడని చెప్పారు. ‘వైర్‌ కలిగిన ఇయర్‌ఫోన్స్‌ వాడమని అకీరా, ఆద్యలకు చెబుతూ వస్తున్నా. ఎందుకంటే బ్లూటూత్‌ టెక్నాలజీ వారి చెవులు, బ్రెయిన్‌కు హాని కలిగించే అవకాశం ఉంది. అప్పటినుంచి అకీరా తన అలవాటును మార్చుకుని ఫ్యాన్సీ వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌ను పక్కనపెట్టి, వైర్‌తో ఉన్న ఇయర్‌ఫోన్స్‌ వాడుతున్నాడు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. రేణూదేశాయ్‌ గతేడాది ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రంతో వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, అతను డబ్బు మనిషి కాదని ఇటీవల పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్‌ చేశారు. పవన్‌ చాలా అరుదైన వ్యక్తి అని, రాజకీయంగా ఆయనకే తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు.

* తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో మంగళగిరి నుంచి పెద్ద ఎత్తున పలువురు తెదేపాలో చేరారు. వారికి పసుపు కండువా కప్పి లోకేశ్‌ పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశంలో ఇప్పటికే పనిచేస్తోన్న నేతలు కొత్త వారితో కలిసి ముందుకు సాగాలని సూచించారు. మంగళగిరి అభివృద్ధి కోసం తన వెంట నడుస్తున్న నేతలకు అభినందనలు తెలిపారు. తాడేపల్లి, మంగళగిరి, చిర్రావూరుకు చెందిన దాదాపు 180 కుటుంబాల వారు పార్టీలో చేరారు. మంగళగిరి నియోజకవర్గానికి తెదేపా-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నారా లోకేశ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z