Movies

నాగబాబు క్షమాపణలు-NewsRoundup-Feb 29 2024

నాగబాబు క్షమాపణలు-NewsRoundup-Feb 29 2024

* సౌర విద్యుత్‌ (solar power) వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం సరికొత్త పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాని అమలు దిశగా మరో ముందడుగు పడింది. ‘పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన (PM-Surya Ghar: Mufti Bijli Yojna)’కు కేంద్ర కేబినెట్‌ గురువారం ఆమోదం తెలిపింది. ఈ పథకంతో కోటి ఇళ్లకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించనుంది. రూ.75,021 కోట్లతో రూఫ్‌టాప్‌ సోలార్‌ స్కీమ్‌ (Rooftop solar scheme)కు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఈ సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు వెబ్‌సైట్‌లో గృహ వినియోగదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

* ఇటీవల జరిగిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine) ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు నటుడు నాగబాబు (Naga Babu) తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా క్షమాపణలు చెబుతూ నోట్‌ విడుదల చేశారు. ‘పోలీస్‌ పాత్ర 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది. 5 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుండదు అని ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాను. ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ఎవరైనా వాటికి నొచ్చుకొని ఉంటే క్షమించండి. అవి యాదృచ్ఛికంగా వచ్చినవే కానీ.. కావాలని అన్న మాటలు కాదు. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు. మరోవైపు నాగబాబు వ్యాఖ్యలపై వరుణ్‌తేజ్‌ కూడా స్పందించారు. ఎత్తుకు సంబంధించి తన తండ్రి చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి కాదన్నారు. తన హైట్‌ను దృష్టిలో పెట్టుకొని చిన్న పోలిక చేశారని.. ఏ హీరోను కించపరిచే ఉద్దేశం లేదన్నారు.

* తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని భారాసకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరిన నేపథ్యంలో.. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) స్పందించారు. ‘‘మీకు ధైర్యముంటే సీఎం, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి.. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఇద్దరం కలిసి మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేసి తేల్చుకుందాం’’ అని ప్రతి సవాల్‌ విసిరారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ముందు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆడబిడ్డలకు రూ.2,500 సహా ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని హితవు పలికారు.

* ఓటమి భయంతో సీఎం జగన్ రోజురోజుకీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. తప్పుడు కేసులతో ప్రత్యర్థులను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కంపెనీలో డైరెక్టర్‌గా, కనీసం షేర్ హోల్డర్ కూడా కాని తన కుమారుడు శరత్‌పై.. కక్షతో జీఎస్టీ ఎగవేతల ఉల్లంఘన కేసులు పెట్టారన్నారు. తన కుమారుడి అరెస్టు నేపథ్యంలో చిలకలూరిపేటలో మీడియాతో ఆయన మాట్లాడారు.

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టాన్ని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సరిగ్గా రూపొందించలేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో కృష్ణా నదిపై ప్రాజెక్టులు, నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) విధివిధానాలపై ఆయన వివరణ ఇచ్చారు. మేడిగడ్డ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరాలు రాష్ట్ర అధికారులు ఇవ్వలేదన్నారు.

* సైకిల్‌కి ఎదురొస్తే తొక్కుకుంటూ ముందుకెళ్లి ఎన్నికల్లో తెదేపా (TDP) జెండా ఎగురవేద్దామని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) పిలుపునిచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరులో ఆమె గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

* మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ గురువారం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. విజయవాడ తెదేపా లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌ కేశినేని చిన్ని ఆయన్ను లోకేశ్‌ వద్దకు తీసుకెళ్లారు. తాను తెదేపాలోనే కొనసాగుతానని ఈ సందర్భంగా జలీల్‌ఖాన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల మద్దతు కూడగడతానని.. పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు.

* కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదని చెప్పే ధైర్యం భారాస అధినేత కేసీఆర్‌కు ఉంటే మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజల కన్నీటి గాథలు చెబుతూ పోతే చాంతాడంత ఉంటుందన్నారు.

* జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. పవన్‌ నమ్మంచి మోసం చేశాడని సీరియస్‌ అయ్యారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు అంటూ ఎద్దేవా చేశారు. కాగా, పవన్‌కు తాజాగా ముద్రగడ లేఖ రాశారు. ఈ లేఖలో ముద్రగడ్ర..‘రెండు పర్యాయాలు కిర్లంపూడి వస్తానని మీరు నాకు కబురు పంపారు. ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి మీతో కలిసి సేవ చేయాలనుకున్నాను. కానీ మీరు నన్ను కలవడానికి మీకు ఎన్నో చోట్ల అనుమతులు అవసరం. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు. పవర్ షేరింగ్ అనేది లేదని అర్ధమైంది.

* ఇద్దరు మహిళల అత్యాచార కేసులో దోషి అయిన డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రామ్‌ రహీమ్‌కు తరచుగా పెరోల్‌ ఇవ్వటంపై హర్యానా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇక నుంచి హైకోర్టు నుంచి కచ్చితమైన అనుమతి లేకుండా రామ్‌ రహీమ్‌కు ఎటువంటి పేరొల్‌ మంజూరు చేయకూడదని హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 19న ఆయన పెరోల్‌ మంజూరు అయింది. ఇప్పటివరకు గడిచిన పది నెలల్లో ఇది ఏడోసారి కాగా, మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో తొమ్మిదోసారి ఆయన పెరోల్‌ పొందారు. తాజాగా ఆయన మరోసారి తనకు పెరోల్‌ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన పంజాబ్‌, హర్యానా హైకోర్టు.. హర్యానా ప్రభుత్వం తీవ్ర అసహం వ్యక్తం చేసింది. గతంలో రమ్‌ రహీం వలే.. ఎంతమంది దోషులకు పెరోల్‌ ఇచ్చారో? ఎన్ని రోజులు ఇచ్చారో? ఎంత మందికి పెరోల్స్‌ ఆమోదం పొందాయో అనే పూర్తి వివరాలు తమకు సమర్పించాలని హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

* తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇప్పటికే పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ప్రభుత్వం.. గురువారం డీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌లో 11వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గురువారం.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విద్యాశాఖ అధికారులతో కలిసి డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నోటిఫికేషన్‌ సందర్బంగా గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరంలేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.

* ప్ర‌ముఖ సినీ, జాన‌ప‌ద నేప‌థ్య గాయ‌కులు వ‌డ్డేప‌ల్లి శ్రీనివాస్ క‌న్నుమూశారు. సికింద్రాబాద్ ప‌ద్మారావున‌గ‌ర్‌లోని త‌న నివాసంలో శ్రీనివాస్ తుదిశ్వాస విడిచారు. ఈ మేర‌కు కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z