DailyDose

వనస్థలిపురంలో పేలుడు-CrimeNews-Mar 20 2024

వనస్థలిపురంలో పేలుడు-CrimeNews-Mar 20 2024

* వనస్థలిపురం రైతుబజార్‌ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. పెట్రోల్‌ బంక్‌ ముందు ఉన్న బ్రెడ్‌ ఆమ్లెట్‌ షాప్‌లో బుధవారం సాయంత్రం గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. పేలుడు శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల్లో షాపు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

* కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో బుధవారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. చేబ్రోలుకు చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)లను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు కత్తితో విచక్షణారహితంగా నరికి హత్య చేశాడు. అనంతరం లోవమ్మ తల్లి రామలక్ష్మిపైనా దాడి చేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా తనతో సహజీవనం చేస్తున్న లోవమ్మ.. ఇటీవల పోసిన శ్రీనుతో కూడా సఖ్యతగా ఉంటోందన్న అనుమానంతో నాగబాబు ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలిని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. పోసిన శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భర్తతో విభేదాల కారణంగా లోవమ్మ ఆయనకు దూరంగా ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

* ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోని తమ ఇంట్లో ఆడుకుంటున్న ఇద్దరు బాలురుని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం హంతకుడు సాజిద్ బాధితుల ఇంటికి ఎదురుగా బార్బర్ షాప్ నడుపుతున్నాడు. అతడికి చిన్నారుల తండ్రితో పరిచయం ఉంది. మంగళవారం సాయంత్రం వారి ఇంటికి వచ్చిన సాజిద్ తన భార్య ఆసుపత్రిలో ఉందని, చికిత్స నిమిత్తం రూ.5,000 అవసరమని వినోద్ భార్య సంగీతను కోరాడు. ఆమె భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో డబ్బు అప్పుగా ఇవ్వమని అతడు సూచించాడు. ఈ క్రమంలో ఆమె వంటగదిలోకి వెళ్లి టీ తయారు చేస్తోంది. అదే సమయంలో ఇంట్లో ఆడుకుంటున్న ఆయుష్‌(12)ను సాజిద్ మేడమీద ఉన్న సంగీత బ్యూటీ సెలూన్‌ను చూపించమని అడిగాడు. ఆ బాలుడు అతడిని మేడ మీదకు తీసుకువెళ్లగా రెండో అంతస్తులో సాజిద్ లైట్లు ఆఫ్‌చేసి ఆయుష్‌పై కత్తితో దాడి చేసి హతమార్చాడు. బాలుడి సోదరులు అహాన్(7), పియూష్‌(6) అదే సమయంలో అక్కడికి రావడంతో వారిపైనా దాడి చేశాడు. దీంతో అహాన్‌ ప్రాణాలు కోల్పోయాడు. అయితే పియూష్‌ దాక్కోవడంతో స్వల్ప గాయాలతో దాడి నుంచి తప్పించుకొన్నాడు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు.. అతడి దుకాణానికి నిప్పంటించారు.

* ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడంపై ప్రశ్నించినందుకు వార్డు సచివాలయం వీఆర్వోపై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో చోటుచేసుకుంది. వైకాపాకు చెందిన సాకే నరసింహులు అనే వ్యక్తి స్థానికంగా ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కంచె వేశాడు. ఆ కంచె తొలగించాలని, స్థలానికి సంబంధించిన పత్రాలు ఏవైనా ఉంటే తీసుకువచ్చి చూపించాలని నరసింహులుకు లక్ష్మీచెన్నకేశవపురం 26వ వార్డు సచివాలయం వీఆర్వో అశోక్‌ మంగళవారం సూచించారు. అనంతరం కంచెను తొలగించారు. దీంతో ఆగ్రహించిన నరసింహులు సచివాలయంలోకి దూసుకువచ్చి.. వీఆర్వో అశోక్‌ను దూషిస్తూ చెంపపై కొట్టాడు. కుర్చీని విసిరికొట్టి, కంప్యూటర్‌ను ధ్వంసం చేశాడు. దాంతో తోటి ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

* చైనా (China)లో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) సంభవించింది. ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌ (Shanxi province)లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ (expressway tunnel) ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో పది మందికి పైగా మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. హుబేయ్ ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 51 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టన్నెల్‌ ఇంటీరియర్‌ వాల్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 37 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z