Politics

విశాఖను నాశనం చేశారు-NewsRoundup-Apr 14 2024

విశాఖను నాశనం చేశారు-NewsRoundup-Apr 14 2024

* ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి చంపాయ్‌ సోరెన్‌పై భాజపా సీనియర్‌ నేత అమర్‌ కుమార్‌ బౌరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఆపద్ధర్మ, ఓ కీలుబొమ్మ సీఎం అన్నారు. మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పన అధికార కేంద్రంగా మారారంటూ ఆరోపించారు. ఝార్ఖండ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న బౌరి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం, జేఎంఎం పార్టీలో లేని కల్పనా సోరెన్‌ ఏ హోదాలో సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. సీఎంగా ఉన్నప్పటికీ చంపాయ్‌ సోరెన్‌ ఎందుకు నిస్సహాయుడిలా ఉంటున్నారో ఆయన్ను అడగాలనుకుంటున్నా. లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఆయనకు జేఎంఎం ఎందుకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడంలేదు?’ అని విమర్శించారు. కల్పనా సోరెన్‌ రాజకీయ జోక్యం వారసత్వ రాజకీయాలకు ఉదాహరణగా నిలుస్తోందన్నారు. ఆమె ఝార్ఖండ్‌లో అధికార కేంద్రంగా మారారన్న ఆయన.. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో అధికారాన్ని సోనియా గాంధీ చెలాయించిన చందంగానే కూడా ఇప్పుడు అదే తరహాలో వ్యవహరిస్తున్నారు’’ అని ఆరోపించారు.

* విశాఖపట్నంను ఐటీ కేంద్రంగా చేయాలని చూస్తే.. జగన్‌ వచ్చి గంజాయి కేంద్రంగా మార్చారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ‘‘మాస్క్‌ అడిగిన పాపానికి ఎస్సీ డాక్టర్‌ సుధాకర్‌ను అవమానించి, హింసించి ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా చేశారు. ఆయన ఆత్మ శాంతించాలంటే వైకాపాను ఓడించాలి. సీఎం జగన్‌ దళిత ద్రోహి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వైకాపాను భూ స్థాపితం చేయాలి. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేశారు. చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్‌. నరేంద్రమోదీ ఆశయం, నా అనుభవం, పవన్‌ కల్యాణ్‌ శక్తి కూడదీసుకుని ఈ రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. కూటమి అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యతమీది.. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది.” అని చంద్రబాబు అన్నారు.

* అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram temple) నిర్మాణం తర్వాత తొలిసారి జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 17న జరగనున్న ఉత్సవాల్లో రాములోరి ప్రసాదంగా భక్తులకు పంచేందుకు భారీ సంఖ్యలో లడ్డూలను తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా 1,11,111 కిలోల లడ్డూలను రామాలయానికి పంపనున్నట్లు యూపీలోని మీర్జాపుర్‌లో దేవ్‌రహ హాన్స్ బాబా ట్రస్టు వెల్లడించింది. కాశీ విశ్వనాథ్‌ లేదా తిరుపతి వేంకటేశ్వరస్వామి వంటి ఆలయాలకు ప్రతి వారం తాము లడ్డూ ప్రసాదాన్ని పంపుతామని ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు. జనవరి 22న అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరిగిన రోజు సైతం ఈ ఆశ్రమం నుంచి 40వేల కిలోల లడ్డూ ప్రసాదం పంపినట్లు ఆయన తెలిపారు.

* కెరీర్‌ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై నటి విద్యాబాలన్‌ (Vidya Balan) తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తొలినాళ్లలోనే స్టార్‌ హీరో చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందని, అనుకోని కారణాలతో ఆయా చిత్రాలు కార్యరూపం దాల్చలేదని వాపోయారు. ముఖ్యంగా మోహన్‌లాల్‌తో చేయాల్సిన సినిమా అర్ధాంతరంగా ఆగిపోవడంతో 12 చిత్రాలు చేజారిపోయాయని చెప్పారు. ‘‘కెరీర్‌ ఆరంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. చాలా మంది నిర్మాతలు సినిమాల్లో అవకాశాలు ఇచ్చినట్టే ఇచ్చి.. ఏదో ఒక కారణం చెప్పి చివరకు నన్ను తొలగించేవారు. దాదాపు మూడేళ్లు ఈ పరిస్థితి కొనసాగింది. అవకాశం చేజారిన ప్రతిసారీ నా హృదయం ముక్కలయ్యేది. ఏడ్చుకుంటూ నిద్రలేని రాత్రులు గడిపా. మోహన్‌లాల్‌తో చేయాల్సిన సినిమా ఆగిపోయిన సమయంలోనే.. నేను నటించాల్సిన మరో మలయాళ మూవీ కూడా నిలిచిపోయింది. దాంతో అన్‌లక్కీ ట్యాగ్‌ వేశారు. అది నన్ను మరింత కుంగదీసింది. ఆ కారణంతో దాదాపు డజను చిత్రాలు కోల్పోయా. పలువురు నిర్మాతలు తమ చిత్రాల్లో నన్ను రీప్లేస్‌ చేసి.. వేరొకరికి అవకాశం ఇచ్చారు’’.

* విపక్ష కూటమి (INDIA) చేస్తున్న ప్రకటనలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. అందులో కొందరు అణు నిరాయుధీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నారని.. అటువంటి వారు దేశాన్ని రక్షించలేరని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని పిపారియాలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ఆయన.. రాహుల్‌ గాంధీ మాటలను దేశ ప్రజలు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. ‘‘విపక్షాల కూటమిలోని కొన్ని భాగస్వామ్య పార్టీలు ప్రమాదకరమైన హామీలు గుప్పించాయి. అందులో ఒకటి అణు నిరాయుధీకరణ చేస్తామని చెప్పడం. శత్రుదేశాలు ఎంతో అణ్వాయుధ శక్తి కలిగిన నేటి ప్రపంచంలో అవి లేకుండా ఎలా? మన దేశాన్ని రక్షించుకోవాలంటే అణ్వాయుధాలు ఉండాల్సిందే. వద్దని చెప్పేవారు దేశాన్ని ఎలా రక్షిస్తారు? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. సీపీఎంను ఉద్దేశిస్తూ పీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

* పార్వతీపురంలో వైకాపా అభ్యర్థి జోగారావు తన నివాసంలో వాలంటీర్లతో రహస్య సమావేశం నిర్వహించారు. విషయం తెలిసి తెదేపా అభ్యర్థి విజయ్‌చంద్ర.. జోగారావు ఇంటికి వెళ్లారు. తెదేపా శ్రేణుల రాకను గమనించిన వాలంటీర్లు అక్కడి నుంచి పరారయ్యారు. విజయ్‌చంద్ర, ఆయన అనుచరులను వైకాపా శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాలంటీర్లు పారిపోతుండగా తెదేపా కార్యకర్తలు వీడియో తీయడంతో వారి ఫోన్లను వైకాపా నాయకులు లాక్కున్నారు. విజయ్‌చంద్ర కారును అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. వైకాపా నాయకులు లాక్కున్న ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

* ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన ‘వారాహి యాత్ర’లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం సాయంత్రం యాత్ర కొనసాగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి పవన్‌పై రాయి విసిరాడు. అయితే, రాయి ఆయనకు తగలకుండా.. సమీపంలో పడింది. వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యకర్తలు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

* ఇరాన్‌(Iran)-ఇజ్రాయెల్‌ (Israel) మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు ఉరుముతున్నాయి. ఇజ్రాయెల్‌కు రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తాజాగా ప్రకటించారు. ‘‘భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్‌ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని నేను నెతన్యాహుకు తెలిపాను. దీంతో శత్రువులు తనను ఏమీ చేయలేరని వెల్లడించినట్లైంది. మేం ఇజ్రాయెల్‌కు ఉక్కుకవచంలా ఉండటానికి కట్టుబడి ఉన్నాం. ఇరాన్‌ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడానికి సాయం చేశాం. మా సైనికులు అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించారు. భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తాం. ఈ దాడులను నేను ఖండిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అంతకు ముందే.. ఆయన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో టెలిఫోన్‌లో మాట్లాడారు. దీంతోపాటు జీ7 దేశాధినేతలతో కూడా బైడెన్‌ సంభాషించనున్నారు. ఇరాన్‌ దాడిపై సమన్వయంతో దౌత్యమార్గంలో స్పందించే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌ నేతలతో తన బృంద సభ్యులు టచ్‌లో ఉంటారని పేర్కొన్నారు.

* ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దుర్మార్గపు పాలన సాగిస్తోందని.. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పలేదా అని ప్రశ్నించారు. దేశంలో అనేక ఘర్షణలకు బీజేపీ విధానం కారణమన్నారు. కర్ణాటక బీజేపీ ఎంపీ రాజ్యాంగాన్ని మారుస్తామని అన్నారని.. తెలంగాణ పుట్టుకను మోదీ అవమానించారన్నారు. తెలంగాణలో ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారని.. మోదీతో జోడీ కట్టకపోతే ఈడీ, సీబీఐ వస్తాయని ఆరోపించారు. ఉత్తర భారతంలో మోదీకి కొరకరాని కొయ్యగా మారిన అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారన్నారు.

* ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆదివారం ఉదయం ఘటనాస్థలిని పరిశీలించిన సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. డ్రోన్ల సహాయంతో ఘటనాస్థలిలో ఏరియల్‌ వ్యూ వీడియోలను చిత్రీకరించారు. ఈ క్రమంలో స్కూల్‌, టెంపుల్‌ మధ్య ఓపెన్‌ ప్లేస్‌ నుంచి దాడి జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనాస్థలంలో క్లూస్‌ సేకరించి ఈసీకి సీపీ కాంతిరాణా టాటా నివేదిక సమర్పించారు.

* సీఎం జగన్‌ను అంతమొందించేందుకు కుట్రలు పన్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే పదునైన రాయితో దాడి చేశారని ఆరోపించారు. కావాలని దాడి చేయించుని కను గుడ్లు పోగొట్టుకుంటారా? అని ప్రశ్నించారు. నుదిటి కాకుండా మరో చోట రాయి తగిలి ఉంటే పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. సీఎం జగన్‌కు భద్రత పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ సమయంలో టీడీపీ సానుభూతి అవసరం లేదని.. దాడి ఘటనపై రాజకీయాలు చేయకపోతే చాలు అని సూచించారు. ఘటనపై ఎన్నికల కమిషన్‌ పూర్తిస్థాయి విచారణ జరిపితే చంద్రబాబు బండారం బయటపడుతుందని అన్నారు. చంద్రబాబుకు ఇలాంటి డ్రామాలు అలవాటే అని మండిపడ్డారు.

* సీఎం జగన్‌పై రాళ్ల దాడి దారుణమని.. ఈ ఘటనను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగేది. కొంచెం కిందకు తగిలిఉంటే కన్ను పోయేది. ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్‌ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు.

* తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ప్రధాన కార్యదర్శి, సీఎం మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ హెలికాప్టర్‌ను ఆదివారం(ఏప్రిల్‌14) ఇన్‌కమ్‌ ట్యాక్స్‌(ఐటీ) అధికారులు తనిఖీ చేశారు. కలకత్తాలోని బెహలా ఫ్లైయింగ్‌ క్లబ్‌లో ఈ తనిఖీలు జరిగాయి. హెలికాప్టర్‌ వెళ్లకుండా ఐటీ అధికారులు చాలా సేపు అడ్డుకున్నారని టీఎంసీ వర్గాలు తెలిపాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z