Business

రాందేవ్ బాబాకు సుప్రీం ప్రశ్నలు-BusinessNews-Apr 23 2024

రాందేవ్ బాబాకు సుప్రీం ప్రశ్నలు-BusinessNews-Apr 23 2024

* ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన ప్లాట్ ఫామ్‌ను ఆల్ ఇన్ వన్ సేవలకు కేంద్రంగా రూపొందించడానికి కసరత్తు చేస్తున్నది. అందుకోసం అనుక్షణం తన కస్టమర్లకు కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్నది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్ తెచ్చిన వాట్సాప్.. తాజాగా ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ షేర్ చేసే సౌకర్యం అందుబాటులోకి తేనున్నది. అంటే ఇక ముందు నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా వాట్సాప్ ద్వారా ఇతరులకు డాక్యుమెంట్లు షేర్ చేయొచ్చు. నెట్ వర్క్ లేకున్నా బ్లూటూత్ సాయంతో షేర్ ఇట్, నియర్ బై షేర్ వంటి యాప్స్ ద్వారా ఫోటోలు, సినిమాలు పంపుతారు. ఇదే సేవలు వాట్సాప్ అందుబాటులోకి తెస్తున్నది. అదే జరిగితే ఫోటోలు, వీడియోలు, కీలక డాక్యుమెంట్లు పంపడానికి మరో యాప్ వాడాల్సిన అవసరం లేదు. అంతే కాదు.. మరింత వేగంగా, సురక్షితంగా డాక్యుమెంట్లను పంపడానికి ఈ ఫీచర్ ఉపయోగ పడతుంది. వాట్సాప్ యూజర్లు ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలంట వాట్సాప్ సిస్టమ్ ఫైల్, ఫోటోల గ్యాలరీ యాక్సెస్ వంటి పర్మిషన్లు ఇవ్వాలి. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగాత్మకంగా బీటా యూజర్లు పరీక్షిస్తున్నారు. త్వరలో వాట్సాప్ యూజర్లందరికీ వినియోగంలోకి రానున్నది.

* దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో.. దేశీయ మార్కెట్లపై ప్రభావం పడుతున్నది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 74వేల పాయింట్ల ఎగువన.. 74,048.94 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 74,059.89 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్‌.. 74,048.94 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 89.84 పాయింట్ల లాభంతో 73,738.45 వద్ద స్థిరపడింది.

* దేశంలో అత్యుత్తమ సంస్థల జాబితాను ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ వేదిక లింక్డ్‌ఇన్‌ విడుదల చేసింది. టాప్‌-25 కంపెనీలతో విడుదలైన ఈ వార్షిక లిస్టులో భారతీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మరోమారు సత్తా చాటింది. తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఈసారీ అగ్రస్థానంలో నిలిచింది. పని చేయడానికి ఉద్యోగులకు అత్యంత అనువైన కంపెనీగా టీసీఎస్‌ను మించినది భారత్‌లో మరొకటి లేదని లింక్డ్‌ఇన్‌ తేల్చింది. విదేశీ ఐటీ కంపెనీలైన యాక్సెంచర్‌, కాగ్నిజెంట్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మొత్తానికి టెక్నాలజీ కంపెనీల హవా స్పష్టంగా కనిపించడం విశేషం.

* తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాకు (Ramdev Baba) చెందిన పతంజలి (Patanjali) ఆయుర్వేద మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఉత్పత్తులకు సంబంధించి ఇచ్చే యాడ్‌ల సైజులోనే క్షమాపణల ప్రకటన ఇచ్చారా? మరి ముందే ఎందుకు ప్రచురించలేదు? అంటూ ప్రశ్నలు సంధించింది. పతంజలి కేసు విచారణ సందర్భంగా ఆ కంపెనీ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ మంగళవారం వాదనలు వినిపించారు. 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని, అందుకోసం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు కోర్టుకు వెల్లడించారు. దీనిపై జస్టిస్‌ హిమా కోహ్లీ స్పందిస్తూ.. ‘‘క్షమాపణలను ప్రముఖంగా ప్రచురించారా? గతంలో ఉత్పత్తుల యాడ్‌లలో ఉపయోగించిన ఫాంట్‌నే వాడారా? అదే సైజ్‌లో క్షమాపణలను పబ్లిష్‌ చేశారా?’’ అని ప్రశ్నించారు. అలాగే రూ.లక్షలు ఖర్చు చేశామన్న రోహత్గీ వాదనపై స్పందిస్తూ.. ‘‘తమకు సంబంధం లేదు’’ అని న్యాయమూర్తి అన్నారు. ఈ నేపథ్యంలో క్షమాపణలు చెబుతూ పెద్ద పరిమాణంలో మరోసారి అదనపు ప్రకటనలు ప్రచురిస్తామని రోహత్గీ కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను ధర్మాసనం ఏప్రిల్‌ 30కి వాయిదా వేసింది. కోర్టు ధిక్కార అంశాన్ని సైతం అప్పుడే విచారిస్తామని పేర్కొంది. పత్రికల్లో వచ్చిన క్షమాపణల ప్రకటనలను రెండు రోజుల్లోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z